Share News

హోర్ముజ్ జలసంధి వివాదం.. ఆర్టికల్-5 ఏం చెబుతోంది?

ABN , Publish Date - Jun 29 , 2026 | 03:17 PM

హోర్ముజ్‌లో మరోసారి ఉద్రిక్తతలు పెరగడంతో ఆర్టికల్-5 అంశం తెరమీదకు వచ్చింది. ఈ నేపథ్యంలో అసలేంటీ ఆర్టికల్-5? అందులో ఏముంది?

హోర్ముజ్ జలసంధి వివాదం.. ఆర్టికల్-5 ఏం చెబుతోంది?

ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్-అమెరికా మధ్య ఇటీవల కుదిరిన తాత్కాలిక అవగాహన ఒప్పందంలోని ఆర్టికల్-5 అమలుపై భిన్న వాదనలు వినిపిస్తుండటంతో హోర్ముజ్ జలసంధి ప్రాంతంలో ఉద్రిక్తతలు మరలా పెరిగాయి. వాణిజ్య నౌకల సురక్షిత ప్రయాణ అంశమే ఈ వివాదానికి కేంద్ర బిందువుగా మారింది. జూన్ 17న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ ప్రెసిడెంట్ మసూద్ పెజెష్కియాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందం ప్రకారం.. ఉద్రిక్తతల్ని తగ్గించి చర్చలకు మార్గం సుగమం చేయాలి. దీంతోపాటు ఆంక్షల ఉపశమనం, అణు కార్యక్రమం వంటి కీలక అంశాలపై ముందడుగు వేయాలి. అయితే.. అగ్రీమెంట్ అమల్లోకి వచ్చిన కొద్దిరోజుల్లోనే హోర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకపై దాడి జరిగిందని, ప్రతిగా అమెరికా చర్యలకు దిగిందని స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ఈ ఘటన అనంతరం ఇరుపక్షాలు ఒకరిపై ఒకరు ఆర్టికల్-5 ఉల్లంఘన ఆరోపణలు చేసుకుంటున్నాయి.


ఆర్టికల్-5లో ఏముందంటే?

ఆర్టికల్-5 ప్రకారం హోర్ముజ్ జలసంధి ద్వారా వాణిజ్య నౌకలు సురక్షితంగా, తాత్కాలికంగా 60 రోజులపాటు ఎలాంటి రుసుములు లేకుండా ప్రయాణించేందుకు ఇరాన్ చర్యలు తీసుకోవాలని పేర్కొంది. అలాగే 30 రోజుల్లో సాంకేతిక అడ్డంకులు, సైనిక మైన్లను తొలగించాలని కూడా సూచించింది. దీంతో పాటు ఒమన్‌తో చర్చలు జరిపి భవిష్యత్తులో సముద్ర మార్గ నిర్వహణపై నిర్ణయం తీసుకోవాలని కూడా ఈ ఒప్పందం పేర్కొంటోంది.


అయితే.. అమెరికా, యూఏఈ హోర్ముజ్‌ను అంతర్జాతీయ వాణిజ్య మార్గంగా స్వేచ్ఛగా ఉంచాలని కోరుతున్నాయి. కానీ ఇరాన్ మాత్రం ఒప్పందం ప్రకారం.. భద్రతా ఏర్పాట్లు తాత్కాలికంగా తమ నియంత్రణలోనే ఉండాలని వాదిస్తోంది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ కూడా దీనిని సమర్థించారు. అయితే.. అమెరికా దీనికి ససేమిరా అంటుండటంతో నౌకా మార్గం, నియంత్రణపై విభేదాలు తలెత్తాయి.

కాగా.. ఒప్పందంలోని నిబంధనలను అమెరికా కొత్తగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తోందని, ఇరాన్ మాత్రం తన నియంత్రణను కొనసాగించాలని పట్టుబడుతోందని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ విభేదాలే తాజా ఉద్రిక్తతలకు కారణమని వారు చెబుతున్నారు. ప్రపంచ చమురు సరఫరాలో సింహభాగం హోర్ముజ్ జలసంధి మార్గంలోనే వెళ్తున్నందున.. అక్కడ ఏ చిన్న ఉద్రిక్తత నెలకొన్నా అంతర్జాతీయంగా ప్రభావం చూపే అవకాశముంది.


ఇవీ చదవండి:

జైపుర్‌లో విషాదం.. గోడ కూలడంతో ముగ్గురు కార్మికుల మృతి

కేతన్ మర్డర్ కేసు.. అరగంట ముందు ప్రియుడితో 'సీక్రెట్ కాల్'!

Updated Date - Jun 29 , 2026 | 03:37 PM