మీరు తాగే పాలల్లో డిటర్జెంట్ ఉందా..? కనిపెట్టండిలా..
ABN , Publish Date - Sep 06 , 2026 | 05:59 PM
పలుచగా ఉన్న పాలను చిక్కగా మార్చడం కోసం కొందరు వ్యాపారులు అందులో డిటర్జెంట్ కలుపుతున్నారు. అందుకే పాలల్లో డిటర్జెంట్ ఉందా లేదా అనేది ఎలా తెలుసుకోవాలో ఫుడ్ అథారిటీ తెలిపింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇదివరకు మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పు ఉందా.. అని ప్రశ్నలు వినబడినట్టు ప్రస్తుతం మీరు తాగే పాలల్లో డిటర్జెంట్ ఉందా అని ప్రశ్నలు వినపడుతున్నాయి. ఈ మధ్య కాలంలో కొందరు వ్యాపారులు పాలల్లో చిక్కదనం రావడం కోసం అందులో డిటర్జెంట్ లాంటి పదార్థాలను కలుపుతున్నారు. ఈ పాలు సేవించిన వారు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. అందుకే పాలల్లో డిటర్జెంట్ ఉందో లేదో తెలుసుకోవడానికి ఇంట్లోనే ఎలా టెస్ట్ చేయాలో ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ( ఎఫ్ఎస్ఎస్ఏఐ) తెలిపింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో పోస్ట్ చేసింది.
వినియోగదారులు నాణ్యమైన, చిక్కటి పాలు తాగాలని భావిస్తుంటారు. అయితే, ప్రస్తుత కల్తీ కాలంలో కొందరు వ్యాపారస్థులు వినియోగదారుల అభిరుచి మేరకు పాలను కల్తీ చేసి విక్రయిస్తున్నారు. రంగు, రుచి, చిక్కదనం కోసం ప్రమాదకరమైన కెమికల్స్ కలిపి పాలను కల్తీ చేస్తున్నారు. దాదాపు వ్యాపారులు పాలలో చిక్కదనం పెంచడానికి డిటర్జెంట్ మిక్స్ చేస్తుంటారు. అది తెలియని వినియోగదారులు ఆ పాలను తాగి రోగాల బారిన పడుతుంటారు. మరి మనం తాగే పాలు స్వచ్ఛమైనవేనా? ఆ పాలలో డిటర్జెంట్ ఏమైనా కలిపారా? అనేది ఈజీగా, మన ఇంట్లోనే తెలుసుకోవడానికి అవకాశం ఉంది. అదెలాగో ఇక్కడ చూద్దాం..
మొదట పరీక్షించాలనుకుంటున్న పాల నుంచి 5-10 ఎమ్ఎల్ వరకు శాంపిల్ తీసుకోండి
ఆ పాలను ఒక గ్లాస్‌లో పోయండి
తరువాత గ్లాస్‌ను వేగంగా షేక్ చేయండి
షేక్ చేసిన తరువాత పాలల్లో ఎలాంటి బబుల్స్ (బుడగలు) ఏర్పడకపోతే ఆ పాలు డిటర్జెంట్ లేని స్వచ్ఛమైన పాలు. అదే బబుల్స్ ఉంటే పాలల్లో డిజర్జెంట్ కలిసిందని అర్థం.
కల్తీ పాలను అరికట్టేదెలా?
ఇలా కల్తీ జరిగిన పాలను అరికట్టడానికి ఎఫ్ఎస్ఎస్ఏఐ పలు సూచనలు చేసింది. అవి..
నియమ నిబంధనలను ఎల్లవేళలా పాటించే పేరు పొందిన బ్రాండ్ల నుంచే పాలను కొనాలి.
పాల ప్యాకెట్ కొనుగోలు చేసిన వెంటనే, దానిపైన సేఫ్టీ లోగోలను పరిశీలించాలి. సీల్ సరిగానే ఉందా.. లీకేజీ అవుతుందా.. అనేవి పరీక్షించాలి. పాలలోని ఇన్‌గ్రిడియెంట్స్‌ను చెక్ చేసుకోవాలి.
ప్యాకెట్ మీద ఎఫ్ఎస్ఎస్ఏఐ ‘ట్రస్ట్ మార్క్’ ఉందో లేదో గమనించాలి.
ఇవీ చదవండి:
ఈ కూరగాయల్లో ఆక్సలేట్లు ఎక్కువ.. కిడ్నీలో రాళ్లున్నవారు జాగ్రత్త
గ్యాస్, గుండెపోటు మధ్య తేడా ఏంటి? ఈ విషయాలు తెలుసుకోండి