అమెరికాలో వందల విమానాలు రద్దు.. కమ్యూనికేషన్ కేబుల్ తెగిపోవడమే కారణం..
ABN , Publish Date - Sep 22 , 2026 | 10:45 AM
అమెరికాలో విమాన రాకపోకలకు సోమవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. కీలకమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రంలో సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో న్యూయార్క్ ప్రాంతంలోని ప్రధాన విమానాశ్రయాల్లో విమానాలను గంటల తరబడి నిలిపివేశారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికాలో విమాన రాకపోకలకు సోమవారం తీవ్ర అంతరాయం ఏర్పడింది. కీలకమైన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రంలో సమాచార వ్యవస్థ దెబ్బతినడంతో న్యూయార్క్ ప్రాంతంలోని ప్రధాన విమానాశ్రయాల్లో విమానాలను గంటల తరబడి నిలిపివేశారు. దీంతో వందలాది విమానాలు రద్దయ్యాయి. వేలాది విమానాలు ఆలస్యమయ్యాయి. ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయాల్లోనే ఉండిపోయారు (US flights cancelled).
ఫిలడెల్ఫియాలోని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (FAA) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కేంద్రంలో కీలకమైన సమాచార ప్రసార వ్యవస్థలో సమస్య ఏర్పడింది. ప్రాథమిక కమ్యూనికేషన్ లైన్ పనిచేయకపోవడంతో వ్యవస్థ బ్యాకప్ లైన్‌కు మారేందుకు ప్రయత్నించింది. అయితే అదే సమయంలో న్యూజెర్సీలో నిర్మాణ పనుల సందర్భంగా బ్యాకప్ ఫైబర్ ఆప్టిక్ కేబుల్ కూడా తెగిపోయింది. దీంతో ఎఫ్‌ఏఏ వందల సంఖ్యలో విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది (Air traffic control malfunction).
మొత్తంగా అమెరికా వ్యాప్తంగా దాదాపు 7,000 విమానాలు ఆలస్యం లేదా రద్దు అయ్యాయి (Newark airport flights). న్యూయార్క్ ప్రాంతంలోని మూడు ప్రధాన విమానాశ్రయాల్లోనే సుమారు 1,400 విమానాలు ప్రభావితమయ్యాయి. ప్రస్తుతం న్యూయార్క్‌లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశాలు జరుగుతున్నాయి. ప్రపంచంలోని వివిధ దేశాల అధినేతలు, మంత్రులు న్యూయార్క్‌కు చేరుకుంటున్న సమయంలో ప్రధాన విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోవడంతో పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది.
ఇవి కూడా చదవండి..
ఆ మీడియా సంస్థలు కేన్సర్‌లాంటివి.. ట్రంప్ తీవ్ర విమర్శలు..
మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..