ముంబైలో తీవ్ర వాయు కాలుష్యం.. దుమ్ము, వాహనాల పొగ, నిర్మాణ పనులే ప్రధాన కారణాలు..
ABN , Publish Date - Oct 25 , 2026 | 03:37 PM
దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వాయు కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోడ్లపై పేరుకుపోతున్న దుమ్ము, వాహనాల నుంచి వెలువడే పొగ, నిర్మాణ పనులు, పారిశ్రామిక కార్యకలాపాలు నగరంలో గాలి నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వాయు కాలుష్యం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. రోడ్లపై పేరుకుపోతున్న దుమ్ము, వాహనాల నుంచి వెలువడే పొగ, నిర్మాణ పనులు, పారిశ్రామిక కార్యకలాపాలు నగరంలో గాలి నాణ్యతను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. వాతావరణ పరిస్థితులు అనుకూలించని కారణంగా కాలుష్య కారకాలు గాలిలోనే పేరుకుపోతున్నాయి (Mumbai air pollution).
అక్టోబర్ 24న ముంబైలో గాలి నాణ్యత సూచీ (AQI) 322కు చేరింది. ఇది అత్యంత అధ్వాన్నమైన గాలి నాణ్యతను సూచించే స్థాయి. అదే రోజు ఢిల్లీలో ఏక్యూఐ 176గా నమోదైంది. సాధారణంగా మన దేశంలో ఢిల్లీని అత్యంత కాలుష్య నగరంగా భావిస్తారు. అలాంటిది ఢిల్లీకి దాదాపు రెట్టింపు స్థాయిలో ముంబైలో గాలి కాలుష్యం పెరిగిపోయింది. ముంబైలో వాయు కాలుష్యానికి నిర్మాణ పనులు, రోడ్లపై పేరుకుపోయిన దుమ్ము, వాహనాల రాకపోకలు, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్య కారకాలు ప్రధాన కారణాలు. వాహనాలు ప్రయాణించే సమయంలో రోడ్లపై ఉన్న సూక్ష్మ ధూళి కణాలు గాలిలోకి చేరుతున్నాయి. రద్దీగా ఉండే కూడళ్లు, ప్రధాన రహదారుల వద్ద వాహనాల పొగ కూడా సమస్యను మరింత పెంచుతోంది (Mumbai AQI 322).

నగరంలో భారీ నిర్మాణాలు, మౌలిక సదుపాయాల పనులు కొనసాగుతుండటంతో నిర్మాణ ప్రదేశాల నుంచి వెలువడే ధూళిని నియంత్రించడం కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) నిర్మాణ ప్రదేశాల్లో కాలుష్య నియంత్రణ కోసం 28 అంశాలతో కూడిన మార్గదర్శకాలను జారీ చేసింది. నగరంలోని వివిధ వార్డుల్లో 76 ప్రత్యేక బృందాలను కూడా నియమించింది. ప్రతి బృందం రోజుకు కనీసం రెండు నిర్మాణ ప్రదేశాలను తనిఖీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది (Mumbai road dust pollution).
ముంబై నగరంలో సముద్ర తీరంలో ఉండటంతో సాధారణంగా గాలుల ద్వారా కాలుష్య కారకాలు చెదిరిపోయే అవకాశం ఉంటుంది. అయితే గాలి వేగం తగ్గినప్పుడు, వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు కాలుష్య కారకాలు ఒకేచోట పేరుకుపోతాయి. గాలిలోని తేమ, సముద్రపు ఉప్పు కణాలు కూడా పొగమంచు వంటి పొర ఏర్పడటానికి కొంతవరకు దోహదపడవచ్చు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఐపీఎస్‌ల సంతకాలు ఫోర్జరీ చేసి.. కోటికి పైగా కొల్లగొట్టి.. జల్సాలకు తగలెట్టి!
హుడా హైట్స్‌లో చ.గజం అప్‌సెట్ ధర 2 లక్షలు