Share News

ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్‌‌‌తో లావాదేవీలు బంద్.. ట్రంప్ ఆదేశాలు

ABN , Publish Date - Feb 28 , 2026 | 08:49 AM

ఆంథ్రోపిక్ ఏఐ సాంకేతికతను ఇకపై వినియోగించొద్దంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్ని ప్రభుత్వ శాఖలను తాజాగా ఆదేశించారు. ఈ టెక్నాలజీ వినియోగాన్ని తక్షణం నిలిపివేయాలని స్పష్టం చేశారు. వామపక్ష భావజాలమున్న ఒక సంస్థ అమెరికా ప్రభుత్వాన్ని లొంగదీయలేదని కామెంట్ చేశారు.

ఏఐ కంపెనీ ఆంథ్రోపిక్‌‌‌తో లావాదేవీలు బంద్.. ట్రంప్ ఆదేశాలు
US Govt Anthropic Dispute

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఏఐ స్టార్టప్ సంస్థ ఆంథ్రోపిక్‌కు (Anthropic) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) షాకిచ్చారు. సంస్థకు చెందిన క్లాడ్ ఏఐ సాంకేతికత వినియోగాన్ని ప్రభుత్వ విభాగాలన్నీ తక్షణం నిలిపివేయాలని తాజాగా ఆదేశించారు. నిఘా, మిలిటరీ వ్యవహారాలకు సంబంధించి క్లాడ్‌లోని భద్రతా నిబంధనలను పూర్తిగా తొలగించేందుకు ఆంథ్రోపిక్ అంగీకరించకపోవడంతో ట్రంప్ ఈ నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణ శాఖకు మాత్రం ఆరు నెలల సమయం ఇచ్చారు.

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వామపక్ష భావజాలమున్న ఒక కంపెనీ అమెరికా ప్రభుత్వం ఏం చేయాలో చేయొద్దో చెప్పజాలదని అన్నారు. అమెరికాను లొంగదీయాలనుకుని ఆంథ్రోపిక్ పెద్ద తప్పిదానికి పాల్పడిందని మండిపడ్డారు. వారి నిబంధనలకు అమెరికా కట్టుబడేలా చేయాలని చూశారని ఆరోపించారు. వారి స్వార్థం కారణంగా అమెరికా ప్రజల జీవితాలు ప్రమాదంలో పడ్డాయని అన్నారు. జాతీయ భద్రతను కూడా ప్రమాదంలోకి నెట్టారని ఆరోపించారు. రాడికల్ వామపక్ష కంపెనీ దేశ భవిష్యత్తును నిర్ణయించజాలదని అన్నారు.


ఏమిటీ వివాదం..

ప్రభుత్వ నిఘా, ఆటోమేటిక్ ఆయుధాల‌కు సంబంధించి క్లాడ్ టెక్నాలజీలో ఉన్న సేఫ్టీ రూల్స్‌ను పూర్తిగా తొలగించాలని ఇటీవల ఆంథ్రోపిక్‌ను అమెరికా కోరింది. ఈ విషయాల్లో ఏఐని పూర్తిస్థాయిలో వినియోగించుకునేలా మార్పులు చేయాలని చెప్పింది.

ఆంథ్రోపిక్ సంస్థ ఇందుకు అంగీకరించలేదు. నిఘా, మిలిటరీ వ్యవహారాల్లో అపరిమిత ఏఐ వినియోగానికి సంబంధించిన నైతిక నిబంధనలను ఉల్లంఘించలేమని సంస్థ తేల్చి చెప్పింది. ఆత్మప్రబోధం ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురువారం సంస్థ సీఈఓ డారియో అమోడేయ్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలో అమెరికా రక్షణ శాఖ ఆంథ్రోపిక్‌కు నిబంధనలను సడలించేందుకు 24 గంటల డెడ్‌లైన్ విధించింది. శుక్రవారం నాడు డెడ్‌లైన్ మరో గంటలో ముగియనుండగా ట్రంప్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆంథ్రోపిక్ క్లాడ్ టెక్నాలజీ వినియోగాన్ని తక్షణం నిలిపివేయాలని ప్రభుత్వ శాఖలన్నిటినీ ఆదేశించారు.


ఈ వార్తలూ చదవండి:

భారత్‌ విషయంలో వెనక్కు తగ్గిన కెనడా!

అఫ్గానిస్థాన్‌పై యుద్ధం ప్రకటించిన పాక్

Updated Date - Feb 28 , 2026 | 08:50 AM