Share News

జంతర్ మంతర్ క్లోజ్.. ఇక నిరసన ప్రదర్శనలకు ఇకపై ఢిల్లీలో మూడు కొత్త వేదికలు

ABN , Publish Date - Oct 12 , 2026 | 02:50 PM

దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత నిరసనల ప్రాంతం జంతర్ మంతర్ వద్ద ఇకనుంచి నిరసన ప్రదర్శనలు చేపట్టలేరు. ఇప్పటివరకూ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత తెలిపేందుకు కేంద్రంగా ఉన్న ఆ ప్రాంతాన్ని నిరసన ప్రదర్శనలు తెలిపే వేదిక నుంచి తొలగిస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు.

జంతర్ మంతర్ క్లోజ్.. ఇక నిరసన ప్రదర్శనలకు ఇకపై ఢిల్లీలో మూడు కొత్త వేదికలు
jantar mantar site

ఇంటర్‌నెట్ డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలోని ప్రఖ్యాత నిరసనల ప్రాంతం జంతర్ మంతర్ వద్ద ఇకనుంచి నిరసన ప్రదర్శనలు చేపట్టలేరు. ఇప్పటివరకూ ప్రభుత్వ విధానాలపై వ్యతిరేకత తెలిపేందుకు కేంద్రంగా ఉన్న ఆ ప్రాంతాన్ని నిరసన ప్రదర్శనలు తెలిపే వేదిక నుంచి తొలగిస్తూ ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ సోమవారం ఓ ప్రకటన విడుదల చేశారు. జంతర్ మంతర్‌ను నిరసనలు తెలిపే ప్రదేశం నుంచి డీనోటిఫై చేస్తున్నామని ఆ ప్రకటనలో కమిషనర్ పేర్కొన్నారు. ఢిల్లీలో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు, బైఠాయింపులు వంటి కార్యక్రమాలు నిర్వహించడానికి మూడు ప్రదేశాలను ఆయన వెల్లడించారు. అవి రామ్‌లీలా గ్రౌండ్, బురారీ గ్రౌండ్, ఈస్ట్ ఢిల్లీలోని సీబీడీ గ్రౌండ్ అని పేర్కొన్నారు. ఇక నుంచి ఆ మూడు ప్రాంతాలలోనే ఆందోళలు, ప్రదర్శనలు, బైఠాయింపులు చేసుకోవాలని సూచించారు. ఇందుకోసం త్వరలోనే వేర్వేరుగా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్‌ను విడుదల చేస్తామని తెలిపారు.


కాగా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో ఓటరు జాబితాల నుంచి ఓటర్ల పేర్లను తొలగించారన్న ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండియా కూటమి, కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)లు జంతర్ మంతర్ వద్ద నిరసన ప్రదర్శనలు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జంతర్ మంతర్‌ను నిరసనలు తెలిపే ప్రాంతం నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. జంతర్ మంతర్‌ను నిరసనలు తెలిపే ప్రాంతం నుంచి తొలగిస్తూ ఢిల్లీ పోలీసు కమిషనర్ జారీ చేసిన ప్రకటన నేపథ్యంలో ప్రతిపక్షాలు కేంద్ర ప్రభుత్వంపై తీవ్రంగా మండిపడ్డాయి. ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనలు తెలిపే అవకాశం కూడా లేకుండా చేస్తున్నారని కేంద్రంపై తీవ్రంగా విమర్శలు గుప్పించాయి. ఢిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వశాఖ పరిధిలోకి వస్తారు. మరోవైపు తాజా నిర్ణయం నేపథ్యంలో జంతర్ మంతర్ ప్రాంతంలో ట్రాఫిక్ ఇబ్బందులు తొలగనున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పలు కీలక ప్రభుత్వ విభాగాల భవనాలు ఈ ప్రాంతంలోనే ఉన్నాయి.


ఇవి కూడా చదవండి..

కాల్పుల విరమణ ప్రకటించిన ట్రంప్.. అయినా ఉక్రెయిన్‌పై రష్యా దాడి!


స్వల్పంగా తగ్గిన ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

Updated Date - Oct 12 , 2026 | 06:39 PM