Share News

మక్కా మసీదులో ఆత్మాహుతి దాడి?.. సౌదీ అరేబియా కీలక ప్రకటన

ABN , Publish Date - Oct 02 , 2026 | 04:46 PM

మక్కా గ్రాండ్‌ మసీదు ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి ప్రయత్నం జరిగిందంటూ వైరల్‌ అవుతున్న వార్తలను సౌదీ అరేబియా ఖండించింది. అదుపులోకి తీసుకున్న వ్యక్తి బాంబర్‌ కాదని, సోషల్ మీడియాలో ప్రసారం అవుతున్న కథనాలు అవాస్తవమని స్పష్టం చేసింది.

మక్కా మసీదులో ఆత్మాహుతి దాడి?.. సౌదీ అరేబియా కీలక ప్రకటన
Saudi Responds On Suicide Bomber Video

ఇంటర్నెట్ డెస్క్: మక్కాలోని గ్రాండ్‌ మసీదు ప్రాంతంలో ఆత్మాహుతి దాడికి ప్రయత్నం జరిగిందంటూ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న వార్తలను సౌదీ అరేబియా ఖండించింది. అక్కడ ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్న మాట వాస్తవమేనని తెలిపింది. కానీ అతడు బాంబర్‌ కాదని స్పష్టం చేసింది.


సౌదీ జనరల్‌ డైరెక్టరేట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ సెక్యూరిటీ ప్రకారం.. మక్కాలో ఓ వ్యక్తి అటుగా వెళ్తున్న వారిని ఇబ్బందులకు గురిచేస్తూ భయాందోళనలు సృష్టించాడు. దీంతో భద్రతా సిబ్బంది అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై తక్షణమే చర్యలు చేపట్టనున్నారు. ఈ ఘటనకు సంబంధించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న దృశ్యాల్లో ఎలాంటి వాస్తవం లేదని, అవన్నీ తప్పుడు ప్రచారాలేనని స్పష్టం చేశారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు వెల్లడించారు.


కాగా.. మక్కాలోని మసీదు ప్రాంతంలో ఇటీవల ఓ వ్యక్తిని భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకుంటున్న వీడియో నెట్టింట విపరీతంగా వైరల్‌ అయింది. అతడు సూసైడ్ బాంబర్‌ అని, కాబా సమీపంలో పేలుడు పదార్థాలతో దాడికి యత్నించాడని కొన్ని కథనాలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే.. సౌదీ అధికారులు మాత్రం అలాంటి వాదనలను పూర్తిగా తోసిపుచ్చారు. అవన్నీ ఫేక్ అని తేల్చిచెప్పారు.


ఇదిలా ఉండగా.. పవిత్ర నగరమైన మదీనాలో ప్రవక్త మసీదుకు విద్యుత్‌ సరఫరా చేసే పంపిణీ కేంద్రంపై ఇరాన్ మద్దుతున్న యెమెన్ హౌతీలు డ్రోన్‌లతో దాడి చేశారని సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను హౌతీలు తోసిపుచ్చారు. ఆ డ్రోన్ దాడులతో తమ ప్రమేయమేమీ లేదని స్పష్టం చేశారు.


ఇవీ చదవండి:

ఈఫిల్ టవర్ ఉదంతంపై విచారణ.. బాప్స్‌కు క్లీన్ చిట్

ఫ్లైదుబాయ్ ఉదంతం.. ఓ నాటకంలా కనిపిస్తోంది: ఇరాన్

Updated Date - Oct 02 , 2026 | 04:48 PM