Share News

నేపాల్ వరదలు.. 6 వేల మంది గల్లంతు.. ఇప్పటికీ తెలియని ఆచూకీ

ABN , Publish Date - Sep 20 , 2026 | 09:29 PM

ఆకస్మిక వరదలు మిగిల్చిన విషాదం నుంచి నేపాల్ కోలుకోలేకపోతోంది. గత నెలలో సంభవించిన వరదల్లో గల్లంతైన 6 వేల మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని నేపాల్ అధికారయంత్రాంగం ఆదివారం పేర్కొంది.

నేపాల్ వరదలు.. 6 వేల మంది గల్లంతు.. ఇప్పటికీ తెలియని ఆచూకీ
6000 Still Missing in Nepal Floods

ఇంటర్నెట్ డెస్క్: ఆకస్మిక వరదలు మిగిల్చిన విషాదం నుంచి నేపాల్ కోలుకోలేకపోతోంది. గత నెలలో సంభవించిన వరదల్లో గల్లంతైన 6 వేల మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదని నేపాల్ అధికారులు ఆదివారం పేర్కొన్నారు. మృతుల సంఖ్య 1,450కు చేరిందని తెలిపారు. టిబెట్ సరిహద్దులో ఆగస్టు 28న సంభవించిన వరదలు దిగువన ఉన్న పలు జిల్లాలో విలయం సృష్టించిన విషయం తెలిసిందే. వరదలతో ప్రాణనష్టంతో పాటు భారీగా ఆస్తినష్టం కూడా సంభవించింది. నిమిషాల వ్యవధిలోనే వంతెనలు, రోడ్లు కొట్టుకుపోయాయి. హైడ్రోపవర్ ప్రాజెక్టులు కూడా దెబ్బతిన్నాయి.

చిత్వాన్ జిల్లాలో అత్యధికంగా 367 మృత దేహాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. ఆ తరువాత రాసువా జిల్లాలో 236 మృతదేహాలు, తూర్పు నవాల్‌పరాసీ జిల్లాలో 232, పశ్చిమ నవాల్‌పరాసీ జిల్లాలో 222 మృతదేహాలు లభించాయి. కఠ్మాండూ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇద్దరు మరణించారని పోలీసులు వెల్లడించారు.


ఇప్పటికీ ఆచూకీ తెలియని 6 వేల మంది కోసం గాలిస్తున్నామని అధికారులు తెలిపారు. మరోవైపు, మృతదేహాల గుర్తింపు కూడా అధికారులకు సవాలుగా మారింది. వరదల కారణంగా దిగువకు కొట్టుకుపోయిన అనేక మృతదేహాలు కుళ్లిపోవడంతో గుర్తింపు కష్టంగా మారాయి. కొన్ని సందర్భాల్లో శరీర భాగాలు మాత్రమే లభిస్తుండటంతో గుర్తింపు కష్టంగా మారిందని అంటున్నారు. డీఎన్ఏ శాంపిల్స్ సేకరణ అనంతరం ఇటీవల 1300 మృతదేహాలను ఖననం చేశారు. 110 మంది మృతదేహాలనే కుటుంబసభ్యులకు అందజేయగలిగామని అన్నారు.

వరద ప్రభావిత జిల్లాల్లో మౌలిక వసతులు దెబ్బతినడంతో ప్రజాజీవనం అస్తవ్యస్తంగా మారింది. అనేక మంది ఇప్పటికీ తమ ఇళ్లకు వెళ్లలేని పరిస్థితి ఉంది. మార్కెట్లు, స్కూళ్లు, ఆరోగ్య సదుపాయాలు ఇంకా పూర్తిస్థాయిలో పునరుద్ధరించకపోవడంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. వంతెనలకు మరమ్మతులు చేసి రాకపోకలను పునరుద్ధరణకు అధికారులు ప్రయత్నిస్తున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

మాస్కోపై డ్రోన్ల వర్షం.. దాడుల మధ్యే ముగిసిన రష్యా ఎన్నికలు

త్వరలో యూఎస్‌కు ఇరాన్ అధ్యక్షుడు.. వీసా మంజూరు!

Updated Date - Sep 20 , 2026 | 09:40 PM