Share News

అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రాట్‌ల ఆధిపత్యం.. వీటో అంటూ ట్రంప్ సంచలన పోస్ట్..

ABN , Publish Date - Nov 04 , 2026 | 07:22 PM

అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్‌లు ఘన విజయం సాధించారు. సెనేట్‌తో పాటు ప్రతినిధుల సభలోనూ మెజారిటీ సాధించి రిపబ్లికన్‌ల ఆధిపత్యానికి తెరదించారు. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు రాజకీయంగా కీలక సవాలు ఎదురుకానుంది.

అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రాట్‌ల ఆధిపత్యం.. వీటో అంటూ ట్రంప్ సంచలన పోస్ట్..
Donald Trump Veto

ఇంటర్నెట్ డెస్క్: అమెరికా మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్‌లు ఘన విజయం సాధించారు. సెనేట్‌తో పాటు ప్రతినిధుల సభలోనూ మెజారిటీ సాధించి రిపబ్లికన్‌ల ఆధిపత్యానికి తెరదించారు. దీంతో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు రాజకీయంగా కీలక సవాలు ఎదురుకానుంది. వచ్చే రెండేళ్ల పాటు ఆయన ప్రభుత్వ నిర్ణయాలపై డెమోక్రాట్‌లు గట్టి నిఘా పెట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక ట్రూత్ సోషల్‌లో 'వీటో' అని రాసి ఉన్న ఎరుపు రంగు రిపబ్లికన్ టోపీ ఫొటోను పోస్ట్ చేశారు (US Midterm Election Results 2026).


2026 నవంబర్ 3న జరిగిన మధ్యంతర ఎన్నికల్లో డెమోక్రాట్‌లు అనూహ్య విజయాలు సాధించారు. తాజా లెక్కల ప్రకారం సెనేట్‌లో 100 స్థానాలకు గాను 53 స్థానాలను గెలుచుకున్నారు. ప్రతినిధుల సభలోనూ మెజారిటీకి అవసరమైన 218 స్థానాల మార్కును దాటి 220 స్థానాలను కైవసం చేసుకున్నారు. దీంతో రెండు సభల్లోనూ డెమోక్రాట్‌లకు ఆధిపత్యం లభించింది. టెక్సాస్, కాన్సాస్, సౌత్ కరోలినా వంటి సంప్రదాయ రిపబ్లికన్ ఆధిపత్య రాష్ట్రాల్లోనూ డెమోక్రాట్‌లు విజయాలు సాధించడం ఈ ఎన్నికల్లో ప్రత్యేకతగా నిలిచింది. నార్త్ కరోలినా, ఒహాయో రాష్ట్రాల్లోనూ సెనేట్ స్థానాలను గెలుచుకున్నారు (Donald Trump Veto).


ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ట్రంప్ సోషల్ మీడియాలో స్పందించారు (US House Results). ఎరుపు రంగు రిపబ్లికన్ టోపీపై 'వీటో' అని రాసి ఉన్న ఫొటోను పోస్ట్ చేశారు. డెమోక్రాట్‌లు తీసుకొచ్చే ప్రతిపాదనల్లో తనకు ఆమోదయోగ్యం కాని వాటిని అడ్డుకునేందుకు అధ్యక్షుడిగా తనకున్న వీటో అధికారాన్ని ఉపయోగిస్తాననే సంకేతాన్ని ఈ పోస్ట్ ద్వారా ఇచ్చారు. కాంగ్రెస్‌లో డెమోక్రాట్‌లకు మెజారిటీ రావడంతో ట్రంప్ ప్రభుత్వానికి పలు అంశాల్లో ఇబ్బందులు ఎదురుకావచ్చు. ప్రభుత్వ నిర్ణయాలపై విచారణలు చేపట్టడం, పరిపాలనా వ్యవహారాలపై ప్రశ్నలు లేవనెత్తడం, కొత్త చట్టాల ఆమోదాన్ని అడ్డుకోవడం వంటి అధికారాలు వారికి ఉంటాయి.


ఇవి కూడా చదవండి..

అమెరికా మిడ్‌టర్మ్ ఫలితాలపై కమలా హారిస్ స్పందన.. 'హల్లెలూయ' వీడియో వైరల్..


అమెరికా కాంగ్రెస్‌పై డెమోక్రాట్ల పట్టు.. భారత్‌ పరిస్థితేంటి..

Updated Date - Nov 04 , 2026 | 07:22 PM