Share News

పాక్ సంచలన నిర్ణయం.. తైవాన్ ఎయిర్‌లైన్స్‌పై నిషేధం

ABN , Publish Date - Oct 28 , 2026 | 09:12 PM

చైనా మెప్పు కోసం ఏం చేసేందుకైనా తాము సిద్ధమని పాకిస్థాన్ మరోసారి నిరూపించింది. తైవాన్‌కు చెందిన ‌ విమానాలు తమ గగనతలంలోకి రాకుండా నిషేధించింది.

పాక్ సంచలన నిర్ణయం.. తైవాన్ ఎయిర్‌లైన్స్‌పై నిషేధం
Pak Bans Taiwanese Airlines

ఇంటర్నెట్ డెస్క్: చైనా మెప్పు కోసం ఏం చేసేందుకైనా తాము సిద్ధమని పాకిస్థాన్ మరోసారి నిరూపించింది. తైవాన్‌కు చెందిన ‌ విమానాలు తమ గగనతలంలోకి రాకుండా నిషేధించింది. రెండు తైవాన్ సంస్థలపై ఈ నిషేధాన్ని విధించింది. తైవాన్ తమ దేశంలో భూభాగమని చైనా చెబుతున్న విషయం తెలిసిందే. ఈ దిశగా వన్ చైనా విధానానికి ప్రపంచం మొత్తం కట్టుబడి ఉండాల్సిందేనని పదే పదే చెబుతోంది. కానీ తైవాన్‌కు చెందిన కమర్షియల్ ఎయిర్‌లైన్స్‌ను తమ గగనతలంలోకి రాకుండా ఇప్పటివరకూ ఏ దేశమూ నిషేధించలేదు. పాక్ మాత్రం చైనా మెప్పు కోసం తొలిసారిగా ఇలాంటి సంచలన నిర్ణయానికి తెరతీసింది.


నిషేధం విధించిన మాట వాస్తవమేనని పాక్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ తెలిపారు. పౌర విమానయాన విభాగం కూడా వన్ చైనా పాలసీని అనుసరిస్తుందని చెప్పారు. కేవలం చైనా విమానాలనే తమ గగనతలంలోకి అనుమతిస్తున్నామని అన్నారు. తాము చైనాలో భాగం కాదని తైవాన్ ఎప్పటి నుంచో వాదిస్తోంది. కానీ ఈ వాదనను చైనా తిరస్కరిస్తోంది. అంతేకాకుండా, ప్రపంచదేశాలు వన్ చైనా పాలసీకి కట్టుబడి ఉండాలంటూ రాజకీయ ఆర్థిక పరమైన ఒత్తిడి తీసుకొస్తోంది.


సీషెల్స్, మారిషస్, మెడగాస్కర్ దేశాల ఏప్రిల్‌లో తైవాన్ ప్రెసిడెంట్‌ విమానానికి ఇచ్చిన అనుమతులను అకస్మాత్తుగా ఉపసంహరించుకున్నాయి. తమ గగనతలం మీదుగా వెళ్లవచ్చని మొదట అనుమతించి ఆపై అకస్మాత్తుగా వెనక్కు తీసుకున్నాయి. దీంతో, ప్రెసిడెంట్ పర్యటన వాయిదా పడింది. తైవాన్ పాస్‌పోర్టులను గుర్తించబోమని 2025లో సోమాలియా ప్రకటించింది. ఈ ఏడాది జూన్‌లో కెన్యా దాదాపు ఇలాంటి చర్యే తీసుకుంది. తమ దేశంలో జరుగుతున్న ఓ కాన్ఫరెన్స్‌కు తైవాన్ నిపుణులను అనుమతించబోమని చెప్పింది. తాజాగా పాక్ ఏకంగా పౌర విమానాలపైనే నిషేధం విధించింది. ఇక తైవాన్ స్వయంప్రతిపత్తికి యూఎస్ ఎప్పటి నుంచో మద్దతు తెలుపుతోంది. ప్రస్తుతం అధికారంలో ఉన్న ట్రంప్ సర్కారు మాత్రం ఈ విషయంలో చైనాకు ఆగ్రహం కలగకుండా ఆచితూచి వ్యవహరిస్తోంది.


ఈ వార్తలనూ చదవండి:

బ్రెజిల్ ఎన్నికల్లో ఓటమి.. అమెరికా పారిపోయిన ఫ్లేవియో బొల్సనారో

రెండు హైస్పీడు రైళ్లు ఢీ.. 46 మంది మృతి

Updated Date - Oct 28 , 2026 | 09:26 PM