Share News

సుప్రీంకోర్టును రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్..

ABN , Publish Date - Oct 12 , 2026 | 12:53 PM

దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనల వల్ల కోర్టు కార్యకలాపాలకు, న్యాయవాదులు, కక్షిదారుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఆయన పేర్కొన్నారు.

సుప్రీంకోర్టును రాజకీయ వివాదాల్లోకి లాగొద్దు: సీజేఐ జస్టిస్ సూర్యకాంత్..
CJI Surya Kant

న్యూఢిల్లీ: దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును రాజకీయ వివాదాల్లోకి లాగొద్దని భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. ఢిల్లీలో కొనసాగుతున్న నిరసనల కారణంగా కోర్టు కార్యకలాపాలకు, న్యాయవాదులు, కక్షిదారుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ఉన్నప్పటికీ, వాటి వల్ల న్యాయవ్యవస్థ పనితీరు దెబ్బతినకూడదని సీజేఐ పేర్కొన్నారు.


భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా అక్టోబర్ 10న జరిగిన నిరసనల వేళ న్యాయవాదులను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ అంశంపై దాఖలైన పిటిషన్లను సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది ఆత్మారామ్ నాడ్కర్ణి, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రదీప్ రాయ్ కేసుకు సంబంధించిన కీలక విషయాలను ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు నిరసనల సమయంలో న్యాయవాదులు ఎదుర్కొన్న ఇబ్బందులపై న్యాయపరమైన జోక్యం అవసరమని వారు కోర్టుకు విన్నవించారు.


ఈ సందర్భంగా సీజేపీ జస్టిస్ సూర్యకాంత్ స్పందిస్తూ.. ప్రజాస్వామ్య హక్కులో నిరసనలు భాగమేనని, అయితే సుప్రీంకోర్టు విధులకు అవి ఆటంకం కలిగించకూడదని స్పష్టం చేశారు. 'నేను నిరసనకారులకు కూడా విజ్ఞప్తి చేశాను. సుప్రీంకోర్టును ఇలాంటి అంశాల్లోకి లాగకూడదు. నిరసనలను శాంతియుతంగా నిర్వహించండి. కోర్టు కార్యకలాపాలకు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, కక్షిదారుల రాకపోకలకు ఎలాంటి ఆటంకం లేదా అడ్డంకి కలగకూడదు' అని సీజేఐ అన్నారు. అనంతరం ఈ పిటిషన్లను మంగళవారం విచారించేందుకు ధర్మాసనం అంగీకరించింది.


ఈ వార్తలు కూడా చదవండి

‘రోడ్లు డ్రైవింగ్ కోసమే కదా?’.. ముగ్గురి మృతిపై నిందితుడి వ్యాఖ్యలు..

చెత్త పడేసిన వ్యక్తికి ఊహించని షాక్.. మైక్‌లో గట్టి వార్నింగ్..

Updated Date - Oct 12 , 2026 | 01:04 PM