రూ.20 లంచం కేసులో 30 ఏళ్ల న్యాయ పోరాటం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు..
ABN , Publish Date - Aug 20 , 2026 | 07:50 AM
రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణతో ప్రారంభమైన కేసు దాదాపు 30 ఏళ్ల పాటు న్యాయస్థానాల్లో కొనసాగింది. చివరకు ఈ కేసులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
ఇంటర్నెట్ డెస్క్: రూ.20 లంచం తీసుకున్నారనే ఆరోపణతో ప్రారంభమైన కేసు దాదాపు 30 ఏళ్ల పాటు న్యాయస్థానాల్లో కొనసాగింది. చివరకు ఈ కేసులో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను సుప్రీంకోర్టు నిర్దోషులుగా ప్రకటించింది. లంచం కేసులో కేవలం నగదు స్వాధీనం కావడం మాత్రమే నేరాన్ని నిరూపించడానికి సరిపోదని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది (Rs 20 bribe case).
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లా బేచరి గ్రామ పంచాయతీ కార్యాలయంలో 1996లో ఈ వ్యవహారం చోటుచేసుకుంది. విద్యా రాయితీ పొందేందుకు అవసరమైన ఆదాయ ధ్రువీకరణ పత్రం కోసం వచ్చిన ఓ విద్యార్థి నుంచి లంచం డిమాండ్ చేశారని ఆరోపణలు వచ్చాయి. మొత్తం రూ.120 లంచం అడిగారని, అందులో రూ.100ను క్లర్క్‌కు, రూ.20ను ప్యూన్‌కు ఇవ్వాలని చెప్పినట్లు కోర్టులో ప్రాసిక్యూషన్ ఆరోపించింది. వారిని అవినీతి నిరోధక శాఖ అధికారులు వల పన్ని పట్టుకున్నారు (Supreme Court bribe case).
విద్యార్థి చివరకు ప్యూన్‌కు రూ.20 మాత్రమే ఇచ్చాడు. క్లర్క్‌కు రూ.100 ఇవ్వలేదు. దాదాపు మూడు దశాబ్దాల పాటు కొనసాగిన ఈ న్యాయ పోరాటానికి సుప్రీంకోర్టు తుది ముగింపు పలికింది. దిగువ కోర్టులు ఇచ్చిన తీర్పులను పక్కనపెట్టి ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులను నిర్దోషులుగా ప్రకటించింది. ఫిర్యాదుదారు ఇచ్చిన వాంగ్మూలాల్లో లంచం మొత్తానికి సంబంధించి భిన్నమైన వివరాలు ఉండటాన్ని కూడా కోర్టు పరిగణనలోకి తీసుకుంది (Supreme Court acquittal).
లంచం కేసులో నిందితుడి వద్ద నుంచి డబ్బు స్వాధీనం కావడం ముఖ్యమైన సాక్ష్యం కావొచ్చని, కానీ లంచం డిమాండ్ చేసినట్లు విశ్వసనీయమైన ఆధారం లేకుండా కేవలం నగదు స్వాధీనం ఆధారంగా శిక్ష విధించలేమని స్పష్టం చేసింది ( 30 year legal battle). ప్యూన్ తనంతట తాను లంచం డిమాండ్ చేయలేదని ఫిర్యాదుదారు పేర్కొన్న అంశాన్ని కూడా పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిపింది.
ఇవి కూడా చదవండి:
బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి మృతి..