Share News

మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఓటమి.. మస్క్ సెటైర్లు

ABN , Publish Date - Nov 04 , 2026 | 02:36 PM

యూఎస్ మిడ్‌టర్మ్ ఎన్నికల్లో అధికార రిపబ్లికన్లకు మద్దతుగా నిధుల వరద పారించిన అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌‌కు ఫలితాలు షాకిచ్చాయి.

మిడ్‌టర్మ్ ఎన్నికల్లో ఓటమి.. మస్క్ సెటైర్లు
Elon Musk on Midterm Election Results

ఇంటర్నెట్ డెస్క్: యూఎస్ మిడ్‌టర్మ్ ఎన్నికల్లో అధికార రిపబ్లికన్లకు మద్దతుగా నిధుల వరద పారించిన అపరకుబేరుడు ఎలాన్ మస్క్‌‌కు ఫలితాలు షాకిచ్చాయి. అయినప్పటికీ డెమోక్రాట్లను టార్గెట్ చేస్తూ ఆయన సెటైర్లు పేల్చారు. ‘స్పేస్ లేజర్లతో ఎన్నికల్లో జోక్యం చేసుకునేందుకు నేను చేసిన ప్రయత్నం ఫలించలేదనుకుంటా’ అంటూ గతంలో డెమోక్రాట్ల విమర్శలను ఉద్దేశిస్తూ సెటైర్లు పేల్చారు. తను మద్దతు ఇచ్చిన అభ్యర్థులు ఓటమి చవి చూసిన కొన్ని గంటలకు ఆయన ఎక్స్ వేదికగా ఈ మేరకు పోస్టు పెట్టారు.


టెక్సాస్ ఫలితాలు మస్క్‌కు ఊహించని షాకిచ్చాయని అక్కడి పరిశీలకులు కామెంట్ చేస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ పదవి బరిలో నిలిచిన డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జీనా హిజోహోసా ఘన విజయం సాధించారు. తన ప్రత్యర్థి, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి గ్రెగ్ ఆబట్‌కు మస్క్ 5 మిలియన్ డాలర్లు ఇచ్చారని ఆరోపించారు. టెక్సాస్ సెనేట్ సీటు కూడా డెమోక్రాట్ల సొంతమైంది. ఆ పార్టీ అభ్యర్థి జేమ్స్ టలరికో ఘన విజయం సాధించారు. ఈ అంశాలపై కూడా స్పందించిన మస్క్.. ఇక అంతరిక్షంలో డేటా సెంటర్లు పెట్టుకోవడమే బెటరని అన్నారు.


అమెరికా మీడియా కథనాల ప్రకారం, ఈ ఎన్నికల్లో రిపబ్లికన్లకు మద్దతుగా మస్క్ 500 మిలియన్ డాలర్ల పైచిలుకు నిధులు అందించారు. వీటిలో అధిక శాతం టెక్సాస్ అభ్యర్థుల అనుకూల ప్రచారం కోసం ఖర్చు చేశారు. అయినప్పటికీ, అమెరికన్ పౌరులు రిపబ్లికన్లకు షాకిచ్చారు. ఇప్పటికే ప్రతినిధులసభలో డెమోక్రాట్లు పైచేయి సాధించారు. సెనేట్‌లో కూడా వారిదే పైచేయి కానుందన్న అంచనాలు అంతకంతకూ బలపడుతున్నాయి. అమెరికా చట్టసభలపై డెమోక్రాట్లు పట్టుబిగించిన నేపథ్యంలో ఇకపై ట్రంప్ సర్కారుకు ఇబ్బందులు తప్పవన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఈ వార్తలనూ చదవండి:

అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్‌ పరిస్థితేంటి..

నేను పోటీ చేసుంటే, మాకు భారీ మెజారిటీ వచ్చేది: ట్రంప్

Updated Date - Nov 04 , 2026 | 02:48 PM