ఇజ్రాయెల్ ప్రధాని రేసులో ఐసెన్కోట్.. అరబ్ పార్టీల మద్దతు
ABN , Publish Date - Nov 06 , 2026 | 07:22 AM
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆయన ప్రభుత్వం మళ్లీ ఏర్పడే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్లో అతిపెద్ద అరబ్ రాజకీయ కూటమి అయిన జాయింట్ లిస్ట్, రామ్ పార్టీలు మాజీ మిలిటరీ చీఫ్ గడి ఐసెన్కోట్కు మద్దతు ప్రకటించాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. ఆయన ప్రభుత్వం మళ్లీ ఏర్పడే పరిస్థితి కనిపించడం లేదు. కొత్త ప్రభుత్వ ఏర్పాటుపై రాజకీయ పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఇజ్రాయెల్లో అతిపెద్ద అరబ్ రాజకీయ కూటమి అయిన జాయింట్ లిస్ట్, రామ్ పార్టీలు మాజీ మిలిటరీ చీఫ్ గడి ఐసెన్కోట్కు మద్దతు ప్రకటించాయి. దీంతో తదుపరి ప్రధానిగా ఐసెన్కోట్ బాధ్యతలు చేపట్టే అవకాశాలు మెరుగయ్యాయి. కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలనే అంశంపై అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ వరుసగా రెండో రోజు రాజకీయ పార్టీలతో సంప్రదింపులు జరుపుతున్నారు. నెతన్యాహు, ఐసెన్కోట్ స్పష్టమైన మెజారిటీ సాధించలేదు. ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలనే అధికారం అధ్యక్షుడికి ఉన్నా.. సంప్రదాయంగా అత్యధిక మంది ఎంపీల మద్దతు ఉన్న నేతకు అవకాశం కల్పిస్తారు.
కింగ్ మేకర్లుగా అరబ్ పార్టీలు
గత నెల 27న జరిగిన ఇజ్రాయెల్ ఎన్నికల్లో అరబ్ కూటమి 19 సీట్లు సాధించాయి. ఈ నేపథ్యంలో తదుపరి ప్రభుత్వ ఏర్పాటులో అవి కింగ్ మేకర్లుగా నిలిచాయి. ఐసెన్కోట్కు అరబ్ పార్టీలు మద్దతు ప్రకటించినా.. ఆయన నేతృత్వంలోని ప్రభుత్వంలో అవి భాగస్వాములవుతాయా అనే అంశంపై స్పష్టత లేదు. ప్రభుత్వ ఏర్పాటు కోసం ఐసెన్కోట్కు అవకాశం కల్పించాలని అధ్యక్షుడు హెర్జోగ్కు సిఫారసు చేస్తామని 11 స్థానాలు గెలుచుకున్న జాయింట్ లిస్ట్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ కూటమిలోని మూడు వర్గాలు ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నాయని వెల్లడించింది. నెతన్యాహు మళ్లీ ప్రధాని కాకుండా చూడాలన్న ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నామని పేర్కొంది. ఎనిమిది స్థానాలు సాధించిన రామ్ పార్టీ కూడా ఐసెన్కోట్కు మద్దతు ప్రకటించింది. తాజా మద్దతుతో ఆయనకు 67 మంది ఎంపీల మద్దతు లభించినట్లయింది. 120 మంది సభ్యులున్న ఇజ్రాయెల్ పార్లమెంట్లో ఇది మెజారిటీకి మించిన సంఖ్య కావడం గమనార్హం.
ఏం జరగనుంది?
ప్రభుత్వ ఏర్పాటుకు అధ్యక్షుడు హెర్జోగ్ ఒక ఎంపీకి అధికారికంగా బాధ్యతలు అప్పగించిన తర్వాత.. ఆ ఎంపీ 28 రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలి. అవసరమైతే మరో 14 రోజులపాటు గడువును పొడిగించే అధికారం అధ్యక్షుడికి ఉంటుంది. నిర్దేశిత సమయంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయకపోతే అధ్యక్షుడు మరో ఎంపీకి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి..
డెమోక్రాట్లపై ట్రంప్ చివరి అస్త్రం! ఎలా పనిచేస్తుందంటే.
అమెరికా తొలి ముస్లిం సెనెటర్ భార్యకు భారతీయ మూలాలు