రహస్య ప్రదేశానికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ
ABN , Publish Date - Feb 28 , 2026 | 04:09 PM
టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ దాడుల సమయంలో అయతొల్లా ఖమేనీ టెహ్రాన్‌లో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి.
టెహ్రాన్: ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా యుద్ధం మొదలుపెట్టాయి. 'ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడా' పేరుతో ఇజ్రాయెల్ క్షిపణులు, బాంబులతో ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై శనివారంనాడు విరుచుకుపడింది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కార్యాలయం సమీపంలో దాడులు జరిగాయి. ఖమేనీ, అధ్యక్ష భవనాలే టార్గెట్‌గా ఈ మెరుపు దాడులు జరిగినట్టు చెబుతున్నారు. దాడుల సమయంలో ఖమేనీ టెహ్రాన్‌లో లేరని తెలుస్తోంది. ఇప్పటికే ఆయనను సురక్షిత ప్రాంతానికి తరలించినట్టు చెబుతున్నారు. అయితే ఆయనను ఎక్కడకు తరలించారు, ఎప్పుడు తరలించారనే వివరాలు వెల్లడి కాలేదు.
ఖమేని ఇరాన్ వదిలి వెళ్లాలని, లేదంటే విడిచిపెట్టేది లేదని ట్రంప్ ఇప్పటికే హెచ్చరించారు. దీంతో ఖమేనీ లక్ష్యంగానే అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడులు మొదలుపెట్టినట్టు కథనాలు వెలువడుతున్నాయి.
ఇరాన్‌పై అమెరికా బలగాలు పెద్దఎత్తున సైనిక చర్యకు దిగినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన 8 నిమిషాల వీడియోను ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. వాషింగ్టన్ సైనిక చర్యను ఆయన సమర్థించుకున్నారు. ఇరాన్ పాలకుల నుంచి అమెరికా ప్రజలకు ఉన్న ముప్పును తప్పించేందుకే సైనిక చర్యలకు దిగామన్నారు. ఇరాన్ కార్యక్రమాలు అమెరికాకు, అమెరికా బలగాలకు, విదేశాల్లోని తమ స్థావరాలు, ప్రపంచంలోని తమ మిత్రదేశాలకు ముప్పుగా ఉన్నాయన్నారు.
ఇరాన్ ప్రతిదాడులు
మరోవైపు, ఇజ్రాయెల్‌పై ఇరాన్ ప్రతీకార దాడులు చేపట్టింది. ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకున్నట్టు తెలుస్తోంది. యూఏఈ, కువైట్, ఖతర్‌లలో పేలుళ్లు వినిపించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. బహ్రెయిన్‌లోని అమెరికా నేవీ 5వ ఫ్లీట్‌పై క్షిపణి దాడి జరిపినట్టు ఆ దేశం ధ్రువీకరించింది. ఇరాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో బహ్రెయిన్ బేస్ నుంచి ఇప్పటికే తమ నౌకలను అమెరికా నేవీ ఉపసంహరించుకున్నట్టు చెబుతున్నారు. ఖతర్ రెండు ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి..
ప్రభుత్వంపై తిరగబడండి.. ఇరాన్ ప్రజలకు ట్రంప్ పిలుపు
ఆ ఎనిమిది దేశాలే లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు