Share News

ప్రభుత్వ విధానాలపై ప్రజాగ్రహం.. యూరప్ దేశాల్లో ఆందోళనల సెగ..

ABN , Publish Date - Oct 25 , 2026 | 04:28 PM

ఐరోపాలోని పలు దేశాల్లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయం, అందుబాటులో లేని ఇళ్లు, విద్యా రంగంలోని సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి ప్రజలను రోడ్లపైకి తీసుకొస్తున్నాయి.

ప్రభుత్వ విధానాలపై ప్రజాగ్రహం.. యూరప్ దేశాల్లో ఆందోళనల సెగ..
Europe protests 2026

ఇంటర్నెట్ డెస్క్: ఐరోపాలోని పలు దేశాల్లో ఆందోళనలు తీవ్రరూపం దాల్చుతున్నాయి. పెరుగుతున్న జీవన వ్యయం, అందుబాటులో లేని ఇళ్లు, విద్యా రంగంలోని సమస్యలు, ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి ప్రజలను రోడ్లపైకి తీసుకొస్తున్నాయి. ఫ్రాన్స్, అల్బేనియా, ఇటలీ, స్పెయిన్, పోర్చుగల్ సహా పలు దేశాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఆందోళనలు ప్రశాంతంగా సాగగా, మరికొన్ని చోట్ల నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించడంతోపాటు పలువురిని అదుపులోకి తీసుకున్నారు (Europe protests 2026).


ఫ్రాన్స్‌లో జీవన వ్యయం, ప్రభుత్వ విధానాలు, విద్యా రంగ సమస్యలపై ప్రజలు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. అక్టోబర్ 24న దేశవ్యాప్తంగా జరిగిన ప్రదర్శనల్లో సుమారు 4.10 లక్షల మంది పాల్గొన్నట్లు ఫ్రాన్స్ అంతర్గత వ్యవహారాల శాఖ అంచనా వేసింది. అయితే, కార్మిక సంఘాలు మాత్రం నిరసనకారుల సంఖ్య సుమారు 8 లక్షలుగా పేర్కొన్నాయి. పారిస్‌తోపాటు లియోన్, లిల్లే, మార్సెయి, మాంట్‌పెల్లియర్, నాంటెస్, టులూజ్ నగరాల్లో ఘర్షణలు నమోదయ్యాయి. నిరసనల్లో ఎక్కువ భాగం ప్రశాంతంగా సాగినప్పటికీ, కొన్ని ప్రాంతాల్లో నల్ల దుస్తులు ధరించిన వ్యక్తులు పోలీసులపై వస్తువులు విసిరారు. దేశవ్యాప్తంగా దాదాపు వెయ్యి మందిని పోలీసులు అరెస్టు చేశారు (France protests).


అల్బేనియా రాజధాని టిరానాలో విద్యార్థులు, కళాకారులు, ప్రతిపక్ష పార్టీల మద్దతుదారులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. అవినీతి ఆరోపణలు, జీవన వ్యయం, విద్యా రంగ సమస్యలు ఈ ఆందోళనలకు ప్రధాన కారణాలుగా నిలిచాయి. కొన్ని చోట్ల నిరసనకారులు ప్రభుత్వ భవనాలపై దాడులకు దిగడంతో పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించి జనాన్ని చెదరగొట్టారు. పలువురిని అదుపులోకి తీసుకున్నారు (Albania protests).


ఇటలీలోని మిలాన్, రోమ్, టురిన్, నేపుల్స్, బొలోన్యా, ఫ్లోరెన్స్ నగరాల్లో వేలాది మంది నిరసనల్లో పాల్గొన్నారు. జీవన వ్యయం, ప్రభుత్వ ప్రజా సేవలు, విద్య, యుద్ధాలకు సంబంధించిన విధానాలు వంటి అంశాలపై ప్రజలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొన్ని ప్రాంతాల్లో నిరసనకారులు సీసాలు, రాళ్లు, బాణసంచా విసిరారు. ఇటలీ పోలీసులు ఎనిమిది నగరాల్లో జరిగిన నిరసనల సందర్భంగా 371 మందిని తాత్కాలికంగా అదుపులోకి తీసుకున్నారు (Italy protests).


స్పెయిన్‌లో గృహ సంక్షోభం, పెరుగుతున్న అద్దెలు, జీవన వ్యయం ప్రజల అసంతృప్తికి కారణమవుతున్నాయి (Spain protests). బార్సిలోనాలో జరిగిన నిరసనల సందర్భంగా కొన్ని చోట్ల దుకాణాల్లో దోపిడీలు, నిప్పు పెట్టిన ఘటనలు నమోదయ్యాయి. పోలీసులు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు.

europe2.jpg


మరోవైపు, పోర్చుగల్‌లో అందుబాటు ధరల్లో ఇళ్లు లభించడం ప్రధాన సమస్యగా మారింది (Portugal protests). ముఖ్యంగా లిస్బన్‌లో ప్రజలు గృహ నిర్మాణ, గృహ విధానాలకు సంబంధించి నిరసనలు చేపట్టారు. ఇళ్ల ధరలు, అద్దెలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.


ఇవి కూడా చదవండి..

ముంబైలో తీవ్ర వాయు కాలుష్యం.. దుమ్ము, వాహనాల పొగ, నిర్మాణ పనులే ప్రధాన కారణాలు..


మామ ఇంట్లో బంగారం కాజేసి థార్ కొన్నాడు.. పూజకు ఆ మామనే ఆహ్వానిస్తే..

Updated Date - Oct 25 , 2026 | 04:29 PM