Share News

యుద్ధం ముగింపు దిశగా ఇరాన్!.. యురేనియం నిల్వల తరలింపు!

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:44 AM

అమెరికాతో యుద్ధానికి త్వరలో ముగింపు పలికేందుకు ఇరాన్ ఒక ఒప్పందానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తన వద్ద ఉన్న శుద్ధిచేసిన యురేనియం నిల్వలను మరో దేశానికి తరలించడం లేదా వాటి శుద్ధి స్థాయిని తగ్గించడం వంటి ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.

యుద్ధం ముగింపు దిశగా ఇరాన్!.. యురేనియం నిల్వల తరలింపు!

ఇంటర్నెట్ డెస్క్: అమెరికాతో యుద్ధానికి త్వరలో ముగింపు పలికేందుకు ఇరాన్ ఒక ఒప్పందానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా తన వద్ద ఉన్న శుద్ధిచేసిన యురేనియం నిల్వలను మరో దేశానికి తరలించడం లేదా వాటి శుద్ధి స్థాయిని తగ్గించడం వంటి ప్రతిపాదనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే, ఇరాన్‌-అమెరికా మధ్య శాంతి ఒప్పందం కుదిరిన ఏడు రోజుల్లోగా హోర్ముజ్ జలసంధిని అంతర్జాతీయ వాణిజ్యం కోసం తిరిగి తెరిచే అవకాశం ఉందని అల్ అరేబియా ఇంగ్లిష్ వార్తా సంస్థ వెల్లడించింది. ఆ ఒప్పందంపై ఇరాన్, అమెరికా మధ్య ఖతార్ రాజధాని దోహాలో జరిగే అవకాశం ఉందని సమాచారం. తొలుత టర్కీ రాజధాని ఇస్తాంబుల్‌లో చర్చలు జరపాలని భావించినా.. ఆ వేదికను దోహాకు మార్చేందుకు పరిశీలిస్తున్నట్లు తెలుస్తోందని ఆ వార్తా సంస్థ ఒక కథనం వెలువరించింది. శాంతి ఒప్పందం అమలు, కొనసాగింపులో చైనా హామీదారుగా ఉండవచ్చని పేర్కొంది.


కాగా.. ఇరాన్ తన యురేనియం నిల్వలను తరలించడం, హోర్ముజ్ జలసంధిని తెరవడం వంటి చర్యలు చేపడితే.. అందుకు ప్రతిగా అమెరికా ఆ దేశంపై ఆంక్షలు, దిగ్బంధనాలను సడలించాల్సి ఉంటుంది. ఒప్పందం అమలుకు ముందు ఇరు దేశాలు తమ తమ హామీలను పాటిస్తున్నాయా లేదా అన్నది స్వతంత్ర వ్యవస్థ ద్వారా పరిశీలిస్తారు. ఒప్పందానికి సంబంధించిన ఉల్లంఘనలు జరిగితే.. మధ్యవర్తులు, హామీదారుల ద్వారా పరిష్కరించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం. తద్వారా మళ్లీ యుద్ధ పరిస్థితులు తలెత్తకుండా చూడవచ్చని భావిస్తున్నారు.


యుద్ధం కరెక్టే.. సమర్థించుకున్న ట్రంప్

ఇరాన్ అణ్వాయుధాలను తయారు చేసుకోకుండా అడ్డుకోవడమే తమ లక్ష్యమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గతంలో చాలాసార్లు స్పష్టం చేశారు. అయితే, తమ అణు కార్యక్రమం కేవలం పౌర అవసరాల కోసమేనని ఇరాన్ చెబుతోంది. మరోవైపు యుద్ధం కొనసాగుతుండడంతో ట్రంప్‌పై అమెరికాలో ఒత్తిడి పెరుగుతోంది. నవంబర్ 3న జరగనున్న మధ్యంతర ఎన్నికల నేపథ్యంలో ఇరాన్‌తో యుద్ధంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యుద్ధం కారణంగా డీజిల్ ధరలు పెరిగాయని ట్రంప్ విమర్శకులు మండిపడుతున్నారు. అయితే, ట్రంప్ మాత్రం తన చర్యలను సమర్థించుకున్నారు. ఇరాన్ అణ్వాయుధాలను పొందకుండా అడ్డుకోవడంలో అమెరికా విజయం సాధించిందని మీడియాతో మాట్లాడుతూ ఆయన పేర్కొన్నారు. అమెరికాతో చర్చలు జరపాలని ఇరాన్ కోరుకుంటోందని, ఆ దేశ ఆర్థిక పరిస్థితి దారుణంగా ఉందని ఆయన అన్నారు. సైనికులు, పోలీసులకు జీతాలు చెల్లించేందుకు కూడా ఇరాన్ ఇబ్బందులు పడుతోందని వ్యాఖ్యానించారు.


ఈ వార్తలనూ చదవండి:

శబరిమలై రైళ్లు ఫుల్‌

ఎల్ నినో వెళ్లిపోయాక.. వర్షాలే వర్షాలు?

Updated Date - Oct 31 , 2026 | 12:26 PM