Share News

మతవిశ్వాసాల వల్లనో, మనస్సాక్షి అంగీకరించనందునో..వందేమాతరం పాడకపోతే శిక్షించొద్దు

ABN , Publish Date - Sep 23 , 2026 | 03:06 AM

మతవిశ్వాసాల కారణంగా (లేదా) మనస్సాక్షి అంగీకరించని కారణంగా వందేమాతర గేయాన్ని పూర్తిగా పాడనివారిని శిక్షించకూడదని సుప్రీంకోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది. ఇదే ప్రాతిపదికన.. జాతీయ గీతాన్ని పాడడానికి తిరస్కరించిన పిల్లలకు రక్షణ కల్పిస్తూ 1986లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుంచుకోవాలని సూచించింది.

మతవిశ్వాసాల వల్లనో, మనస్సాక్షి అంగీకరించనందునో..వందేమాతరం పాడకపోతే శిక్షించొద్దు
SUPREMECOURT

  • కేంద్రానికి స్పష్టం చేసిన సుప్రీంకోర్టు

  • కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ దాఖలు

చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా కీలక వ్యాఖ్యలు

  • కేంద్రం స్పందన తెలియజేయడానికి 2 వారాల గడువు

  • చట్టాల రూపకల్పన నక్సలైట్ల ఆలోచనల మేరకు జరగదు

  • లౌకికవాదం మరీ ఇంత సంకుచితంగా ఉండకూడదు

  • కేంద్రం తరఫున వాదించిన తుషార్‌ మెహతా వ్యాఖ్యలు

  • ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని పిటిషనర్‌

తరఫు న్యాయవాది డిమాండ్‌.. ససేమిరా అన్న మెహతా

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: మతవిశ్వాసాల కారణంగా (లేదా) మనస్సాక్షి అంగీకరించని కారణంగా వందేమాతర గేయాన్ని పూర్తిగా పాడనివారిని శిక్షించకూడదని సుప్రీంకోర్టు కేంద్రానికి స్పష్టం చేసింది. ఇదే ప్రాతిపదికన.. జాతీయ గీతాన్ని పాడడానికి తిరస్కరించిన పిల్లలకు రక్షణ కల్పిస్తూ 1986లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును గుర్తుంచుకోవాలని సూచించింది. దీనిపై స్పందనను తెలియజేయడానికి కేంద్రానికి రెండువారాల గడువు ఇచ్చింది. వందేమాతర గేయంలోని మొత్తం ఆరు చరణాలనూ పాడడం తప్పనిసరి చేస్తూ కేంద్రం జూలైలో విడుదల చేసిన మార్గదర్శకాలను, జాతీయ గౌరవానికి అవమానాన్ని నిరోధించే చట్టానికి చేసిన సవరణ రాజ్యాంగబద్ధతను సవాల్‌ చేస్తూ ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసుడు టీఎం కృష్ణ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్‌ దాఖలు చేశారు. వందేమాతరంలోని చివరి నాలుగు చరణాలూ దేశ లౌకిక స్వభావానికి విరుద్ధంగా ఉన్నాయని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ చరణాలలో దుర్గ, లక్ష్మి, సరస్వ తి వంటి హిందూ దేవతల స్పష్టమైన ప్రస్తావనలు ఉన్నాయని.. వాటిని పాడాలంటూ పౌరులను బలవంతం చేయడం మతపరమైన, భావజాలపరమైన ప్రమాణాలను బలవంతంగా రుద్దడమేనని.. ఇది రాజ్యాంగానికి ఉన్న లౌకిక స్వభావానికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు. ఈ పిటిషన్‌పై.. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్‌ వి.మోహనలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ జరిపింది. విచారణ సందర్భంగా పలు కీలక వ్యాఖ్యలు చేసింది.


