Share News

రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌

ABN , Publish Date - Sep 21 , 2026 | 04:13 AM

ఉక్రెయిన్‌ దళాలు రష్యాపై భారీ డ్రోన్‌ దాడి చేశాయి. శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు ఏకంగా 1,600కి పైగా డోన్లను ప్రయోగించాయి. రష్యాలో పార్లమెంట్‌ ఎన్నికల చివరి రోజున ఈ దాడులు జరగడం గమనార్హం.

రష్యాపై   విరుచుకుపడ్డ   ఉక్రెయిన్‌
moscow

  • 1,600కు పైగా

డ్రోన్లతో దాడి

  • యుద్ధం మొదలైనప్పటి నుంచి

ఇదే అతిపెద్ద డ్రోన్‌ దాడి

  • ఓ చమురు శుద్ధి కర్మాగారం

ధ్వంసం.. నలుగురి మృతి

  • ఇకనైనా మాస్కో యుద్ధాన్ని

ముగించాలి: జెలెన్‌స్కీ

  • 1,600కిపైగా డ్రోన్లతో రష్యాపై విరుచుకుపడ్డ ఉక్రెయిన్‌

కీవ్‌, సెప్టెంబరు 20: ఉక్రెయిన్‌ దళాలు రష్యాపై భారీ డ్రోన్‌ దాడి చేశాయి. శనివారం అర్ధరాత్రి నుంచి తెల్లవారు జాము వరకు ఏకంగా 1,600కి పైగా డోన్లను ప్రయోగించాయి. రష్యాలో పార్లమెంట్‌ ఎన్నికల చివరి రోజున ఈ దాడులు జరగడం గమనార్హం. క్రిమియా, నల్లసముద్రంతో పాటు తమ దేశవ్యాప్తంగా 1,100కిపైగా డ్రోన్లను కూల్చేశామని రష్యా రక్షణ శాఖ ప్రకటించింది.


ఈ దాడుల్లో కనీసం నలుగురు మృతి చెందగా.. 20 మందికి పైగా గాయపడ్డారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇదే అతిపెద్ద డ్రోన్‌ దాడిగా రష్యా అధికారులు పేర్కొంటున్నారు. కొన్ని డ్రోన్లను నిలువరించలేకపోవడంతో మాస్కోలోని ఓ ప్రధాన చమురు శుద్ధి కర్మాగారం అగ్ని ప్రమాదానికి గురై ధ్వంసమైంది. అలాగే అక్కడి ఓ నివాస భవనం, పలు గోదాములకు మంటలంటుకున్నాయి. మాస్కోలోని పలు ప్రధాన విమానాశ్రయాలు తాత్కాలికంగా మూతపడ్డాయి. పార్లమెంట్‌ ఎన్నికలకు అంతరాయం కలిగించే లక్ష్యంతోనే శత్రుదేశం ఈ దాడికి పాల్పడిందని.. అయినా వారు సఫలం కాలేదని మాస్కో మేయర్‌ సెర్గీ సోబ్యానిన్‌ అన్నారు.ఇటు ఉక్రెయిన్‌పై రష్యా ప్రతీకార దాడులకు దిగింది. కీవ్‌, సుమీ ప్రాంతాల్లో చేసిన దాడుల్లో ముగ్గురు పిల్లలు సహా 8 మంది మృతి చెందినట్లు ఉక్రెయిన్‌ అధికారులు తెలిపారు. కాగా, రష్యాలోని కీలక చమురు శుద్ధి కర్మాగారం, ఓ లాజిస్టిక్‌ సైట్‌ను ధ్వంసం చేశామని.. యుద్ధ యంత్రాంగాన్ని నడిపించే ఇవి కోట్లాది డాలర్ల విలువైనవని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఎక్స్‌ వేదికగా పేర్కొన్నారు. దాడులకు డ్రోన్లతో పాటు స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఫ్లెమింగో, పాలియానిట్సియా క్షిపణులను ప్రయోగించామని తెలిపారు. ఇకనైనా మాస్కో యుద్ధాన్ని ముగించి.. శాంతిని ఎంచుకోవాలని కోరుతున్నామన్నారు.

Updated Date - Sep 21 , 2026 | 04:13 AM