Share News

ట్రంప్‏పై ప్రజాగ్రహానికి కారణాలెన్నో..

ABN , Publish Date - Nov 05 , 2026 | 05:09 AM

ట్రంప్‌ విధానాలతో విసిగిపోయిన అమెరికా ఓటర్లు తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో రుచి చూపించారు.

ట్రంప్‏పై ప్రజాగ్రహానికి కారణాలెన్నో..
happy moment

  • హామీలను విశ్వసించని అమెరికన్‌ ఓటర్లు.. ట్రంప్‌ రాజకీయ ఆధిపత్యానికి చెక్‌!

  • పెరిగిన జీవన వ్యయంతో కుదేలైన సగటు అమెరికన్లు

  • ఇరాన్‌పై యుద్ధం విషయంలోనూ తీవ్ర అసంతృప్తి

  • పట్టు కోల్పోయిన రిపబ్లికన్లు.. అనుకూలంగా మలుచుకున్న డెమోక్రాట్లు

  • రిపబ్లికన్ల కంచుకోటల్లోనూ పాగా.. 2028 ఎన్నికలు రిపబ్లికన్లకు గట్టి సవాల్‌

  • హామీలను విశ్వసించని అమెరికన్‌ ఓటర్లు

  • అన్ని వర్గాల్లోనూ పట్టు కోల్పోయిన రిపబ్లికన్లు

వాషింగ్టన్‌, నవంబర్‌ 4: ట్రంప్‌ విధానాలతో విసిగిపోయిన అమెరికా ఓటర్లు తమ ఆగ్రహాన్ని ఓటు రూపంలో రుచి చూపించారు. ధరలు తగ్గిస్తానని, స్థానిక పరిశ్రమలను పునరుద్ధరిస్తానని ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ ఇచ్చిన హామీలను ప్రజలు విశ్వసించలేదు. కాంగ్రెస్‌ ఉభయ సభల్లో(సెనేట్‌, హౌస్‌ ఆఫ్‌ రిప్రజెంటేటివ్స్‌) డెమొక్రాట్లు ఆధిక్యం సాధించారు. మిడ్‌టర్మ్‌(అధ్యక్ష ఎన్నికలకు మధ్యకాలంలో జరిగే పార్లమెంటు ఎన్నికలు) ఎన్నికలను తన అధ్యక్ష పాలనకు రెఫరెండంగా భావించి, ఓటుతో మద్దతుగా నిలవాలని ట్రంప్‌ ప్రతి ప్రచార సభలోనూ పిలుపునిచ్చారు. ‘‘నేను బ్యాలట్‌పై ఉన్నట్టు ఊహించుకుని ఓటేయండి’’అంటూ ట్రంప్‌ సూచించగా.. దీన్ని ఓటర్లు సీరియస్‌గానే తీసుకున్నట్టు కనిపిస్తోంది. ట్రంప్‌ విధానాలపై వ్యతిరేకతను వారు ఓటు రూపంలో చూపించినట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికాతో వాణిజ్యం చేస్తున్న దేశాలపై పెద్ద మొత్తంలో టారిఫ్‌లు విధించడం, ఇరాన్‌పై యుద్ధంతో ఇంధనాలు, నిత్యావసరాలు, ఇతర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోవడం ఓటర్లలో ఆగ్రహానికి దారితీసింది.

అమెరికాకు ఎగుమతయ్యే ఔషధాలను సైతం విడవకుండా ట్రంప్‌ టారిఫ్‌లతో బాదేశారు. దీంతో అక్కడి ప్రజల జీవన వ్యయం పెరిగిపోయింది. వలస విధానం, హెచ్‌1బీ వీసాలపై ఆంక్షలతో భారత సంతతి అమెరికన్లు డెమోక్రాట్ల వైపు మొగ్గు చూపారు. ఎన్నికల ఫలితాల తర్వాత ట్రంప్‌ మాట మారుస్తూ.. ‘‘నేనేమీ బ్యాలట్‌లో లేను కదా.. నేనే కనుక పోటీ చేస్తున్నట్టు అయితే చరిత్రాత్మక ఫలితాలు వచ్చి ఉండేవి’’ అని తన సోషల్‌ మీడియా వేదిక ‘ట్రూత్‌’లో పోస్ట్‌ చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ముందుండి నడిపించిన ట్రంప్‌.. ఇప్పుడు ఓటమి నెపాన్ని అభ్యర్థులపైకి నెట్టేశారు. అయితే, తాజా మిడ్‌టర్మ్‌ ఎన్నికల ఫలితాలు 2028 అధ్యక్ష ఎన్నికలను ప్రభావితం చేయనున్నాయి. ప్రజా వ్యతిరేకతను తగ్గించి, తిరిగి తమను అధికారంలోకి తీసుకురాగల భవిష్యత్‌ నేతపై రిపబ్లికన్లు దృష్టి పెట్టనున్నారు.


పుట్టి ముంచిన ఇరాన్‌పై యుద్ధం

ఇరాన్‌పై నెలల తరబడి సాగించిన యుద్ధం కూడా ఆయనపై తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. ఈ యుద్ధం సుదీర్ఘకాలం పాటు సాగడం, కీలకమైన హోర్ముజ్‌ జలసంధిని మూసివేయడం.. ప్రతీకారంగా గల్ఫ్‌ దేశాలపై ఇరాన్‌ దాడులతో చమురు ధరలు ఎగసిపడ్డాయి. ఈ వేడి సగటు అమెరికన్లనూ తాకింది. 2024 అధ్యక్ష ఎన్నికల్లో ఉద్యోగులు, యువకులు, హిస్పానిక్‌ ఓటర్ల(స్పెయిన్‌ లేదా లాటిన్‌ అమెరికా దేశాల మూలాలున్న) నుంచి ట్రంప్‌నకు గణనీయమైన మద్దతు లభించింది. కానీ, తాజా మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో ఆ మద్దతు తగ్గినట్లు ఏపీ ఓటర్‌ పోల్‌ సర్వేలో వెల్లడైంది. 30ఏళ్లలోపు ఓటర్లలో 70 శాతం, హిస్పానిక్‌ ఓటర్లలో 60 శాతం డెమోక్రాట్ల అభ్యర్థులకు జై కొట్టారు. టెక్సాస్-మెక్సికో సరిహద్దు ప్రాంతాల్లో ఈ మార్పు స్పష్టంగా కనిపించింది

ఈ వార్తలు కూడా చదవండి..

డెమోక్రాట్లపై ట్రంప్ చివరి అస్త్రం! ఎలా పనిచేస్తుందంటే.

అమెరికా తొలి ముస్లిం సెనెటర్ భార్యకు భారతీయ మూలాలు

Updated Date - Nov 05 , 2026 | 05:20 AM