ట్యాక్స్ రిటర్న్ లీక్.. అమెరికా ఆర్థిక శాఖపై ట్రంప్ దావా
ABN , Publish Date - Jan 31 , 2026 | 07:25 AM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. ఆ దేశ ఐఆర్‌ఎస్, ఆర్థిక విభాగాలపై కోర్టులో దావా వేశారు. ట్రంప్‌తో పాటు ఆయన ఇద్దరు కుమారులకు సంబంధించిన వ్యాపార, వ్యక్తిగత పన్ను రిటర్నుల సమాచారం లీక్ కాకుండా నిరోధించడంలో విఫలమయ్యాయని అందులో పేర్కొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆ దేశ అంతర్గత రెవెన్యూ సేవలు(IRS), ఆర్థిక శాఖ(Treasury Department)పై ఫ్లోరిడా ఫెడరల్ కోర్టులో దావా వేశారు. ట్రంప్‌తో పాటు ఆయన ఇద్దరు కుమారులకు సంబంధించిన వ్యాపార, వ్యక్తిగత పన్ను రిటర్న్‌ల సమాచారం లీక్ కాకుండా ఆర్థిక శాఖ, ఐఆర్ఎస్‌లు విఫలమయ్యాయని ట్రంప్ ఆరోపించారు. ఈ మేరకు 10 బిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ పిటిషన్ వేశారు. వ్యక్తిగత సమాచారం లీక్ చేసిన చార్లెస్ లిటిల్‌జాన్‌కు ఇప్పటికే కోర్టు 2024లో ఐదేళ్ల జైలు శిక్ష విధించింది. 2018-2020 మధ్య కాలంలో అప్పటి ఐఆర్ఎస్ కాంట్రాక్టర్ చార్లెస్ లిటిల్‌జాన్.. ట్రంప్ పన్ను పత్రాలను అపహరించి ‘న్యూయార్క్ టైమ్స్’, ‘ప్రో పబ్లికా’ వంటి మీడియా సంస్థలకు అందించినట్లు ప్రాసిక్యూషన్ అభియోగం. ఇది ‘ప్రైవసీ యాక్ట్’ ఉల్లంఘన అని ట్రంప్ తరుఫు న్యాయవాది కోర్టులో పరిహారం కోరుతూ దావా వేశారు.
ట్రంప్ కుమారులు డొనాల్డ్ ట్రంప్ జూనియర్, ఎరిక్ ట్రంప్ తోపాటు ‘ట్రంప్ ఆర్గనైజేషన్’ తరుఫున 10 బిలియన్ డాలర్ల పరిహారం కోరుతూ లాయర్ దావా వేశారు. లిటిల్‌జాన్ చేసిన లీకేజ్ వల్ల 2020 ఎన్నికల సమయంలో తన రాజకీయ ప్రతిష్ఠ దెబ్బతిన్నదని, మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేశాయని ట్రంప్ ఆరోపిస్తున్నారు. లిటిల్‌జాన్ కు జైలు శిక్ష విధించిన నేపథ్యంలో ఆయన పనిచేసిన బుజ్ అలన్ హ్యామిల్టన్ సంస్థతో అమెరికా ఆర్థిక శాఖ ఈ వారం తెగతెంపులు చేసుకుంది. అయితే, ట్రంప్ తోపాటు అమెరికాకు చెందిన వేల మంది ధనికుల ట్యాక్స్ లకు సంబంధించిన వివరాలు లిటిల్ జాన్.. మీడియా సంస్థలకు అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ట్రంప్ వ్యవహారం అమెరికా రాజకీయాల్లో, న్యాయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
ఇవి కూడా చదవండి..
ఫిబ్రవరిలో ఎన్‌సీపీ వర్గాల విలీనం.. అధ్యక్ష పదవికి పోటీలో నలుగురు
దాన్ని అద్భుతమైన ప్రదర్శన అనలేం.. పాక్ పీఎం ట్వీట్‌పై ఆకాశ్ చోప్రా రియాక్షన్