ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు.. ఏయే దేశాలు ఎవరి వైపు..?
ABN , Publish Date - Feb 28 , 2026 | 09:08 PM
ఇరాన్-ఇజ్రాయెల్‌ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొంది. ఇరాన్‌పై ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా వైమానిక దాడులకు పాల్పడగా.. తానేమీ తక్కువ కాదన్నట్టు దీటుగా స్పందించింది ఇరాన్. ఏకంగా యూఏఈ సైనిక స్థావరాలుండే ఎనిమిది దేశాలపై క్షిపణులతో దాడులకు దిగింది. ఈ నేపథ్యంలో ఏయే దేశాలు ఎవరి పక్షాన నిలుస్తాయనే విషయాన్ని ఓసారి చూస్తే..
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఇటీవల ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ లక్ష్యంగా ఇజ్రాయెల్, అమెరికాలు సంయుక్తంగా ఇరాన్‌పై వైమానిక దాడులు చేపట్టాయి. బదులుగా ఇరాన్.. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తున్న ఎనిమిది దేశాలపై ప్రతీకార దాడులకు దిగింది. దీంతో మధ్యప్రాచ్యమంతా క్షిపణులతో దద్దరిల్లుతోంది. ఈ నేపథ్యంలో ఏ దేశానికి ఎవరు అండగా నిలుస్తారనే విషయమిప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు.. ఉద్రిక్తతలు పెరిగేకొద్దీ ఇరాన్ ఈ ప్రాంతంలో ఒంటరిగా మారనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇరాన్ ప్రధాన మిత్రదేశంగా భావించే 'యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్' కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ నుంచి తీవ్ర ప్రతిఘటనలను ఎదుర్కొంటోంది.
ఇజ్రాయెల్ సైన్యం అమెరికాతో కలిసి సంయుక్తంగా ఇరాన్‌పై పెద్ద దాడి చేపట్టాయి. ఇరాన్ సుప్రీం లీడ్ అయతుల్లా అలీ ఖమేనీ, అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియన్, సాయుధ దళాల అధిపతియే లక్ష్యంగా ఈ దాడులు నిర్వహిస్తోంది ఇజ్రాయెల్. ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌లోని లక్ష్యాలపై, మధ్యప్రాచ్యంలో వ్యాపించి ఉన్న యూఎస్ సైనిక స్థావరాలపై ప్రతీకార దాడులు ప్రారంభించింది. ఇజ్రాయెల్, బహ్రెయిన్, యూఏఈ(యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్)లోని అబుదాబి, దుబాయ్, సౌదీ అరేబియాలోని కువైట్, రియాద్, ఖతార్‌లోని అనేక ప్రాంతాల్లో ఇరాన్ దాడులకు దిగినట్టు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.
ఇరాన్‌కు మద్దతెవరు?
ఈ ఉద్రిక్తతలు రోజు రోజుకూ పెరుగుతున్న కొలదీ ఇరాన్ ఒంటరిగా మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని మిత్రదేశమైన 'యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్' కొన్నేళ్లుగా ఇజ్రాయెల్ నుంచి ప్రతిఘటనల్ని ఎదుర్కొంటుండటమే దీనికి ప్రధాన కారణం. టెహ్రాన్.. తన వ్యూహంలో భాగంగా చాలాకాలంగా మధ్యప్రాచ్యం అంతటా అనుబంధ పారామిలిటరీ గ్రూపుల నెట్‌వర్క్‌పై ఆధారపడుతూ వస్తోంది. ఈ విధానమే ఇటీవల బెదిరింపులు, ఒత్తిళ్లు ఎదురవుతున్నప్పటికీ శత్రుదేశాల సైనిక దాడుల నుంచి ఇరాన్‌ను రక్షించింది. ఈ పారామిలిటరీ గ్రూపులో లెబనాన్‌లోని హిజ్‌బొల్లా, ఇరాక్‌లోని పాపులర్ మొబిలైజేషన్ ఫోర్సెస్(పీఎమ్ఎఫ్), యెమెన్‌లోని హౌతీ మిలిటెంట్లు, గాజాలోని హమాస్‌లు ఉన్నాయి. ఇరాక్, యెమెన్‌లలోనూ ఇరాన్ బలమైన భూ ప్రభావాన్ని కలిగిఉంది. గత వారం రోజులుగా ఇరాన్, రష్యా, చైనా దేశాల మధ్య సైనిక సహకారం కూడా ఇరాన్‌కు మరింత బలం చేకూరుస్తోంది.
