భారత్‌కు శిక్ష వద్దు.. అమెరికాకు జేపీ మోర్గన్ ఛేజ్ సీఈఓ సూచన
ABN , Publish Date - Sep 22 , 2026 | 08:16 PM
రష్యా చమురు విషయంలో సుంకాల విధింపుపై పునరాలోచించుకోవాలని జేపీ మోర్గన్ ఛేజ్ సంస్థ సీఈఓ జేమీ డైమన్ సూచించారు. సుంకాలతో ప్రపంచమార్కెట్లపై పడే ప్రభావం పరిగణనలోకి తీసుకుని నిర్ణయానికి రావాలని సూచించారు.
ఇంటర్నెట్ డెస్క్: రష్యా చమురును కొనుగోలు చేసే దేశాలపై 100 శాతం సుంకాలకు అవకాశం కల్పించే చట్టంపై యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా సంతకం చేశారు. ఈ చట్టం కింద చైనా, భారత్ లాంటి దేశాలపై 100 శాతం సుంకాలు విధించే అధికారం ట్రంప్‌నకు ఉంటుంది. అయితే, సుంకాల విధింపుపై పునరాలోచించుకోవాలని జేపీ మోర్గన్ ఛేజ్ సంస్థ సీఈఓ జేమీ డైమన్ సూచించారు. సుంకాలతో ప్రపంచమార్కెట్లపై పడే ప్రభావం పరిగణనలోకి తీసుకుని తుది నిర్ణయానికి రావాలని సూచించారు.
‘ఈ విషయాలపై అమెరికా కూలంకషంగా ఆలోచిస్తుందనే భావిస్తున్నాను. భారత్‌కు, ప్రపంచ ఆయిల్ మార్కెట్లకు ఈ సుంకాలు శిక్షగా మారవనే అనుకుంటున్నా’ అని డైమన్ అన్నారు. మస్కోపై ఒత్తిడి పెంచేందుకు సుంకాలు సరైన మార్గమేనా? అనే సందేహాన్ని కూడా వ్యక్తం చేశారు.
రిఫైనరీలు ఏయే రకాల ముడిచమురును వినియోగించవచ్చే విషయంలో పలు పరిమితులు ఉన్నాయని కూడా డైమన్ చెప్పారు. కాబట్టి ఒక దేశ ముడి చమురుకు బదులు మరో దేశ ముడి చమురును దిగుమతి చేసుకోవడం అంత సులభం కాదని వివరించారు. రష్యా ముడి చమురుపై ఆంక్షలు ఆదేశానికే పరిమితం కాకుండా యావత్ ఇంధన మార్కెట్‌పై ఉంటుందని హెచ్చరించారు. ఇక ముడి చమురు కొనుగోళ్లపై తన విధానాన్ని భారత్ ఇప్పటికే తన విధానాన్ని సమర్థించుకుంది. దేశ ప్రజల ప్రయోజనాలే తమకు ముఖ్యమని భారత్ స్పష్టం చేసింది.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాలో వందల విమానాలు రద్దు.. కమ్యూనికేషన్ కేబుల్ తెగిపోవడమే కారణం..
అమెరికా మరో అస్త్రం.. ఇరాన్ విమానాలపై ప్రపంచవ్యాప్తంగా ఆంక్షలు..