Share News

చెత్త పడేసిన వ్యక్తికి ఊహించని షాక్.. మైక్‌లో గట్టి వార్నింగ్..

ABN , Publish Date - Oct 12 , 2026 | 11:26 AM

రాత్రివేళ ఎవరూ చూడటం లేదనుకుని రోడ్డుపక్కన చెత్త పడేసిన వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. ఓ స్వరం అతడిని హెచ్చరిస్తూ, పడేసిన చెత్తను తొలగించాలని కోరింది. ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందో అర్థంకాని ఆ వ్యక్తి కాసేపు అటూ ఇటూ చూస్తూ ఆశ్చర్యపోయాడు. చివరికి తన తప్పును తెలుసుకుని చెత్తను తిరిగి తీసుకెళ్లిపోయాడు.

చెత్త పడేసిన వ్యక్తికి ఊహించని షాక్.. మైక్‌లో గట్టి వార్నింగ్..
Greater Noida

ఇంటర్నెట్ డెస్క్: రాత్రివేళ ఎవరూ చూడటం లేదనుకుని రోడ్డుపక్కన చెత్త పడేసిన వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. ఓ స్వరం అతడిని హెచ్చరిస్తూ, పడేసిన చెత్తను తొలగించాలని కోరింది. ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందో అర్థంకాని ఆ వ్యక్తి కాసేపు అటూ ఇటూ చూస్తూ ఆశ్చర్యపోయాడు. అదే గొంతు మరో గట్టి హెచ్చరిక చేయడంతో చివరికి తప్పును తెలుసుకుని చెత్తను తిరిగి తీసుకెళ్లిపోయాడు. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ బీటా-1లో చోటుచేసుకోగా.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.


గ్రేటర్ నోయిడాలోని సెక్టార్ బీటా-1లో అక్టోబర్ 9న రాత్రి సుమారు 10 గంటలకు ఓ వ్యక్తి చిన్నారిని వెంటబెట్టుకుని రోడ్డుపైకి వచ్చాడు. తనను ఎవరూ గమనించడం లేదనుకొని గోడ పక్కన చెత్తను పడేసి వెళ్లిపోవడానికి ప్రయత్నించాడు. అయితే, అక్కడ రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ (RWA) ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో ఇదంతా రికార్డయ్యింది. చెత్త పడేసిన వ్యక్తి అక్కడి నుంచి వెళ్లిపోతుండగా.. సీసీటీవీ ఫుటేజీని పర్యవేక్షిస్తున్న వ్యక్తి పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టమ్ ద్వారా స్పందించాడు. అక్కడ చెత్త ఎందుకు వేశావని ప్రశ్నిస్తూ, వెంటనే దాన్ని తొలగించాలని హెచ్చరించాడు. ఊహించని విధంగా వినిపించిన ఆ మాటలతో సదరు వ్యక్తి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. తనను ఎవరు పిలుస్తున్నారో తెలియక చుట్టూ చూశాడు.


ఆ తర్వాత మైక్ ద్వారా మళ్లీ హెచ్చరిక జారీ చేశారు. చెత్తను తొలగించకపోతే మరుసటి రోజు జరిమానా విధిస్తామని స్పష్టం చేశారు. దీంతో చేసేదేమీ లేక, తాను పడేసిన చెత్తను తిరిగి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. కాగా, సెక్టార్ బీటా-1లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు స్థానిక రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సీసీటీవీ కెమెరాల ద్వారా నిఘా పెట్టింది. బహిరంగ ప్రదేశాల్లో, గోడల పక్కన చెత్త వేసేవారిని గుర్తించేందుకు ఈ వ్యవస్థను ఉపయోగిస్తోంది. నిబంధనలు ఉల్లంఘించే వారిని గుర్తించి జరిమానాలు విధించే చర్యలు కూడా చేపడుతోంది.


ఈ వార్తలు కూడా చదవండి

‘రోడ్లు డ్రైవింగ్ కోసమే కదా?’.. ముగ్గురి మృతిపై నిందితుడి వ్యాఖ్యలు..

హిట్ అండ్ రన్ కేసులో రూ.2 లక్షల పరిహారం.. పొందే మార్గమిదే!

Updated Date - Oct 12 , 2026 | 11:33 AM