రెండు హైస్పీడు రైళ్లు ఢీ.. 46 మంది మృతి
ABN , Publish Date - Oct 28 , 2026 | 03:53 PM
స్పెయిన్‌లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. రెండు హైస్పీడు రైళ్లు ఢీకొనడంతో 46 మంది దుర్మరణం చెందారు.
ఇంటర్నెట్ డెస్క్: స్పెయిన్‌లో బుధవారం ఘోర ప్రమాదం సంభవించింది. రెండు హైస్పీడు రైళ్లు ఢీకొనడంతో 46 మంది దుర్మరణం చెందినట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ విషయంలో అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. స్థానిక కాలమానం ప్రకారం ఉదయం 9 గంటల సమయంలో టొలీడో ప్రావిన్స్‌లో ఈ ప్రమాదం సంభవించింది. ఓ రైలు అదుపు తప్పి పక్కనే వెళుతున్న మరో రైలును ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్టు ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ప్రమాదం నేపథ్యంలో మాడ్రిడ్, ఆండలూసియా మధ్య రైలు సర్వీసులను నిలిపివేశారు.
ఈ ఘటనపై స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ స్పందించారు. ఘటన తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని చెప్పారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. అత్యవసర బృందాలు బాధితులకు సాయం అందిస్తున్నాయని చెప్పారు. బాధితులకు తక్షణ సాయం అందించేందుకు సమీపంలోని ఓ స్టేడియంలో ఏర్పాట్లు చేస్తున్నట్టు టొలీడో నగర మేయర్ తెలిపారు.
ఈ ఏడాది జనవరిలో దక్షిన స్పెయిన్‌లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో 45 మంది మృతి చెందారు. పట్టాలు తప్పిన ఓ రైలు ఎదురుగా వస్తున్న మరో రైలును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఐరోపాలో అత్యంత విస్తృతమైన రైల్ నెట్వర్క్ ఉన్న స్పెయిన్‌లో ఈ ప్రమాదం పెనుకలకలానికి దారి తీసింది. ఇక 2013లో జరిగిన ఓ రైలు ప్రమాదంలో ఏకంగా 80 మంది కన్నుమూశారు.
ఈ వార్తలనూ చదవండి:
రష్యా, ఉక్రెయిన్ల మధ్య అతి త్వరలో శాంతి చర్చలు.. ట్రంప్ వ్యాఖ్యలు
హౌతీలతో కాల్పుల విరమణకు సౌదీ అరేబియా $1 బిలియన్ ఆఫర్ చేసిందా?