Share News

ఈఫిల్ టవర్ ఉదంతంపై విచారణ.. బాప్స్‌కు క్లీన్ చిట్

ABN , Publish Date - Oct 02 , 2026 | 02:07 PM

ఈఫిల్ టవర్ సందర్శన సందర్భంగా రేగిన వివాదంలో బోచాసన్‌వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బాప్స్) బృందానికి అక్కడి అధికారులు క్లిక్ చిట్ ఇచ్చారు.

ఈఫిల్ టవర్ ఉదంతంపై విచారణ.. బాప్స్‌కు క్లీన్ చిట్
BAPS Eiffel Tower visit

ఇంటర్నెట్ డెస్క్: ఈఫిల్ టవర్ సందర్శన సందర్భంగా రేగిన వివాదంలో బోచాసన్‌వాసి అక్షర్ పురుషోత్తం స్వామినారాయణ్ సంస్థ (బాప్స్) బృందానికి అక్కడి అధికారులు క్లిక్ చిట్ ఇచ్చారు. బాప్స్ పర్యటన సందర్భంగా ఈఫిల్ టవర్‌ వద్ద మహిళా సిబ్బంది కనిపించకుండా ఉండాలన్న విజ్ఞప్తులు వచ్చాయని అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. దీనిపై అక్కడి సిబ్బంది నిరసన తెలిపినట్టు కూడా వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంపై స్థానిక అధికారులు ఇటీవల విచారణ పూర్తి చేశారు. బాప్స్ బృందం అలాంటి విజ్ఞప్తులు ఏవీ చేయలేదని చెప్పారు. సెప్టెంబర్ 5న బాప్స్ బృందం ఈఫిల్ టవర్‌ను సందర్శించిన విషయం తెలిసిందే.


ఈఫిల్ టవర్ వద్ద తమ పర్యటన సందర్భంగా మహిళా సిబ్బందిని అనుమతించవద్దంటూ బాప్స్ బృందం కోరలేదని పారిస్ నగర ఇన్‌స్పెక్టర్ జనరల్ తెలిపారు. తమ వద్ద ఉన్న మతపరమైన విగ్రహాలను మహిళలు తాకకుండా జాగ్రత్త తీసుకోవాలని మాత్రమే సూచించారని అన్నారు. ఈ మార్గదర్శకాల అమలులో సమన్వయ లోపం వల్ల సమస్య తలెత్తిందని అన్నారు. కొందరు వారి మార్గదర్శకాలను సరిగా అర్థం చేసుకోలేకపోయారని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే కొందరు మహిళా సిబ్బందిని వారి స్థానాల నుంచి వేరే చోటకు పంపించారని అన్నారు.


బాప్స్ సూచనలను అధికారులు నోటి మాట ద్వారా కింది స్థాయి సిబ్బందికి చేర్చే సరికి మార్పులకు గురై వివాదానికి దారి తీసిందని అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఈ వివాదం నేపథ్యంలో ఈఫిల్ టవర్ నిర్వహణ సంస్థ డైరెక్టర్ పాట్రిక్ బ్రాంకో రుయివోను యాజమాన్యం ఇప్పటికే తొలగించింది. ఈ విషయమై బాప్స్ బృందం కూడా స్పందించింది. మహిళా సిబ్బందిని తొలగించాలని తాము ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేసింది.


ఈ వార్తలనూ చదవండి:

ఫ్లైదుబాయ్ ఉదంతం.. ఓ నాటకంలా కనిపిస్తోంది: ఇరాన్

‘ఇన్‌స్టాగ్రాం ఫిమేల్ యాప్’ కామెంట్‌పై మస్క్ స్పందన

Updated Date - Oct 02 , 2026 | 02:14 PM