ఖండించిన రష్యా
ఇరాన్‌పై అమెరికా దాడులను రష్యా ఖండించింది. ఈ విషయంలో రష్యా మాజీ అధ్యక్షుడు ద్విమెత్రి మెద్వెదేవ్.. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్‌ను విమర్శి్స్తూ.. 'శాంతిని కోరుకునే వ్యక్తి.. మరోసారి తన విశ్వరూపాన్ని చూపాడు' అని వ్యంగంగా అన్నారు. 'ఇరాన్‌తో జరిగే చర్చలన్నీ ఓ కవర్ ఆపరేషన్. దానిని ఎవరూ అనుమానించలేరు. ఈ విషయమై నిజంగా ఎవరూ ఎలాంటి చర్చలు జరపాలని అనుకోవడం లేదు. యూఎస్ఏ కేవలం 249 ఏళ్ల కిందట ఆవిష్కృతమైంది. కానీ.. పర్షియన్ సామ్రాజ్యం 2,500 సంవత్సరాల క్రితం స్థాపితమైందని గుర్తుంచుకోవాలి. ఏం జరుగుతుందనేది శతాబ్ద కాలం తర్వాత చూద్దాం..' అని మెద్వెదేవ్ అన్నారు. ఇక.. ఇరాన్‌తో సన్నిహిత సంబంధాలు కొనసాగించిన మరో ఆసియా దేశం పాకిస్థాన్. అణ్వాయుధాలను కలిగి ఉన్న ఏకైక ఇస్లామిక్ దేశమిదే. అయితే.. 2025 జూన్‌లో 12 రోజుల ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య యుద్ధంలో పాక్ నాయకులు టెహ్రాన్ నుంచి దూరమయ్యారు. ఈ విషయంలో ఇరాన్ పట్ల పాక్ చాలా స్పష్టంగా తన వైఖరిని ప్రదర్శించింది.
అమెరికాకు అండగా ఎవరు?
ఇజ్రాయెల్-అమెరికా సంయుక్త దాడులకు ఇరాన్ ప్రతీకారం తీర్చుకుంటున్న నేపథ్యంలో.. యూఏఈ, ఖతార్, కువైట్ సహా అనేక మధ్యప్రాచ్య దేశాలు.. ఈ దాడులకు మరింత బలంగా ప్రతిస్పందిస్తామని ప్రతిజ్ఞ చేశాయి. యూఏఈ.. తన వైమానిక రక్షణ దళాలకు సాయం చేస్తూ ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణులను విజయవంతంగా ప్రతిఘటించింది. దోహాలో పేలుళ్ల శబ్దాలు వినిపించాక.. ఖతార్ కూడా తన భూభాగంపై ఇరాన్ బాలిస్టిక్ క్షిపణి దాడిని ఖండించింది. ఖతార్ దీనిని తన జాతీయ సార్వభౌమత్వాన్ని ఉల్లంఘించినట్లుగా భావిస్తోందని.. దాడికి తప్పకుండా ప్రతిస్పందిస్తామని ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. కువైట్ స్పందిస్తూ.. మా దేశ వైమానిక రక్షణ వ్యవస్థలు గగనతలంలో కదలాడిన క్షిపణులను నిశితంగా పరిశీలించాయంది.
మరోవైపు.. అమెరికా-ఇజ్రాయెల్ దాడులకు ప్రతిస్పందనగా యూఏఈ, బహ్రెయిన్, ఖతార్, కువైట్, జోర్డాన్‌లలో అమెరికా సైనిక లక్ష్యాలపై ఇరాన్ దాడులను సౌదీ అరేబియా తీవ్రంగా ఖండించింది. ఆ ఐదు దేశాలకు సౌదీ సంఘీభావం తెలుపుతోందని.. ప్రతిస్పందనగా ఆయా దేశాలు తీసుకునే ఎలాంటి చర్యలకైనా తాము పూర్తిగా మద్దతుగా ఉంటామని సౌదీ విదేశాంగ శాఖ హామీ ఇచ్చినట్టు ప్రభుత్వ ఆధ్వర్యంలో పనిచేసే ఓ మీడియా సంస్థ ప్రచురించింది. జర్మనీ, ఫ్రాన్స్‌తో సహా అమెరికా పాశ్చాత్య మిత్రదేశాలు కూడా ఇరాన్ అణు చర్యలను, ఇటీవలి నిరసనలపై దాని అణిచివేతను ఖండించాయి. అయితే.. దాడుల గురించి వారికి ముందస్తు హెచ్చరిక ఇచ్చారా లేదా అనే విషయం ప్రస్తావించలేదు.
ఇక ఈ విషయమై ఇటలీ స్పందిస్తూ.. ఉద్రిక్తతలను తగ్గించేందుకు దారితీసే ఎలాంటి చర్యకైనా తాము మద్దతిస్తామంది. అందుకోసం త్వరలోనే ఈ ప్రాంత మిత్రదేశాలు, నాయకులను సంప్రదిస్తామని కూడా తెలిపింది.
ఇవీ చదవండి:
రహస్య ప్రదేశానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
ఆ ఎనిమిది దేశాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు
ఇరాన్ ప్రతీకార దాడులు.. పలు గల్ఫ్ దేశాల్లో బాంబు పేలుళ్లు