ఉక్రెయిన్ రైల్వే స్టేషన్‌పై డ్రోన్ దాడి.. 13 మంది మృతి
ABN , Publish Date - Oct 29 , 2026 | 04:05 PM
ఉక్రెయిన్‌లో ఓ రైల్వే స్టేషన్‌పై నేడు ఉదయం జరిగిన డ్రోన్ దాడిలో 13 మంది మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. డినిప్రోపెట్రోవస్క్ ప్రాంతంలోని డినిప్రో రైల్వే స్టేషన్‌పై ఈ దాడి జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: ఉక్రెయిన్‌లో ఓ రైల్వే స్టేషన్‌పై నేడు ఉదయం జరిగిన డ్రోన్ దాడిలో 13 మంది మరణించారు. ఐదుగురు గాయపడ్డారు. డినిప్రోపెట్రోవస్క్ ప్రాంతంలోని డినిప్రో రైల్వే స్టేషన్‌పై ఈ దాడి జరిగింది. ప్లాట్‌ఫాం వద్ద ఓ రైలు ఆగి ఉన్న సమయంలో ఈ డ్రోన్ దాడి జరిగింది. ఈ ఘటనపై ఉక్రెయిన్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. పౌర మౌలికవసతులపై దాడులు పెరుగుతున్న తీరుకు ఇది నిదర్శనమని నగర మేయర్ బోరిస్ ఫిలాటోవ్ అన్నారు. దాడి నేపథ్యంలో ఆ ప్రాంతంలో హైఅలర్ట్ ప్రకటించారు.
బుధవారం రాత్రి తమ భూభాగం వైపు వచ్చిన 600 ఉక్రెయిన్ డ్రోన్లను కూల్చేశామని రష్యా రాజధాని మాస్కో నగర మేయర్ సెర్గీ సొబ్యానిన్ పేర్కొన్నారు. అధిక శాతం డ్రోన్స్‌ను మార్గమధ్యంలోనే కూల్చేశామని చెప్పారు. తమ భూభాగంలో పలు డ్రోన్ దాడులు జరిగాయని ఉక్రెయిన్ అధికారులు కూడా తెలిపారు.
ఇటీవల కాలంలో రష్యా, ఉక్రెయిన్‌లకు డ్రోన్స్ ప్రధాన ఆయుధంగా మారిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ నెలలో ఉక్రెయిన్ ఓ రోజు ఏకంగా 1,600 డ్రోన్లను మాస్కో ప్రాంతం వైపు ప్రయోగించింది. యుద్ధం మొదలైన నాటి నుంచీ ఒక్క రోజులో అన్ని డ్రోన్స్ ప్రయోగించడం అదే తొలిసారని మేయర్ సొబ్యానిన్ పేర్కొన్నారు. యూఎస్ చొరవ కారణంగా వచ్చే నెలలో రష్యా, ఉక్రెయిన్ శాంతిచర్చలను పునఃప్రారంభించనున్నాయి. ఈ నేపథ్యంలో దాడులు కొనసాగుతుండటంపై ఉక్రెయిన్‌లో ఆందోళన వ్యక్తం అవుతోంది.
ఈ వార్తలనూ చదవండి:
ఫ్లేవియో బొల్సనారో ఎస్కేప్ ఎపిసోడ్.. సినిమా లెవల్‌లో ఉందిగా..!
స్పెయిన్‌లో రైలు ప్రమాదంపై కట్టలు తెగిన ఆగ్రహం