Share News

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్ల మృతి!

ABN , Publish Date - Oct 12 , 2026 | 07:31 PM

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఇవాళ ఆర్మీ శిక్షణ విమాన ప్రమాదానికి గురైంది.

పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం.. ఇద్దరు పైలట్ల మృతి!
Pakistan Aircraft Crash

ఇంటర్నెట్ డెస్క్: తరచూ ఏదో ఒక ప్రాంతంలో విమాన, హెలికాఫ్టర్ ప్రమాదాలు జరుగుతుంటాయి. సాంకేతిక సమస్యలు, ఇతర కారణాలతో ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ఇలాంటి ఘటనల్లో అనేక మంది అమాయకులు ప్రాణాలు కోల్పోతుంటారు. తాజాగా పాకిస్థాన్‌లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. బలూచిస్థాన్ ప్రావిన్స్‌లో ఇవాళ(సోమవారం) ఆర్మీ శిక్షణ విమాన ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఇద్దరు శిక్షణా పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. స్థానిక అధికారులు తెలిపిన వివరాల ప్రకారం..


నవాన్ కిల్లి పట్టణ సమీపంలో పాక్ ఆర్మీకి చెందిన పీఏసీ ఎంఎఫ్‌ఐ-17 ముష్షాక్ (PAC MFI-17 Mushshak) శిక్షణ విమానం సాధారణ విధుల్లో భాగంగా సోమవారం టేకాఫ్ అయింది. అనంతరం కొద్దిసేపటికే ఆ విమానంలో సాంకేతిక సమస్య తలెత్తి కూలిపోయింది. ఈ దుర్ఘటనలో విమానంలో ఉన్న ఇద్దరు పైలట్లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతుల్లో ఫ్లయింగ్ ఇన్‌స్ట్రక్టర్ మేజర్ హుస్నైన్ షెహజాద్ హుమాయూన్, ట్రైనీ పైలట్ కెప్టెన్ అబ్దుల్ సమద్ ఉన్నట్లు సమాచారం.


ఈ ఘటనపై పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షెహబాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, పాకిస్థాన్‌లో సైనిక శిక్షణ విమానాలు కూలిపోవడం తరచూ జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పాక్ గగనతల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా జరిగిన విమానా ప్రమాదానికి కారణాలు ఏమిటనేది అధికారులు వెల్లడించలేదు. గతంలోనూ ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పటికీ, కారణాలపై అధికారికంగా లోతైన దర్యాప్తు వివరాలు వెల్లడించకపోవడం గమనార్హం.


ఇవి కూడా చదవండి:

ఢిల్లీలో ఉద్రిక్తత.. సుప్రీంకోర్టుకు ఇండియా కూటమి మార్చ్!

జ్ఞానేశ్ కుమార్ తొలగింపుపై కేరళం అసెంబ్లీ తీర్మానం

సుప్రీం కోర్టును రాజకీయాల్లోకి లాగాలని చూడొద్దు: సీజేఐ

Updated Date - Oct 12 , 2026 | 07:45 PM