గాజా బోర్డ్ ఆఫ్ పీస్.. ఇండియా వైపు పాలస్తీనా చూపులు..
ABN , Publish Date - Jan 30 , 2026 | 08:34 PM
గాజా బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరే విషయంపై భారత్ ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. గాజా పాలస్తీనీయుల అంశంలో పలు సున్నితమైన అంశాలు ఉండటంతో ట్రంప్ ఆహ్వానంపై భారత్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది..
న్యూఢిల్లీ, జనవరి 30: గాజా బోర్డ్ ఆఫ్ పీస్‌లో భాగం కావాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌ను ఆహ్వానించిన సంగతి తెలిసిందే. అయితే బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరే విషయంపై భారత్ ఇప్పటి వరకూ స్పష్టత ఇవ్వలేదు. గాజా పాలస్తీనీయుల అంశంలో పలు సున్నితమైన అంశాలు ఉండడంతో ట్రంప్ ఆహ్వానంపై భారత్ ఆచితూచి నిర్ణయం తీసుకోవాలని భావిస్తోంది. గాజా బోర్డ్ ఆఫ్ పీస్‌లో భారత్ చేరికపై పాలస్తీనా ఆశాభావం వ్యక్తం చేస్తోంది. బోర్డ్ ఆఫ్ పీస్‌లో భారత్ ఉంటే ఎంతో సహాయంగా ఉంటుందని పాలస్తీనా విదేశాంగ మంత్రి వర్సెన్ అఘాబెకియన్ షాహిన్ అన్నారు.
శుక్రవారం న్యూఢిల్లీలో జరిగిన ఇండియా - అరబ్ ఫారెన్ మినిస్టర్స్ మీటింగ్‌లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘మార్గం, తుది ఫలితాలు స్పష్టంగా ఉంటే గాజా బోర్డ్ ఆఫ్ పీస్‌లో భారత్ చేరిక మా లక్ష్యానికి సహాయపడుతుంది. బోర్డ్ ఆఫ్ పీస్ భారత్ అవగాహనకు అనుగుణంగా శాంతి, అంతర్జాతీయ చట్టాలపై నిర్ణయం తీసుకుంటుంది’ అని అన్నారు. గతంలో ట్రంప్ మాట్లాడుతూ.. గాజాను ఒక విలాసవంతమైన, పర్యాటక తీర ప్రాంతంగా మారుస్తామని అన్నారు.
దీనిపై కూడా వర్సెన్ అఘాబెకియన్ షాహిన్ స్పందించారు. పునర్నిర్మాణానికి పాలస్తీనీయులు వ్యతిరేకం కాదని స్పష్టం చేస్తూనే, తమ ఖర్చుతో తమపై రుద్దే ఎలాంటి ఆలోచనకైనా తాము అంగీకరించబోమని చెప్పారు. శాంతి సాధన కోసం చేసే ఏ ప్రయత్నమైనా స్వాగతించదగినదేనని అన్నారు. ఆ ఆలోచన పాలస్తీనాను స్వతంత్రంగా ఉంచే పథకంలా ఉంటే బాగుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి..
ఏపీలో భారీ ఆపరేషన్.. అలుగును విక్రయిస్తున్న నిందితుల అరెస్ట్
డిప్యూటీ సీఎంగా సునేత్ర పవార్.. రేపు ప్రమాణస్వీకారం