స్పెయిన్‌లో హైస్పీడ్ రైళ్లు ఢీ.. మానవ తప్పిదమే కారణమా?
ABN , Publish Date - Oct 28 , 2026 | 09:51 PM
స్పెయిన్‌లో నేడు రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య తాజాగా 68కి పెరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: స్పెయిన్‌లో నేడు రెండు హైస్పీడ్ రైళ్లు ఢీకొన్న ఘటనలో మృతుల సంఖ్య తాజాగా 68కి పెరిగింది. 179 మంది గాయపడ్డారు. బాధితుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. టొలీడో ప్రావిన్స్‌లో నేడు ఉదయం 9.00 గంటల సమయంలో మాడ్రిడ్, ఆండలూసియా మధ్య హైస్పీడ్ రూట్‌లో ఈ ప్రమాదం జరిగింది. 397 ప్యాసింజర్లు ఉన్న ఓ రైలు నిలిపి ఉంచిన మరో రైలును ఢీకొట్టింది. రెండు బోగీలు పట్టాలు తప్పి పక్కకు పడిపోయాయి. ఇక నిలిపి ఉంచిన రైల్లో ఓ శిశువు సహా 147 మంది ఉన్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మనుషులు చేసిన పొరపాటు కారణంగా ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని స్థానిక మీడియాలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. హైస్పీడు రూట్‌లో నేటి ఉదయం సిగ్నలింగ్ సేఫ్టీ వ్యవస్థలో లోపాలు తలెత్తడంతో రైలు ఆపరేటర్లు ప్రత్యామ్నాయ ఏర్పాట్లతో సర్వీసు కొనసాగించినట్టు తెలుస్తోంది. 147 ప్యాసింజర్లు ఉన్న రైలు ట్రాక్‌పై నిలిచి ఉండగానే మరో రైలు (397 ప్యాసింజర్లు) వెనుక నుంచి వచ్చి ఢీకొట్టినట్టు వార్తలు వెలువడ్డాయి.
కంప్యూటర్ కమ్యూనికేషన్స్ వ్యవస్థలో లోపం కారణంగా రైలు ట్రాఫిక్ నిలిచిపోయిందని రవాణా శాఖ మంత్రి తెలిపారు. ఈ క్రమంలో ఓ రైలు ముందుకు వెళ్లేందుకు అనుమతించడంతో ప్రమాదం జరిగిందని చెప్పారు. రెడ్ సిగ్నల్ ఉన్నప్పటికీ ప్రోటోకాల్‌ను పక్కన పెట్టి రైలును ముందుకు కదిలేందుకు అనుమతించడంతో అది ఆగున్న రైలును ఢీకొట్టిందని అన్నారు. అసలు రెండో రైలును ఎలా అనుమతించారనే దానిపై ప్రస్తుతం దర్యాప్తు జరుగుతోంది. ఈ ప్రమాదం నేపథ్యంలో 100 రైలు సర్వీసులు నిలిచిపోయాయి.
ఈ వార్తలనూ చదవండి:
పాక్ సంచలన నిర్ణయం.. తైవాన్ ఎయిర్‌లైన్స్‌పై నిషేధం
బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి.. అమెరికా పారిపోయిన ఫ్లేవియో బొల్సనారో