ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ మృతి
ABN , Publish Date - Feb 28 , 2026 | 06:12 PM
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ టాప్ కమాండర్ ఒకరు మృతిచెందారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించగా.. ఇరాన్ నుంచి ఎలాంటి స్పందనా లేదు.
ఇంటర్నెట్ డెస్క్: ఇరాన్ పై ఇజ్రాయెల్, అమెరికా చేపట్టిన దాడుల్లో ఇరాన్ కు చెందిన ఓ టాప్ కమాండర్ మృతిచెందినట్టు ఇజ్రాయెల్ పేర్కొంది. శనివారం జరిగిన వైమానిక దాడుల్లో ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) కమాండర్ మహమ్మద్ పాక్పౌర్ మరణించినట్టు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించిందని అక్కడి మీడియా కథనాలు తెలిపాయి. అయితే.. ఈ విషయంపై ఇరాన్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటనా వెలువడలేదు.
ఇరాన్ లో అత్యంత శక్తిమంతమైన నాయకుల్లో ఒకరైన పాక్పౌర్.. 260 రోజుల పాటు కమాండర్ గా విధులు నిర్వర్తించారు. గతేడాది హుస్సేన్ సలామిని తొలగించిన అనంతరం.. ఆయన స్థానంలో నూతన ఐఆర్జీసీ కమాండర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఇరాన్ సుప్రీమ్ లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ.. స్వయంగా ఆయన మేజర్ జనరల్ హోదాకు పదోన్నతి కల్పించారు. ఇరాన్, ఇజ్రాయెల్ దేశాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో.. గత నెలలో ఇజ్రాయెల్, అమెరికాలను తీవ్రంగా హెచ్చరించారు పాక్పౌర్. తమ ఇస్లామిక్ రిపబ్లిక్ సంస్థ అత్యంత ప్రభావవంతమైన వాటిలో ఒకటని.. ఇకపై తప్పుడు లెక్కలను నివారించాలని హెచ్చరికలు జారీచేశారు.
ఇదిలా ఉండగా.. పాక్పౌర్ పై దాడికి ముందే టెహ్రాన్ లో ఆ దేశ సుప్రీమ్ లీడర్ ఖమేనీ కార్యాలయాల సమీపంలో దాడులు జరిగాయి. అయితే.. 86 ఏళ్ల ఖమేనీని ముందుగానే అక్కడి నుంచి ఇతర సురక్షిత ప్రదేశాలకు తరలించినట్టు తెలుస్తోంది. అమెరికాతో ఇటీవల ఉద్రిక్తతలు పెరుగుతున్నందున ఆయన కొద్ది రోజులుగా బహిరంగంగా కనిపించడం లేదని స్థానిక మీడియా కథనాల సమాచారం.
ఇవీ చదవండి:
రహస్య ప్రదేశానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
ఆ ఎనిమిది దేశాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు
ఇరాన్ ప్రతీకార దాడులు.. పలు గల్ఫ్ దేశాల్లో బాంబు పేలుళ్లు