ప్రభుత్వంపై తిరగబడండి.. ఇరాన్ ప్రజలకు ట్రంప్ పిలుపు
ABN , Publish Date - Feb 28 , 2026 | 03:13 PM
అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై చేపట్టిన దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. ఇరాన్ ప్రజలకు బహిరంగంగా తొలిసారి కీలక సందేశం ఇచ్చారు. దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న ఇరాన్ ప్రజలకు ఇది విమక్తి కల్పించే సందర్భమని అన్నారు.
వాషింగ్టన్: అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‌పై చేపట్టిన దాడులను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ధ్రువీకరించారు. ఎన్ని హెచ్చరికలు చేసినా అణుకేంద్రాల పునర్మిర్మాణం, క్షిపణులను అభివృద్ధి చేస్తుండటంతో ఇరాన్‌పై భారీ సైనిక చర్య చేపట్టామని ప్రకటించారు. ఇరాన్ ప్రజలకు బహిరంగంగా తొలిసారి కీలక సందేశం ఇచ్చారు. దశాబ్దాలుగా అణచివేతకు గురవుతున్న ఇరాన్ ప్రజలకు ఇది విమక్తి కల్పించే సందర్భమని అన్నారు.
'ఇరాన్ ప్రజలకు విముక్తి కలిగించే సందర్భం వచ్చింది. తరతరాలకు మీకు లభించే ఏకైక గొప్ప అవకాశం ఇదే కావచ్చు. అమెరికా పూర్తి సైనిక శక్తితో అండగా నిలుస్తుంది. మేము పని పూర్తి చేసే సమయానికి మీ ప్రభుత్వాన్ని మీరు స్వాధీనం చేసుకోవాలి' అని ఇరాన్ ప్రజలకు ట్రంప్ పిలుపునిచ్చారు. ఇరాన్ భద్రతా దళాలను ఉద్దేశించి మాట్లాడుతూ, తక్షణమే వారు ఆయుధాలు విడిచిపెట్టాలని, అలాచేస్తే వారికి రక్షణ కల్పిస్తామని, తిరగబడితే మరణం తప్పదని హెచ్చరించారు. ఈ చారిత్రక ఘట్టంలో ఇరాన్ ప్రజలకు అమెరికా పూర్తి సైనిక శక్తితో అండగా ఉంటుందన్నారు. గతంలో ఏ అమెరికా అధ్యక్షుడు ఈ తరహాలో స్పందించేందుకు ముందుకు రాలేదన్నారు.
కాగా, 'అపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడా' పేరుతో ఇరాన్‌పై ఇజ్రాయెల్ శనివారంనాడు క్షిపణి దాడులు జరిగింది. ఈ దాడులలో రాజధాని నగరమైన టెహ్రాన్‌లో పలు ప్రాంతాలు దద్దరిల్లాయి. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా ఖమేనీ కార్యాలయం సమీపంలో దాడులు జరగడంతో కలకలం రేగింది. ఇరాన్ ప్రతిదాడికి దిగొచ్చంటూ ఇజ్రాయెల్ తన పౌరులను హెచ్చరించింది. ముందస్తుగా ఇరాన్, ఇజ్రాయెల్‌లు తమ గగనతలాలను మూసివేశాయి.
ఇరాన్‌లోని ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు
మరోవైపు, ఇరాన్‌లోని భారతీయ పౌరులకు అక్కడి ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు చేసింది. అప్రమత్తంగా ఉండాలని, అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని, ఇళల్లోనే ఉండాలని సూచించింది. అధికారుల సూచనలను తూచా తప్పకుండా పాటించాలని కోరింది.
ఇవి కూడా చదవండి..
ఇరాన్‌పై దాడులు.. దద్దరిల్లిన రాజధాని
క్యూబాను స్నేహపూర్వకంగానే టేకోవర్ చేస్తామేమో.. డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య