కామారెడ్డిలో ఏటీఎం చోరీ.. అర్థరాత్రి నైటీలో వచ్చి..
ABN , Publish Date - Oct 12 , 2026 | 10:31 AM
తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో విచిత్రమైన రీతిలో ఏటీఎం చోరీ జరిగింది. మహిళల వేషధారణలో నైటీలు ధరించిన కొందరు దుండగులు.. అంబులెన్స్‌లో వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎంలో దొంగతనం చేశారు.
కామారెడ్డి: తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో విచిత్రమైన రీతిలో ఏటీఎం చోరీ జరిగింది. మహిళల వేషధారణలో నైటీలు ధరించిన కొందరు దుండగులు.. అంబులెన్స్‌లో వచ్చి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) ఏటీఎంలో దొంగతనం చేశారు. ఈ ఘటన కామారెడ్డి-బాన్సువాడ ప్రధాన రహదారిపై గాంధారి వద్ద చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
గత ఆదివారం తెల్లవారుజామున గాంధారిలోని ఎస్‌బీఐ ఏటీఎం వద్దకు కొందరు దుండగులు వచ్చారు. మహిళల నైటీలు ధరించిన కేటుగాళ్లు.. అంబులెన్స్‌లో అక్కడికి చేరుకున్నారు. ముఖానికి మాస్కులు, తలకు టోపీలు ధరించడంతో పాటు వేలిముద్రలు పడకుండా చేతులకు గ్లౌజులు కూడా వేసుకున్నారు. సుమారు ఒంటి గంట నుంచి 1:30 గంటల మధ్య ఎస్‌బీఐ ఏటీఎంపై విరుచుకుపడ్డారు. గ్యాస్ కట్టర్లతో దానిని ధ్వంసం చేసి నగదు దోచుకెళ్లారు. అనంతరం దీనిని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీమ్ సహాయంతో ఆధారాలను సేకరించారు. నిందితులను పట్టుకునేందుకు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు.
అయితే, ఏటీఎంలో ఎంత నగదు చోరీకి గురైందనే విషయం అధికారికంగా వెలువడలేదు. పోలీసుల విచారణలో దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా, ఇటీవల కరీంనగర్ శివార్లలోని దుర్షెడ్, తిమ్మాపూర్ ప్రాంతాల్లోనూ రెండు ఎస్‌బీఐ ఏటీఎంలను లక్ష్యంగా చేసుకుని చోరీలు జరిగినట్లు వార్తలు వెలువడ్డాయి. ఆ ఘటనల్లోనూ గ్యాస్ కట్టర్లు, మహిళల దుస్తులను ఉపయోగించిన దుండగులు నగదును దోచుకెళ్లినట్లు సమాచారం. తాజా ఘటనకు, గత ఘటనలకు మధ్య ఏదైనా సంబంధం ఉందా అనే అంశంపైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చోరీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
ఈ వార్తలు కూడా చదవండి
వ్యాపారి కిడ్నాప్ కేసులో బిగ్ ట్విస్ట్.. రూ. కోటిన్నర ఇచ్చి విడిపించారా..?
ఆర్టీసీ-మెట్రో కామన్ పాస్ ధరలపై ప్రభుత్వం పునఃసమీక్ష