Share News

కాల్పుల విరమణకు తూట్లు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు

ABN , Publish Date - Jun 20 , 2026 | 01:42 PM

ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన కొద్ది గంటల్లోనే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులకు పాల్పడటం కలకలం రేపుతోంది. పశ్చిమాసియాలో శాంతి వాతావరణం నెలకొనాల్సిన నేపథ్యంలో తాజా ఘటనతో మరోసారి ఉద్రిక్తతలకు దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

కాల్పుల విరమణకు తూట్లు.. లెబనాన్‌పై ఇజ్రాయెల్ మళ్లీ దాడులు
Israel strikes Lebanon again despite ceasefire

ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన గంటల వ్యవధిలోనే దక్షిణ లెబనాన్‌పై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఈ వైమానిక, డ్రోన్ దాడుల్లో కనీసం ఐదుగురు మృతిచెందగా, పలువురు గాయపడినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి.


లెబనాన్‌లోని నబతియెహ్ ప్రాంతంలోని పలు ప్రాంతాలపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు, డ్రోన్లతో దాడులకు దిగింది. ఈ ఘటనలో అనేక నివాస భవనాలు ధ్వంసమయ్యాయి. కాల్పుల విరమణ అమల్లోకి రావడంతో శాంతి నెలకొంటుందని ఆశించిన స్థానికుల్లో తాజా దాడులు తీవ్ర ఆందోళనకు దారితీశాయి. ఇక.. ఈ దాడులకు ముందు రాత్రి కూడా అదే ప్రాంతంలో భారీ బాంబుదాడులు జరిగినట్లు తెలుస్తోంది. ఈ దాడుల్లో కనీసం 16 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు గాయపడగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు స్థానిక అధికారులు పేర్కొన్నారు.


అమెరికా, ఖతార్, ఇరాన్ దేశాల మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్-హెజ్‌బొల్లా మధ్య శుక్రవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరినట్టు అమెరికా అధికారులు ప్రకటించారు. స్థానిక కాలమానం ప్రకారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఈ అగ్రీమెంట్ అమల్లోకి వచ్చిందన్నారు. దక్షిణ లెబనాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించడం, పశ్చిమాసియాలో శాంతి ప్రయత్నాలకు ఊతమివ్వడం ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. అయితే.. ఒప్పందం అమల్లోకి రాగానే దాడులు కొనసాగడం వల్ల శాంతి ప్రక్రియపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ పరిణామాలతో పశ్చిమాసియాలో మళ్లీ ఉద్రిక్తతలు పెరిగే అవకాశమున్నట్టు పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


ఇవీ చదవండి:

నెతన్యాహు ఓ యోధుడిలాంటి ప్రధాని.. డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు

'మీరు నిశ్శబ్దంగా ఉండండి'.. ఐరాస అధికారిపై ఇజ్రాయెల్ దౌత్యవేత్త ఆగ్రహం

Updated Date - Jun 20 , 2026 | 01:48 PM