మాస్కోపై డ్రోన్ల వర్షం.. దాడుల మధ్యే ముగిసిన రష్యా ఎన్నికలు
ABN , Publish Date - Sep 20 , 2026 | 06:31 PM
రష్యా పార్లమెంటరీ ఎన్నికల చివరి రోజున ఉక్రెయిన్ వెయ్యి డ్రోన్లతో విరుచుకుపడింది. రాజధాని మాస్కో, పరిసర ప్రాంతాలపై చరిత్రలోనే అత్యంత భారీ డ్రోన్ దాడికి పాల్పడింది. ఈ దాడుల్లో ఇద్దరు మరణించగా, మాస్కోలోని ప్రధాన చమురు రిఫైనరీ తీవ్రంగా దెబ్బతింది.
ఆంధ్రజ్యోతి, సెప్టెంబర్ 20: రష్యా పార్లమెంటరీ ఎన్నికల చివరి రోజున రాజధాని మాస్కో, దాని పరిసర ప్రాంతాలపై ఉక్రెయిన్ తన చరిత్రలోనే అత్యంత భారీ డ్రోన్ దాడులకు పాల్పడింది. రష్యా వ్యాప్తంగా 1,000కి పైగా డ్రోన్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా, మాస్కోలోని ప్రధాన చమురు రిఫైనరీ తీవ్రంగా దెబ్బతింది.
రష్యా ఎన్నికలను భగ్నం చేసేందుకు పక్కా ప్రణాళికతోనే ఉక్రెయిన్ ఈ దాడికి ఒడిగట్టిందని, అయితే శత్రువుల యత్నాలు ఫలించలేదని మాస్కో మేయర్ సెర్గీ సోబ్యానిన్ పేర్కొన్నారు.
రష్యాకు బిలియన్ల కొద్దీ డాలర్ల ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న ఆస్తులపైనే తమ సుదూర శ్రేణి దాడులు జరిగాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ ప్రకటించారు. రష్యాలోనే అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ధృవీకరించింది.
మాస్కో రీజియన్ గవర్నర్ ఆండ్రీ వోరోబ్యోవ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ దాడిలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా.. ముగ్గురు పిల్లలు సహా 20 మంది గాయపడ్డారు. అనేక డ్రోన్లను కూల్చివేసినప్పటికీ, కొన్ని డ్రోన్లు రిఫైనరీని, నివాస భవనాన్ని తాకాయి.
ఉక్రెయిన్‌పై రష్యా దాడి: మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా కూడా వైమానిక దాడులను కొనసాగించింది. కైవ్‌పై జరిగిన దాడిలో ముగ్గురు పిల్లలు సహా నలుగురు ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు. ఈ ఒక్క వారంలోనే రష్యా 2,000కు పైగా డ్రోన్లు, 1,700 బాంబులు, 19 మిస్సైళ్లతో ఉక్రెయిన్‌పై విరుచుకుపడినట్టు సమాచారం.
రష్యా 2022లో ఉక్రెయిన్‌పై పూర్తిస్థాయి యుద్ధం ప్రారంభించిన తర్వాత జరుగుతున్న మొదటి పార్లమెంటరీ ఎన్నికలు మొన్నటి నుంచి ప్రారంభమై ఇవాళ్టితో ముగిశాయి. పుతిన్ నేతృత్వంలోని యునైటెడ్ రష్యా పార్టీనే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తుందని అంచనాలు ఉన్నాయి.
కాగా, రష్యా పార్లమెంట్ దిగువ సభ అయిన 'స్టేట్ డ్యూమా' లోని 450 సీట్లకు సంబంధించి ఈ ఎన్నికలు జరిగాయి. దీనివల్ల పార్లమెంటులో పార్టీల బలాబలాలు మాత్రమే మారతాయి గానీ, అధ్యక్షుడి పదవి మారదు. రష్యా రాజ్యాంగం ప్రకారం అత్యున్నత అధికారాలన్నీ అధ్యక్షుడి (పుతిన్) చేతిలోనే ఉంటాయి. ఒకవేళ పార్లమెంటులో అధికార 'యునైటెడ్ రష్యా' పార్టీకి మెజారిటీ తగ్గినా, పుతిన్ ప్రెసిడెంట్‌గా కొనసాగుతారు. పార్లమెంటును రద్దు చేసే అధికారం కూడా అధ్యక్షుడికే ఉంటుంది. వ్లాదిమిర్ పుతిన్ చివరిసారిగా 2024 మార్చిలో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. ఆయన పదవీకాలం 2030 వరకూ ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
ఆసియా క్రీడలు: బంగ్లా ఘోర ఓటమి.. ఫైనల్‌కు దూసుకెళ్లిన భారత్
ఇంగ్లండ్‌లో సిక్కు బస్ డ్రైవర్‌పై యెమెన్ దేశస్థుడి దాడి