ఫ్లేవియో బొల్సనారో ఎస్కేప్ ఎపిసోడ్.. సినిమా లెవల్లో ఉందిగా..!
ABN , Publish Date - Oct 29 , 2026 | 03:44 PM
తాజాగా బ్రెజిల్ ఎన్నికల్లో ఓడిన ఫ్లేవియో బొల్సనారో అమెరికాకు పారిపోయారని అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. అయితే ఆయన ఎలా యూఎస్‌కు జారుకున్నారో వివరిస్తూ ఆ సంస్థలు పలు కథనాలను ప్రచురించాయి.
ఇంటర్నెట్ డెస్క్: తాజాగా బ్రెజిల్ ఎన్నికల్లో ఓడిన ఫ్లేవియో బొల్సనారో అమెరికాకు పారిపోయారని అంతర్జాతీయ మీడియా సంస్థలు తెలిపాయి. అయితే ఆయన ఎలా యూఎస్‌కు జారుకున్నారో వివరిస్తూ ఆ సంస్థలు పలు కథనాలను ప్రచురించాయి. వాటి ప్రకారం ఈ ఎస్కేప్ ఎపిసోడ్ సినిమా స్క్రిప్ట్‌ను తలపించేలా ఉంది. సోమవారం బ్రెజిల్‌లోని తన నివాసం నుంచి కుటుంబం (భార్య, ఇద్దరు కూతుళ్లు)తో పాటు బొల్సనారో నాలుగు బ్లాక్ కార్లతో బయలుదేరారు. కొంత దూరం వెళ్లాక ఈ నాలుగు కార్లు వేరువేరు దిశలకు రూటు మార్చాయి. ఆయన ఏ కారులో ఉన్నారో రహస్యంగా ఉంచేందుకు ఈ ఐడియా ఉపయోగపడింది. ఆ తరువాత ఫ్లేవియో బొల్సనారో, కుటుంబం ఉన్న కారు అర్జెంటీనా వైపునకు కదిలింది.
మరోవైపు బొల్సనారో బ్రెజిల్‌లోనే ఉన్నా ఆయన అమెరికా పారిపోయారని సరిగ్గా అప్పుడే ప్రచారం సాగింది. ఈ ప్రచారం పారిపోవటానికి ఆయనకు వీలు కల్పించింది. మంగళవారం రాత్రికి ఫ్లేవియో బొల్సనారో రోడ్డుమార్గంలో అర్జెంటీనా చేరుకున్నారు. ఆ దేశ విమానాశ్రయానికి వెళ్లి.. ప్రైవేట్ జెట్ సహాయంతో అమెరికాలోని మియామికి పారిపోయారు. ఈ ప్రయాణం కోసం బోల్సనారో ఇటాలియన్ పాస్‌పోర్ట్ వాడినట్టు సమాచారం. యూఎస్‌లో దిగిన ఈ కుటుంబం మీడియా దృష్టిలో పడకుండా అమెరికా అధికారులు పలు జాగ్రత్తలు తీసుకున్నారు. గొడుగులు అడ్డుపెట్టి బొల్సనారో ఎవరి కంటా పడకుండా చూసుకున్నారు. అనంతరం ఈ కుటుంబానికి ట్రంప్ ప్రభుత్వం వీసాలూ జారీ చేసింది. మానవతా పెరోల్ కింద దేశంలో ప్రవేశించటానికి అనుమతించింది. దీంతో ఈ కుటుంబం ఒక సంవత్సరకాలం పాటు అమెరికాలో ఎలాంటి ఇబ్బందులూ లేకుండా ఉండొచ్చు. బొల్సనారో తన మద్దతుదారుడు కావటంతో ట్రంప్ స్వయంగా ఈ ఆదేశాలు జారీ చేశారు.
ఇంతకీ బొల్సనారో ఎందుకు పారిపోయారు..?
ఫ్లేవియో బొల్సనారోపై పలు అవినీతి ఆరోపణలు, మనీలాండరింగ్ కేసులు ఉన్నాయి. మరోవైపు బ్రెజిల్లో ఆదివారం ఆ దేశ అధ్యక్షపదవికి జరిగిన ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు. ఈ నేపథ్యంలో బొల్సనారోపై అక్కడి కోర్టు విచారణ చేపట్టింది. ఈ మేరకు బ్రెజిల్ విడిచి వెళ్లకూడదని, తమకు పాస్‌పోర్ట్ సమర్పించాలని ఆయనను ఆదేశించింది. దీంతో ఫ్లేవియో బొల్సనారో కుటుంబంతో సహా అగ్రరాజ్యానికి పారిపోయారు.
ఈ వార్తలూ చదవండి
బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి.. అమెరికా పారిపోయిన ఫ్లేవియో
ఎప్స్టీన్ ప్రస్తావన.. ట్రంప్ ఆసక్తికర సమాధానం..