దోషులకు 220 ఏళ్ల జైలు శిక్ష.. 2019 బాంబు పేలుళ్ల కేసులో శ్రీలంక కోర్టు సంచలన తీర్పు
ABN , Publish Date - Sep 23 , 2026 | 07:30 AM
2019 శ్రీలంక ఉగ్రదాడుల కేసులో ఆ దేశ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 15 మంది దోషులకు 220 ఏళ్ల జైలు శిక్ష విధించింది.
ఇంటర్నెట్ డెస్క్: 2019 శ్రీలంక ఉగ్రదాడుల కేసులో ఆ దేశ హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులుగా ఉన్న 15 మందిని దోషులుగా తేల్చింది. అలాగే దోషులు ఒక్కొక్కరికి 220 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్టు మంగళవారం ప్రకటించింది. ముగ్గురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఈ నిర్ణయం తీసుకుంది. దోషులకు చెందిన అన్ని ఆస్తులూ జప్తు చేయాలని ఈ సందర్భంగా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
శ్రీలంకలో 2019 ఏప్రిల్ 21న జరిగిన బాంబు పేలుళ్లు 279 మందిని బలి తీసుకున్నాయి. ఈస్టర్ ప్రార్థనల వేళ మూడు లగ్జరీ హోటళ్లు, మూడు చర్చిలను ఉగ్రవాదులు లక్ష్యంగా చేసుకుని దాడులు జరిపారు. శ్రీలంక చరిత్రలోనే ఈ ఘటన అత్యంత భయంకరమైన టెర్రరిస్ట్ అటాక్‌గా పేరుపొందింది.
ఈ కేసుపై విచారణ చేపట్టిన హైకోర్టు 15 మంది నిందితులను దోషులుగా తేల్చి.. 220 ఏళ్ల జైలు శిక్ష విధించింది. మరో 9 మంది నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది. కాగా ఈ కేసులో దోషులకు ఉరిశిక్ష పడే అవకాశముందని స్థానిక మీడియా తెలిపింది. కానీ శ్రీలంక న్యాయస్థానం1976 నుంచి ఉరిశిక్షలను అమలు చేయలేదు. జీవిత ఖైదు విధింపునే ఆ కోర్టు మరణశిక్షగా పరిగణిస్తోంది.
మరోవైపు హైకోర్టు తాజా తీర్పుపై ఆ దేశ రోమన్ కాథలిక్ చర్చి హర్షం వ్యక్తం చేసింది. చివరికి తమకు న్యాయం దొరికిందని పేర్కొంది. అలాగే ఈ బాంబు పేలుళ్లు ఘటనలో తీవ్ర గాయాలపాలైన బాధితుడు థెరీసా ఫెర్నాండో కోర్టుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలూ చదవండి
ఎస్సీ ఎస్టీ చట్ట సవరణను వ్యతిరేకించిన పిల్ కొట్టివేత
మతవిశ్వాసాల వల్లనో, మనస్సాక్షి అంగీకరించనందునో..వందేమాతరం పాడకపోతే శిక్షించొద్దు