Share News

‘రోడ్లు డ్రైవింగ్ కోసమే కదా?’.. ముగ్గురి మృతిపై నిందితుడి వ్యాఖ్యలు..

ABN , Publish Date - Oct 12 , 2026 | 07:57 AM

కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన మినీ కూపర్ కారు.. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు యువతీయువకులు ప్రాణాలు కోల్పోయారు.

‘రోడ్లు డ్రైవింగ్ కోసమే కదా?’.. ముగ్గురి మృతిపై నిందితుడి వ్యాఖ్యలు..
Kochi Mini Cooper crash

కొచ్చి: కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకొచ్చిన మినీ కూపర్ కారు.. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టడంతో ముగ్గురు యువతీయువకులు మృతిచెందారు. ఈ ఘటన ఆదివారం తెల్లవారుజామున ఎర్నాకుళం జిల్లా నెడుంబస్సేరిలో చోటుచేసుకుంది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతులను దేవిక (వయనాడ్), గోపిక (పాలక్కాడ్), ఇజాజ్ (కర్ణాటక)గా గుర్తించారు.


పోలీసుల వివరాల ప్రకారం.. ముగ్గురు స్నేహితులు సమీపంలోని దుకాణంలో టీ తాగి స్కూటర్‌పై ఇంటికి వెళ్తున్నారు. తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో అతి వేగంగా దూసుకొచ్చిన కారు వారి స్కూటీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ముగ్గురూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించినప్పటికీ, వారు ప్రాణాలు కోల్పోయారు.


ఈ ప్రమాదానికి కారణమైన కారును సుహైల్ సజీవ్ (19) అనే యువకుడు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరిగిన తర్వాత స్థానికులు అతడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాద సమయంలో డ్రైవర్ మద్యం లేదా ఇతర మత్తు పదార్థాలు తీసుకున్నాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే, నిందితుడు మద్యం సేవించి ఉండవచ్చని ప్రాథమిక విచారణలో అనుమానిస్తున్నట్లు ఎర్నాకుళం రూరల్ ఎస్పీ కేఎస్ సుదర్శన్ తెలిపారు. డ్రైవర్ రక్త నమూనాల పరీక్షలకు సంబంధించిన తుది నివేదికలు రావాల్సి ఉందన్నారు. కారులో మత్తు పదార్థాలకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయా అనే విషయాన్ని తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ బృందం పరీక్షలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.


అయితే, విచారణ సందర్భంగా నిందితుడి వ్యాఖ్యలు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఈ ఘటన తర్వాత సుహైల్ ఏమాత్రం పశ్చాత్తాపం వ్యక్తం చేయలేదని వారు పేర్కొన్నారు. పైగా, ‘రోడ్లు దేనికి? డ్రైవింగ్ కోసమే కదా?’ అని స్థానికులు, పోలీసులనే ప్రశ్నించినట్లు తెలుస్తోంది. అలాగే, ఈ విషయాన్ని తన నాన్న చూసుకుంటారని చెప్పినట్లు సమాచారం. మరోవైపు, వైద్య పరీక్షల కోసం నిందితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లగా.. మృతుల స్నేహితుల్లో కొందరు అతడిపై దాడి చేశారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి పోలీసులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఈ ఘటన కేరళలో తీవ్ర కలకలం రేపుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

పంజాబ్ ఓటర్ల జాబితాలో భగత్‌సింగ్ ఫొటో.. ఎన్నికల అధికారి ఏమన్నారంటే..?

కన్న బిడ్డ హెల్త్ ఇన్సూరెన్స్‌నూ రద్దు చేశారు.. మస్క్‌పై మాజీ భార్య ఆరోపణ

Updated Date - Oct 12 , 2026 | 08:06 AM