Share News

కొందరు డాక్టర్ల ఇష్టారాజ్యం..రోగులకు ప్రాణ సంకటం

ABN , Publish Date - Aug 20 , 2026 | 11:29 AM

తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లో కొందరు వైద్యాధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.

కొందరు డాక్టర్ల ఇష్టారాజ్యం..రోగులకు ప్రాణ సంకటం
Osmania Hospital Doctors

  • ఉస్మానియా ఆస్పత్రిలో సమయానికి రాని వైద్యులు, సిబ్బంది

  • మాన్యువల్‌ అటెండెన్స్‌ రిజిస్టర్లు మరిచిన వైనం

  • మంత్రి మందలించినా మారని తీరు

  • రాత్రి అయితే జూనియర్‌ డాక్టర్లే దిక్కు

  • మెరుగైన వైద్యం అందక ప్రైవేట్‌ బాట పడుతున్న రోగులు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన ఉస్మానియా జనరల్‌ హాస్పిటల్‌లో కొందరు వైద్యాధికారులు, సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. రోగులకు ప్రాణం పోయాల్సిన వారు బాధ్యతను గాలికొదిలేసి వ్యవహరిస్తున్నారు. ఉదయం 9.30 గంటలకు రావాల్సిన ఆసుపత్రి వైద్యాధికారి 10.30 తర్వాత వస్తుండడంతో ప్రొఫెసర్లు, అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు సైతం అదే బాటలో నడుస్తున్నారు. నిబంధనల ప్రకారం బయోమెట్రిక్‌ హాజరుతోపాటు మాన్యువల్‌ రిజిస్టర్లలో సంతకం చేయాల్సి ఉండగా రెండేళ్లుగా దాని ఊసే ఎత్తడం లేదు. కేవలం పీజీ వైద్యులు, సీనియర్‌ రెసిడెంట్లు, కిందిస్థాయి సిబ్బందికి మాత్రమే రిజిస్టర్లు పెడుతున్నారు. ఆసుపత్రి సూపరింటెండెంట్‌ కఠినంగా వ్యవహరించకపోవడం, రిజిస్టర్లను మెయింటైన్‌ చేయకపోవడంతోనే సిబ్బంది పూర్తి నిర్లక్ష్యం వహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


మంత్రి ఆదేశాలకూ ‘డోంట్‌ కేర్‌’

గత నెలలో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల సూపరింటెండెంట్లతో ప్రత్యేక రివ్యూ మీటింగ్‌ నిర్వహించారు. అటెండెన్స్‌, గవర్నెన్స్‌, రిజిస్టర్ల నిర్వహణకు సంబంధించిన రికార్డులన్నీ తీసుకురావాలని ఆదేశాలు జారీ చేశారు. అయినప్పటికీ సదరు మీటింగ్‌కు ఉస్మానియా నుంచి ఎలాంటి రికార్డులూ తీసుకెళ్లలేదంటే వారి నిర్లక్ష్యం, బేఖాతరు అర్థమవుతుంది. ఆ సమావేశం తర్వాతైనా రికార్డులను పక్కాగా మెయింటెయిన్‌ చేయాలన్న సోయి అధికారుల్లో లోపించింది.


పెద్ద ప్రమాదంతో వచ్చినా పట్టింపేదీ?

ఉస్మానియా ఆస్పత్రి వైద్యాధికారులు, సిబ్బంది నిర్లక్ష్యాన్ని ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడిన సునీత ఉదంతం తేటతెల్లం చేసింది. నాంపల్లిలో నివాసం ఉండే సునీత గన్‌ ఫౌండ్రిలోని ఎస్‌బీఐ హౌస్‌ కీపింగ్‌ ఉద్యోగినిగా పనిచేస్తోంది. ఈ నెల 12న ఆబిడ్స్‌ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా ఓ ప్రముఖ సినీ నిర్మాత కారు ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సునీత తీవ్రంగా గాయపడింది. తీవ్ర రక్తస్రావంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి, అనంతరం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.


city4.2.jpgఅక్కడ అత్యవసరంగా తీయాల్సిన ఎక్స్‌రేను మిషన్‌ పనిచేయడం లేదంటూ అర్ధరాత్రి వరకు ఆమెను, ఆమెకు తోడుగా వచ్చిన కుటుంబ సభ్యులను తీవ్ర ఇబ్బందులకు గురిచేశారు. 13వ తేదీన కూడా జూనియర్‌ డాక్టర్లు మినహా సీనియర్లు చూడలేదు. పరిస్థితి మరింత విషమించి ఆమె ప్రాణాపాయ స్థితికి చేరుకోవడంతో కుటుంబ సభ్యులు ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ఉస్మానియా వైద్యులను నమ్ముకుంటే ప్రాణాలు దక్కవని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఒక్క సునీత విషయంలోనే కాదు.. ఉస్మానియాలో ప్రతినిత్యం జరుగుతుంది ఇదేనని పలువురు ఆరోపిస్తున్నారు.


రాత్రి 8 గంటలు దాటితే జూనియర్‌ డాక్టర్లే..

ఉస్మానియా ఆస్పత్రిలో రాత్రి 8 గంటలు దాటితే జూనియర్‌ డాక్టర్లు తప్పితే సీనియర్లు కనిపించరు. అత్యవసర వార్డులు, ఐసీయూలను సైతం హౌస్‌ సర్జన్లు, జూనియర్‌ పీజీలకు వదిలేస్తారనే ఆరోపణలున్నాయి. ప్రతీనిత్యం 2000 మంది వరకు ఓపీ, 250కి పైగా అత్యవసర అడ్మిషన్లు జరిగే ఈ ఆస్పత్రిలో వైద్య సేవలు దారుణంగా ఉండడం ప్రతి ఒక్కరినీ కలిచివేస్తోంది.


ఈ వార్తలు కూడా చదవండి:

స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు.. ఈ రోజు మీ నగరంలో పసిడి ధరలు ఎలా ఉన్నాయంటే..

రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల న్యాయ పోరాటం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - Aug 20 , 2026 | 11:29 AM