బిజోయ్‌ ఇమ్మాన్యుయేల్‌ వర్సెస్‌ స్టేట్‌ ఆఫ్‌ కేరళ కేసులో 1986లో అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పే ఈ సవరించిన చ ట్టానికీ వర్తిస్తుందని తాము భావిస్తున్నట్లు.. కేంద్రం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఉద్దేశించి జస్టిస్‌ జోయ్‌మాల్యా బాగ్చీ పేర్కొన్నారు (ఆ కేసులో.. మనస్సాక్షి కారణాలతో జాతీయ గీతాన్ని పాడేందుకు నిరాకరించిన పాఠశాల విద్యార్థులకు అత్యున్నత న్యాయస్థానం అప్పట్లో రక్షణ కల్పించింది). ‘‘జాతీయ గేయంగా ఏది ఉండాలి? అందులో రెండు చరణాలు పాడా లా? నాలుగు చరణాలూ పాడాలా? అనేది ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటైన ప్రభుత్వం నిర్ణయించాలి. కానీ.. ఆ చరణాలను పాడడం రాజ్యాంగంలోని 25, 26 అధికరణలు తమకు ప్రసాదించిన మత స్వాతం త్య్ర హక్కుకు ఉల్లంఘనగా భావించేవారిని, మనస్సాక్షి అంగీకరించని కారణంగా వాటిని పాడబోమన్నవారిని శిక్షించకూడదు’’ అని జస్టిస్‌ బాగ్చీ పేర్కొన్నారు. వందేమాతరంతో ముడిపడి ఉన్న జాతీయ మనోభావాలు, ఆకాంక్షలు ఏమిటో అంచనా వేయడం కోర్టు పరిధిలోకి రాదని, అది ప్రభుత్వం నిర్ణయించాల్సిన విషయమని స్పష్టం చేశారు. మతవిశ్వాసాల కారణంగానో, మనస్సాక్షి అంగీకరించని కారణంగానో ఎవరైనా జాతీయ గేయాన్ని పాడడానికి నిరాకరిస్తే వారి హక్కులకు చట్టపరమైన రక్షణ ఉన్నదా లేదా అనే అంశాన్ని మాత్రమే తాము పరిశీలిస్తామ ని.. జాతీయగేయంలోని ఒక చరణాన్ని లేదా అన్ని చరణాలనూ పాడకూడదని నిర్ణయించుకోవడం వ్యక్తిగత నిర్ణయమని, అలా పాడనివారిపై ప్రభు త్వం చర్యలు తీసుకోకూడదని అభిప్రాయపడ్డారు.

సరైన నిర్వచనం ఇవ్వకుండానే..

కేంద్రం సవరించిన చట్టంలో జాతీయ గేయం అనే పదానికి సరైన నిర్వచనం లేదని, ఏ వెర్షన్‌ (లేదా) ఎన్ని చరణాలను జాతీయగేయంగా పరిగణిస్తారో నిర్వచించకుండానే ఈ సవరణ చేశారని.. పిటిషన్‌ టీఎం కృష్ణ తరఫున వాదనలు వినిపించిన సీనియర్‌ న్యాయవాది ఎస్‌ మురళీధర్‌ కోర్టుకు తెలిపారు. స్పష్టమైన నిర్వచనాలు, పరిమితులు లేకపోవడం వల్ల అనిశ్చితి ఏర్పడి ఆ చట్టం దుర్వినియోగమయ్యే ప్రమాదం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.


అలాగే.. కేంద్ర హోం శాఖ వందేమాతరం ఆలాపనకు సంబంధించిన మార్గదర్శకాలను కేవలం ఆఫీసు మెమో ద్వారా జారీ చేసిందని.. వాటిని గెజట్‌లో ప్రచురించలేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఈ దశలో జస్టిస్‌ బాగ్చీ జోక్యం చేసుకుని.. వందేమాతరాన్ని జాతీయగేయంగా పరిగణిస్తున్న విషయాన్ని గుర్తుచేయగా.. అది మొదటి రెండు చరణాలకు మాత్రమే వర్తిస్తుందని మురళీధర్‌ అన్నారు. వందేమాతరంపై గతంలో ఉన్న ఈ అవగాహనను కేంద్రం కేవలం కార్యనిర్వాహకఉత్తర్వుల ద్వారా మార్చేసిందని పేర్కొన్నారు. ఎలాంటి జాతీయ ఏకాభిప్రాయం లేకుండానే తొందరపాటుతో సవరణ చట్టాన్ని చేశారని ఆయన కోర్టుకు నివేదించారు.

తీవ్ర వాగ్వాదం..

వాదనల సందర్భంగా.. టీఎం కృష్ణ తరఫున వాదించిన మురళీధర్‌, కేంద్రం తరఫున వాదనలు వినిపించిన తుషార్‌ మెహతా మధ్య వాడివేడిగా వాగ్వాదం జరిగింది. మురళీధర్‌ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన తుషార్‌ మెహతా.. ‘లౌకికవాదం మరీ ఇంత సంకుచితంగా ఉండకూడదు’ అని వ్యాఖ్యానించారు. ఒకదశలో.. ‘‘చట్టాల రూపకల్పన నక్సలైట్ల ఆలోచనల ప్రకారం జరగదు’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలపై మురళీధర్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఒక ఉన్నత న్యాయాధికారి అలాంటి వ్యాఖ్యలు చేయడం తగదని.. ఆ వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. దీనికి మెహతా.. చట్టాలను రూపొందించే ప్రక్రియను గౌరవించని వారిని ఉద్దేశించి తాను ఆ వ్యాఖ్యలు చేశానని సమర్థించుకున్నారు. కాగా.. వారిద్దరి మధ్య ఈ వాగ్వాదం జరుగుతున్న సమయంలో ధర్మాసనం జోక్యం చేసుకోలేదు

ఈ వార్తలను చదవండి

ఆ నోటీసులకు కారణం ఏంటి.. ఈసీకి సుప్రీం ప్రశ్న

డాక్టర్ నా కళ్లను తీసేశారు’.. మొబైల్‌ అవగాహన కార్యక్రమంలో చిన్నారుల్లో భయం

Updated Date - Sep 23 , 2026 | 03:06 AM