పంజాబ్ ఓటర్ల జాబితాలో భగత్‌సింగ్ ఫొటో.. ఎన్నికల అధికారి ఏమన్నారంటే..?
ABN , Publish Date - Oct 12 , 2026 | 07:04 AM
పంజాబ్ ఓటర్ల జాబితాలో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌ను పోలిన ఫొటో కనిపించడం వివాదానికి దారితీసింది. ఓ ఓటర్ పేరుకు ఎదురుగా ఆయన ఫొటో కనిపించడంతో రాజకీయ దుమారం రేగింది.
లూథియానా: పంజాబ్ ఓటర్ల జాబితాలో స్వాతంత్ర్య సమరయోధుడు భగత్‌సింగ్‌ను పోలిన ఫొటో కనిపించడం వివాదానికి దారితీసింది. ఓ ఓటర్ పేరుకు ఎదురుగా ఆయన ఫొటో కనిపించడంతో రాజకీయంగా దుమారం రేగింది. ఈ అంశాన్ని కాంగ్రెస్ నేత, ఎంపీ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ లేవనెత్తారు. లూథియానా ఈస్ట్ అసెంబ్లీ నియోజకవర్గ ఓటర్ జాబితాలోని పార్ట్ 38 సీరియల్ నంబర్ 422 వద్ద భగత్‌సింగ్‌ను ఫొటో ఉందని వారింగ్ ఆరోపించారు. ఓటర్ ఫొటో స్థానంలో స్వాతంత్ర్య సమరయోధుడి ఫొటో ప్రచురించడం ఏంటని పంజాబ్ ఎన్నికల అధికారులను ఆయన ప్రశ్నించారు. ఈ అంశంలో అధికారుల తీరుపై సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు.
అయితే, ఈ అంశంపై లూథియానా జిల్లా ఎన్నికల అధికారి స్పందించారు. ఈ పొరపాటును గతంలోనే గుర్తించి సరిచేశామని స్పష్టం చేశారు. ఎంపీ అమరీందర్ సింగ్ రాజా వారింగ్ వ్యాఖ్యలు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ఉన్నాయని పేర్కొన్నారు. గతంలో ప్రచురించిన ఓటర్ జాబితాలో ఈ పొరపాటు చోటుచేసుకుందని, ఆగస్టు 13, 2026న విడుదల చేసిన ముసాయిదా ఓటర్ జాబితాలోనూ అది కొనసాగిందని వివరించారు. ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ (SIR)లో భాగంగా ఈ లోపాన్ని గుర్తించి సరిచేసినట్లు తెలిపారు. సరైన ఫొటోతో తుది ఓటర్ జాబితాను సిద్ధం చేశామని, అక్టోబర్ 12న దానిని ప్రచురించనున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి వెల్లడించారు.
కాగా, ఇప్పటికే సర్, ఓటు చోరీ అంశాలపై దేశ రాజధాని అట్టుడుకుతోంది. ఈ అంశాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషన్ జ్ఞానేశ్ రాజీనామా చేయాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒకవైపు కాక్రోచ్ జనతా పార్టీ, మరోవైపు రాహుల్ గాంధీ నేతృత్వంలోని ఇండి కూటమి పార్టీలు ఆయన రాజీమానాకు పట్టుపడుతున్నాయి. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ఢిల్లీ సహా పలు ప్రాంతాల్లో నిరసనలకు దిగుతున్నారు. ఇలాంటి వేళ పంజాబ్ ఓటర్ల జాబితాలో భగత్ సింగ్ ఫొటో కనిపించడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది.
ఈ వార్తలు కూడా చదవండి
ఢిల్లీ-చెన్నై విమానంలో మంటలు.. శంషాబాద్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
పోటీ పరీక్షల రోజున ర్యాలీలకు అనుమతి వద్దు