Share News

డెమోక్రాట్లపై ట్రంప్ చివరి అస్త్రం! ఎలా పనిచేస్తుందంటే..

ABN , Publish Date - Nov 04 , 2026 | 09:04 PM

డెమోక్రాట్లపై అవసరమనుకుంటే వీటో అధికారాల్ని ప్రయోగిస్తానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చెప్పారు. మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఓటమి తరువాత ఈ వ్యాఖ్యలు చేశారు. మరి వీటో అధికారాలు ఎలా ఉంటాయంటే..

డెమోక్రాట్లపై ట్రంప్ చివరి అస్త్రం! ఎలా పనిచేస్తుందంటే..
Donald Trump

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మిడ్‌టర్మ్ ఎన్నికల్లో అధ్యక్షుడు ట్రంప్ సారథ్యంలోని రిపబ్లికన్‌లకు ఓటమి ఎదురైంది. అమెరికా చట్టసభల్లో (సెనెట్, ప్రతినిధుల సభ) డెమోక్రాట్లు పైచేయి సాధించారు. దీంతో, రాబోయే రోజుల్లో అమెరికా రాజకీయాలు రసవత్తరంగా మారనున్నాయి. ఇంతవరకూ చట్టసభల్లో రిపబ్లికన్ సభ్యుల మాట చెల్లుబాటైంది. తనకు నచ్చిన చట్టాలు తెచ్చుకోవడం ట్రంప్‌నకు కొంత సులువైంది. అయితే, డెమోక్రాట్ల ఆధిపత్యం మొదలైనా ట్రంప్ వెనక్కు తగ్గేది లేదని అంటున్నారు. చట్టాల విషయంలో డెమోక్రాట్లను దారికి తెచ్చుకునేందుకు చివరి అస్త్రంగా వీటోను ప్రయోగిస్తానని చెబుతున్నారు..


వీటో ఎలా పనిచేస్తుందంటే..

రెగ్యులర్ వీటో: సాధారణంగా బిల్లులు చట్ట రూపం దాల్చాలంటే ముందుగా చట్టసభల ఆమోదం పొందాలి. ఆ తరువాత బిల్లు శ్వేతసౌధానికి చేరుతుంది. అధ్యక్షుడి సంతకంతో చట్టంగా మారుతుంది. బిల్లు తన ముందుకు వచ్చినప్పుడు అధ్యక్షుడు ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండా సంతకం పెట్టేయొచ్చు. లేదా అభ్యంతరాలు ఉంటే పది రోజుల్లో బిల్లుకు తన సూచనలను జోడించి తిరిగి పంపించి వీటో చేయవచ్చు. ఈ 10 రోజుల తరువాత కూడా అధ్యక్షుడు వీటో చేయకుండా, లేదా సంతకం పెట్టకుండా మౌనంగా ఉండిపోతే బిల్లు దానంతట అదే చట్టంగా మారుతుంది. అయితే ఈ 10 రోజుల్లో ఆదివారాలను లెక్కించరు.

పాకెట్ వీటో: బిల్లు శ్వేత సౌధం చేరాక 10 రోజుల్లోపు అధ్యక్షుడు స్పందించకముందే సభ నిరవధిక వాయిదా పడితే, చివరకు అధ్యక్షుడికి తన అభ్యంతరాలు పంపే అవకాశం కూడా లేకపోతే బిల్లు కథ కూడా ముగిసిపోతుంది. ఆ తరువాత సభ ప్రారంభమయ్యాక బిల్లు మళ్లీ ప్రవేశపెట్టుకుని ఆమోదింప చేసుకోవాల్సి ఉంటుంది.

అమెరికా రాజ్యాంగ నిపుణుల ప్రకారం, అధ్యక్షుడికి బిల్లులోని కొన్ని అంశాలను మాత్రమే తిరస్కరించే హక్కు కూడా ఉండదు. బిల్లు మొత్తాన్ని ఆమోదించడం లేదా తిప్పి పంపించడం మినహా అధ్యక్షుడికి మరో మార్గం ఉండదు.


