Share News

ఇరాన్‌పై దాడులు.. దద్దరిల్లిన రాజధాని

ABN , Publish Date - Feb 28 , 2026 | 01:32 PM

ఇరాన్‌పై ఇజ్రాయెల్ క్షిపణి దాడులకు దిగింది. ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడా పేరిట టెహ్రాన్‌పై శనివారం దాడులకు దిగింది. ఇరాన్ సుప్రీం లీడర్ ఆయతొల్లా కార్యాలయాలకు సమీపంలో కూడా పేలుళ్లు సంభవించినట్టు తెలుస్తోంది.

ఇరాన్‌పై దాడులు.. దద్దరిల్లిన రాజధాని
Israel Iran missile strike,

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ ఇజ్రాయెల్ రంగంలోకి దిగింది. ఆపరేషన్ షీల్డ్ ఆఫ్ జూడా పేరిట ఇరాన్‌పై శనివారం క్షిపణి దాడులకు దిగింది. దీంతో, భారీ పేలుళ్లతో రాజధాని టెహ్రాన్‌లోని పలు ప్రాంతాలు దద్దరిల్లాయి. ఈ దాడుల్లో అమెరికా కూడా పాలుపంచుకుంటున్నట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ సుప్రీం లీడర్‌ అయతొల్లా అలీ ఖమేనీ కార్యాలయాల సమీపంలోనూ దాడులు జరగడంతో కలకలం రేగింది. అయితే, దాడుల సమయంలో సుప్రీం లీడర్ టెహ్రాన్‌లో లేరని సమాచారం (Operation Shield of Judah).

దాడులపై ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి కట్జ్ స్పందించారు. ముప్పును ముందస్తుగా నివారించేందుకే దాడులకు దిగామని అన్నారు. మరోవైపు, ఇరాన్‌ ప్రతిదాడికి దిగొచ్చన్న అంచనాతో ఇజ్రాయెల్‌లో కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మిసైల్ దాడులు జరిగే ఛాన్స్ ఉందని ఇజ్రాయెల్ తమ పౌరులను హెచ్చరించింది. ఇప్పటికే ఇరాన్, ఇజ్రాయెల్‌లు తమ గగనతలాలను మూసివేశాయి.


ఇదిలా ఉంటే, ఇజ్రాయెల్‌లోని భారతీయ పౌరులకు అక్కడి ఇండియన్ ఎంబసీ కీలక సూచనలు చేసింది. ఇజ్రాయెల్ అధికారుల సూచనలను తూచా తప్పకుండా పాటించాలని సూచించింది. క్షిపణి దాడుల నుంచి రక్షణ కల్పించే షెల్టర్‌లు ఎక్కడ ఉన్నాయో తెలుసుకోవాలని సూచించింది. అత్యవసర సందర్భాల్లో ఆయా కేంద్రాల్లో తలదాచుకోవచ్చని తెలిపింది. అనవసర ప్రయాణాలు పెట్టుకోవద్దని తెలిపింది. అత్యవసర సందర్భాల్లో +972-54-7520711 నెంబర్‌పై సంప్రదించాలని లేదా cons1.telaviv@mea.gov.in కు ఈమెయిల్ చేయాలని సూచించింది.


ఈ వార్తలూ చదవండి:

నేను జోక్యం చేసుకునేవాణ్ణే కానీ.. అఫ్గాన్-పాక్ ఘర్షణలపై ట్రంప్ కామెంట్

ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్‌‌‌తో లావాదేవీలు బంద్.. ట్రంప్ ఆదేశాలు

Updated Date - Feb 28 , 2026 | 03:17 PM