దక్షిణాఫ్రికాలో వరుస కాల్పులు.. 27 మంది దుర్మరణం
ABN , Publish Date - Sep 27 , 2026 | 05:08 PM
దక్షిణాఫ్రికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. రెండు వేర్వేరు చోట జరిగిన రెండు ఘటనల్లో మొత్తం 27 మంది మృతిచెందారు.
ఇంటర్నెట్ డెస్క్: దక్షిణాఫ్రికాలో వరుస కాల్పుల ఘటనలు కలకలం రేపాయి. జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్ సమీపంలోని రెండు టౌన్‌షిప్‌లలో జరిగిన వేర్వేరు కాల్పుల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది గాయపడ్డారు.
జోహన్నెస్‌బర్గ్‌లోని గౌటెంగ్ ప్రావిన్సులో శనివారం రాత్రి ఓ టావెర్న్ వద్ద కాల్పులు జరిగాయి. పోలీసుల కథనం ప్రకారం.. పలువురు అనుమానితులు ఏకే-47 రైఫిళ్లు, పిస్టళ్లతో తొలుత బయటున్న వారిపై కాల్పులు జరిపి.. ఆ తర్వాత లోపలికి ప్రవేశించి కాల్పులు కొనసాగించినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో నలుగురు మహిళలు సహా మొత్తం 17 మంది మృతిచెందారు. సుమారు 15 మందికి గాయాలయ్యాయి. దాడి అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. అయితే.. ఈ ఘటనకు సంబంధించిన కారణాలు ఏమిటనేది ఇంకా తెలియరాలేదు.
మరోవైపు.. కేప్‌టౌన్ సమీపంలోని లాండ్‌వేల్‌లో నేడు(ఆదివారం) తెల్లవారుజామున జరిగిన మరో కాల్పుల ఘటనలో 10 మంది అక్కడికక్కడే మృతిచెందారు. ఈ ఘటనలో సుమారు 11 మంది క్షతగాత్రులయ్యారు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులెవరనే వివరాలేమీ తెలియరాలేదు. అయితే.. ఈ రెండు ఘటనలకు సంబంధించిన నిందితుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్టు తెలుస్తోంది.
ఇవీ చదవండి:
‘ఉగ్రవాదంపై జీరో టాలరెన్స్’.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ
ఫోన్ స్టోరేజీ నిండిపోయిందా? ఈ 5 చిట్కాలతో బోలెడంత స్పేస్ పొందండిలా