ఇక ట్రంప్ వీటోను అధిగమించేందుకు అమెరికా చట్టసభలకు అధికారం ఉన్నప్పటికీ ఇది ఎంతో కష్టతరమైన ప్రక్రియ అని నిపుణులు చెబుతున్నారు. బిల్లును ప్రతిపాదించిన పార్టీ వీటోను అధిగమించేందుకు ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. చట్టసభల సభ్యుల్లో మూడింట రెండొంతుల మంది ట్రంప్ అభ్యంతరాలను పక్కనబెట్టేందుకు అంగీకరిస్తేనే బిల్లు పాసవుతుంది. ఇది అంత సులభం కాదని నిపుణులు చెబుతున్నారు. అమెరికా మీడియా కథనాల ప్రకారం, ఇప్పటివరకూ అధ్యక్షుడు వీటో చేసిన బిల్లుల్లో 5 శాతం మాత్రమే చట్టసభలు ఆమోదింపజేసుకోగలిగాయి. అంటే, చట్టసభల్లో ప్రస్తుతం పైచేయి సాధించిన డెమోక్రాట్లకు రిపబ్లికన్ల మద్దతు లేనిదే ట్రంప్ వీటోను దాటి బిల్లును ఆమోదింపజేసుకునే పరిస్థితి ఉండదు.


వాస్తవానికి డెమోక్రాట్లు ప్రతిపాదించే బిల్లులను రిపబ్లికన్లు చట్టసభల్లోనే ఫిలిబస్టర్ విధానంతో అడ్డుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, బిల్లులు పాస్ చేయించుకునే క్రమంలో ముందుగా సభలో చర్చకు అధికారికంగా తెరపడాల్సి ఉంటుంది. ఇందుకోసం నెనెట్‌లో 60 మంది సభ్యుల మద్దతు తప్పనిసరి. ప్రస్తుతానికి డెమోక్రాట్లకు ఆ స్థాయి మద్దతు లేదు. దీంతో, ఫిలిబస్టర్ విధానంలో రిపబ్లికన్లు చర్చను నిరవధికంగా కొనసాగించి బిల్లుకు మోకాలడ్డే అవకాశం ఉంది. అయితే, ఫిలిబస్టర్‌కు మినహాయింపు ఉంది. వార్ పవర్స్ తీర్మానాలు, జాతీయ ఎమర్జెన్సీ ముగింపు తీర్మానం, సీఆర్ఏ తీర్మానాలతో పాటు బడ్జెట్‌ రీకన్సిలియేషన్, వాణిజ్య ఒప్పందాలు, ఫెడరల్ అధికారుల నియామకాల్లో సాధారణ మెజారిటీతో డెమోక్రాట్లు చర్చను ముగించి బిల్లులను పాస్ చేసుకునే అవకాశం ఉంది. ఫిలిబస్టర్‌ను తప్పించుకున్నా మళ్లీ అధ్యక్షుడి సంతకం కోసం బిల్లును పంపించాల్సి ఉంటుంది.


ఆర్థిక అంశాల్లో రాజీ ధోరణి అవలంబించకపోతే పరిస్థితి జటిలంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. చెక్కు బుక్కు ఒకరి వద్ద, పెన్ను మరొకరి వద్ద ఉన్నట్టు పరిస్థితి మారుతుంది కాబట్టి ఇరు వర్గాలు ఏకాభిప్రాయానికి రాకతప్పదని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్వహణకు కావాల్సిన నిధుల విడుదలకు కాంగ్రెస్ అనుమతి తప్పనిసరి. దీంతో, అధ్యక్షుడు తనకు కావాల్సినవి సాధించుకునేందుకు కొన్ని విషయాల్లో చట్టసభల అభీష్టానికి తలవంచక తప్పదని అక్కడి రాజ్యాంగ నిపుణులు చెబుతున్నారు.

ఈ వార్తలనూ చదవండి:

అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రాట్‌ల ఆధిపత్యం.. వీటో అంటూ ట్రంప్ సంచలన పోస్ట్..

మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఓటమి.. మస్క్ సెటైర్లు

Updated Date - Nov 04 , 2026 | 09:27 PM