Share News

బుర్ఖాపై నిషేధం దిశగా ఇటలీ.. ప్రధాని కీలక ప్రకటన

ABN , Publish Date - Sep 20 , 2026 | 10:15 PM

బుర్ఖా, నికాబ్‌లపై నిషేధం విధించే దిశగా ఇటలీ అడుగులు వేస్తోంది. ఇటలీ సమాజంలో విదేశీ విద్యార్థులు సులువుగా కలిసిపోగలిగేలా ఇతర చర్యలకు కూడా సిద్ధమైంది.

బుర్ఖాపై నిషేధం దిశగా ఇటలీ.. ప్రధాని కీలక ప్రకటన
Italy to Ban Burqa, Niqab

ఇంటర్నెట్ డెస్క్: బుర్ఖా, నికాబ్‌లపై నిషేధం విధించే దిశగా ఇటలీ అడుగులు వేస్తోంది. ఇటలీ సమాజంలో విదేశీ విద్యార్థులు సులువుగా కలిసిపోగలిగేలా ఇతర చర్యలకు కూడా సిద్ధమైంది. ఈ మేరకు ఇటలీ ప్రధాని, బ్రదర్స్ ఆఫ్ ఇటలీ పార్టీ నేత జార్జియా మెలోనీ ఆదివారం కీలక ప్రకటన చేశారు. ఇటలీ సమాజంలో మిళితమయ్యేలా విదేశీ విద్యార్థులు ఇటాలియన్ భాష నేర్చుకోవాల్సి ఉంటుందని వెల్లడించారు. తమ పార్టీకి చెందిన యువజన విభాగం సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. ‘స్కూలుకు వెళ్లేందుకు ముఖం కప్పుకోకూడదు. సంప్రదాయం పేరిట మహిళ తన ముఖాన్ని కప్పుకోవాలని చెప్పే హక్కు ఎవరికీ లేదు’ అని ఆమె పేర్కొన్నారు. అయితే, కేవలం నెత్తిని మాత్రమే కప్పి ఉంచే హిజాబ్ విషయంలో ఎలాంటి ఆంక్షలు ఉండకపోవచ్చని అక్కడి విశ్లేషకులు చెబుతున్నారు.


ఇటలీ సమాజంలో విదేశీ విద్యార్థులు ఇమిడిపోయేందుకు తీసుకునే చర్యలను కూడా ఆమె వివరించారు. ‘క్లాస్‌లో ఇటాలియన్ భాష అర్థం కాని చిన్నారి ఒక్కరే ఉన్న సందర్భాల్లో వాళ్లు భాష నేర్చుకుని తొటి విద్యార్థులతో మాటలు కలిపి స్నేహం పెంచుకునే అవకాశం ఉంది. ఇలాంటి విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో ఉంటే వారంతా వేరుగా ఉండిపోయే అవకాశం ఉంది’ అని ప్రధాని అభిప్రాయపడ్డారు. ఈ దిశగా క్లాస్‌లో విదేశీ విద్యార్థుల సంఖ్యపై పరిమితి విధించనున్నట్టు చెప్పారు.


ఈ వార్తలనూ చదవండి:

నేపాల్ వరదలు.. 6 వేల మంది గల్లంతు.. ఇప్పటికీ తెలియని ఆచూకీ

మాస్కోపై డ్రోన్ల వర్షం.. దాడుల మధ్యే ముగిసిన రష్యా ఎన్నికలు

Updated Date - Sep 20 , 2026 | 10:22 PM