అది డ్రోనా.. లేక ప్లేనా..? ఇరాన్ ఆకాశంలో మిస్టీరియస్ యూఎఫ్ఓ.. వీడియో వైరల్
ABN , Publish Date - Sep 21 , 2026 | 08:57 AM
ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఆకాశంలో గుర్తు తెలియని ఓ వస్తువు సంచరించింది. దీనిపై సోషల్ మీడియాలో ఊహాగానాలు జోరందుకున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: గుర్తు తెలియని ఓ వస్తువు ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఆకాశంలో ఎగురుతూ కనిపించింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అది డ్రోన్ అని కొందరు.. కాదు ప్లేన్ అని ఇంకొందరు వాదిస్తున్నారు. ఇలా గుర్తు తెలియకుండా ఆకాశంలో సంచరించే వస్తువులను యూఎఫ్ఓ (UFO-Unidentified Flying Object) అని అంటారు. పశ్చిమాసియా ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఈ యూఎఫ్ఓ ఇరాన్‌లో కనిపించడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చ మొదలైంది.
వైరల్ అవుతున్న వీడియోలో ఒక వస్తువు లైట్ల వెలుగులతో ఆకాశంలో ఎగురుతూ కనిపిస్తోంది. దాని పరిమాణం, వేగం, దూరం వంటివి ఎవరూ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. ప్రముఖ సోషల్ మీడియా యాప్ రెడ్డిట్‌లో దీనిపై చర్చ ఆసక్తికరంగా సాగుతోంది. ఓ యూజర్ ‘టెహ్రాన్’ నుంచి ఇంకా ఫుటేజీ రాబోతోందని తెలిపారు.
మిస్టీరియస్ యూఎఫ్ఓ..
కొంతమంది ఈ మిస్టీరియస్ యూఎఫ్ఓను డ్రోన్‌గా పేర్కొంటున్నారు. దాని లైట్లు, కదలికలు చూసి వారు ఈ నిర్ధారణకు వచ్చారు. కానీ ఇప్పటివరకు అది డ్రోన్ అని చెప్పడానికి ఎలాంటి ఆధారాలూ లభించలేదు. మరికొంతమంది అది సాధారణ ఎయిర్‌క్రాఫ్ట్ అని, దూరం నుంచి కొత్తగా, వింతగా కనిపిస్తోందని చెబుతున్నారు. అయితే విమానయాన సంస్థలు దీనిపై స్పందించలేదు. అది ఎయిర్‌క్రాఫ్టే అని ఎలాంటి ప్రకటనా చేయలేదు. డ్రోన్ కాదు.. ప్లేన్ కాదు.. అది గాలిపటమని వాదించేవారూ లేకపోలేదు. చూడడానికి ఎల్‌ఈడీ గాలిపటంలా ఉందని వివరిస్తున్నారు. వైరల్ అవుతున్న యూఎఫ్ఓ వీడియోపై అధికారులు వివరణ ఇవ్వకపోవడంతో ఈ ఊహాగానాలు జోరందుకున్నాయి.
గతంలోనూ ఇరాన్‌లో..
ఈ యూఎఫ్ఓ అంశంపై ఇంత చర్చ జరగడానికి మరో కారణం ఉంది. ఇలా గుర్తించలేని వస్తువులు ఇరాన్ ఆకాశంలో సంచరించడం ఇది మొదటిసారి కాదు. సరిగ్గా 50 సంవత్సరాల క్రితం రాజధాని టెహ్రాన్‌లో ఓ యూఎఫ్ఓ కనిపించింది. తాము ఆకాశంలో ఓ వింత వస్తువును చూశామని ఇరాన్ అధికారులు, ప్రజలు 1976 సెప్టెంబరు 19న వెల్లడించారు. మళ్లీ ఇన్నేళ్ల తరువాత అక్కడే మరో యూఎఫ్ఓ ఎగురుతూ కనిపించడం గమనార్హం.
ఇవీ చదవండి
రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్
బుర్ఖాపై నిషేధం దిశగా ఇటలీ.. ప్రధాని కీలక