Share News

వారి రాక కోసం ఎదురుచూస్తున్నాం: ఇరాన్ విదేశాంగ ప్రతినిధి

ABN , Publish Date - Jul 20 , 2026 | 03:52 PM

ఇరాన్‌పై దాడుల్ని మరింత తీవ్రం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. అమెరికా చేసే ఏ సాహసానికైనా పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

వారి రాక కోసం ఎదురుచూస్తున్నాం: ఇరాన్ విదేశాంగ ప్రతినిధి

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. ఇరాన్‌పై దాడుల్ని మరింత తీవ్రం చేస్తామని అగ్రరాజ్య అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై ఇరాన్ ఘాటుగా స్పందించింది. ఇరాన్ చమురు నిల్వలకు కీలక ప్రాంతమైన ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునేందుకు అమెరికా చేసే ఏ సాహసానికైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఆ దేశ సైన్యం ఎలాంటి భూతల దండయాత్ర చేసినా.. స్వాగతం పలికేందుకు తాము నిమిషాలు లెక్కిస్తున్నామని ఇరాన్ విదేశాంగ ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయి హెచ్చరించారు. 'ఇరాన్‌పై దాడి చేస్తే అమెరికా తీవ్ర పర్యవసానాలు ఎదుర్కోవాలి. ఆ ప్రాంతవాసులు వారి రాక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు' అని ఆయన అన్నారు. ఇరాన్ తీరానికి 55 కి.మీ. దూరంలో బుషెహర్ ప్రావిన్స్‌లో ఉన్న ఖార్గ్.. ఇరాన్ చమురు పరిశ్రమకు అత్యంత ప్రధానమైంది. ఆ దేశ చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఈ ద్వీపమే నిర్వహిస్తోంది.


కాగా.. అమెరికాతో కుదిరిన మధ్యంతర ఒప్పందంపై ఇరాన్ వైఖరిని బఘేయి పునరుద్ఘాటించారు. దానిపై పూర్తి స్పష్టత ఉందని, అందులోని 14 నిబంధనలపై ఎలాంటి సందేహమూ అక్కర్లేదని ఆయన చెప్పుకొచ్చారు. 'హోర్ముజ్ జలసంధి భవిష్యత్తు నిర్వహణ బాధ్యత ఇరాన్‌పైనే ఉంటుందని మేం మొదట్నుంచీ చెబుతూనే ఉన్నాం. అదే విషయాన్ని ఒమన్‌తో సంప్రదింపులు, ప్రాంతీయ దేశాలతో చర్చల ద్వారా ముందుకు తీసుకువెళ్తాం. దౌత్యపరమైన కట్టుబాట్ల నుంచి వాషింగ్టన్ వైదొలగకూడదు. ఈ ఒప్పందం పూర్తి స్పష్టంగా ఉంది. దీనిని ఉల్లంఘించేందుకు అమెరికాకు ఎలాంటి సాకులూ లేవు' అని బఘేయి చెప్పారు.


అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఖార్గ్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకునే ప్రయత్నంతో పాటు సైనిక చర్యలను ముమ్మరం చేయడం గురించి పదేపదే ప్రస్తావించారు. ఒకవేళ ఖార్గ్‌ను యూఎస్ స్వాధీనం చేసుకుంటే.. ఇరాన్ చమురు ఎగుమతులకు కీలకమైన ఆ ప్రదేశంపై అమెరికా సైన్యం నియంత్రణ సాధించి, ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి తెచ్చినట్టువుతుంది. అయితే.. ఖార్గ్‌ను స్వాధీనం చేసుకోవడం, ఆక్రమించుకోవడం వల్ల అమెరికాకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశముందని నిపుణులు భావిస్తున్నారు.


ఇవీ చదవండి:

ఫిఫా ప్రపంచ కప్-2026 అవార్డ్స్: గోల్డెన్ బాల్ ఎవరికంటే?

ఫిఫా పోడియంపై ట్రంప్‌ హల్‌చల్.! చర్చనీయాంశమైన వీడియో

Updated Date - Jul 20 , 2026 | 04:27 PM