Share News

ఇంగ్లండ్‌లో సిక్కు బస్ డ్రైవర్‌పై యెమెన్ దేశస్థుడి దాడి

ABN , Publish Date - Sep 20 , 2026 | 02:15 PM

ఇంగ్లండ్‌లోని టెల్‌ఫోర్డ్‌లో ఓ సిక్కు బస్ డ్రైవర్‌పై యెమెన్ దేశస్థుడు దాడి చేశాడు. అంతేకాకుండా అతని బస్సును దొంగిలించాడు. బస్సును రాంగ్ రూట్‌లో నడుపుతూ పలు వాహనాలను ఢీకొట్టాడు. అనంతరం పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు.

ఇంగ్లండ్‌లో సిక్కు బస్ డ్రైవర్‌పై యెమెన్ దేశస్థుడి దాడి

ఇంటర్‌నెట్ డెస్క్: ఇంగ్లండ్‌లోని టెల్‌ఫోర్డ్‌లో ఓ సిక్కు బస్ డ్రైవర్‌పై యెమెన్ దేశస్థుడు దాడి చేశాడు. అనంతరం బస్సును దొంగిలించి రాంగ్ రూట్‌లో నడిపి పలు వాహనాలను ఢీకొట్టి బీభత్సం సృష్టించాడు. శుక్రవారం సాయంత్రం 6:30 గంటల సమయంలో మేడ్లీలోని కోర్ట్ స్ట్రీట్‌లో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. నిందితుడిని యెమెన్‌కు చెందిన అలీ బాల్హాద్‌ (33) గా గుర్తించారు. దుండగుడు సిక్కు డ్రైవర్ దగ్గరకు వెళ్లి ఆయన గడ్డం పట్టుకుని లాగాడు. గొడవ వద్దని డ్రైవర్ చెబుతున్నా అతను వినలేదు. ఆయన తలను తన తలతో కొట్టాడు. దాదాపు నిమిషం పాటు డ్రైవర్‌ను కొడుతూనే ఉన్నాడు. ఈ ఘటనను అక్కడున్న ఓ మహిళ వీడియో తీసింది. డ్రైవర్‌ను కొట్టవద్దని ఆమె చెబుతున్నా దుండగుడు అలాగే దాడి చేశాడు. తనను కాపాడాలని, పోలీసులకు ఫోన్ చేయాలని ఆ మహిళను డ్రైవర్ అడిగాడు. తర్వాత నిందితుడు బస్సులోని కొన్ని వస్తువులను ధ్వంసం చేశాడు. చివరకు డ్రైవర్‌ను బస్సు నుంచి బయటకు తోసేసి తానే బస్సు నడుపుకుంటూ వెళ్లాడు.


రోడ్డుపై బీభత్సం

బస్సును దొంగిలించిన తర్వాత నిందితుడు అలీ.. పార్క్ వే మీదుగా హై స్ట్రీట్ వైపు నడుపుకుంటూ వెళ్లాడు. మార్గం మధ్యలో పలు వాహనాలను ఢీకొట్టాడు. పోలీసులు సమాచారం అందుకుని అక్కడికి చేరుకున్నారు. బస్సును ఆపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై దోపిడీ, ప్రమాదకర డ్రైవింగ్, హత్యాయత్నం, దొంగతన, దాడి తదితర కేసులు నమోదు చేశారు. కాగా.. నిందితుడి దాడిలో బస్ డ్రైవర్‌కు స్వల్ప గాయాలయ్యాయి. అయితే, నిందితుడు వాహనాలను ఢీకొట్టిన ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని పోలీసులు తెలిపారు. బాల్హాద్‌ను కస్టడీలో ఉంచారు.

Updated Date - Sep 20 , 2026 | 02:15 PM