Share News

సుతార్‌ సూపర్‌ 10

ABN , Publish Date - Aug 20 , 2026 | 06:08 AM

శ్రీలంక మిడిలార్డర్‌ బ్యాటర్లు పోరాడినా.. యువ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ (4/76, 6/55) పది వికెట్ల మాయాజాలంతో టీమిండియాకు 600వ టెస్ట్‌లో అద్భుత విజయాన్ని అందించాడు...

సుతార్‌ సూపర్‌ 10

గాలె: శ్రీలంక మిడిలార్డర్‌ బ్యాటర్లు పోరాడినా.. యువ స్పిన్నర్‌ మానవ్‌ సుతార్‌ (4/76, 6/55) పది వికెట్ల మాయాజాలంతో టీమిండియాకు 600వ టెస్ట్‌లో అద్భుత విజయాన్ని అందించాడు. రెండు టెస్ట్‌ల సిరీ్‌సలో భాగంగా లంకతో జరిగిన తొలి మ్యాచ్‌లో భారత్‌ 165 పరుగుల తేడాతో గెలిచింది. సిరీ్‌సలో 1-0 ఆధిక్యంలో నిలిచింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌, సౌతాఫ్రికా చేతిలో ఘోర ఓటములు చవిచూసిన గిల్‌సేనకు ఈ గెలుపుతో కాస్త ఊరట దక్కినట్టయింది. 372 పరుగుల లక్ష్య ఛేదనలో.. ఆటకు ఐదో, ఆఖరి రోజైన బుధవారం ఓవర్‌నైట్‌ స్కోరు 84/4తో రెండో ఇన్నింగ్స్‌ కొనసాగించిన లంక 206 పరుగులకు ఆలౌటైంది. సోనాల్‌ దినుష (84), ధనంజయ డిసిల్వ (59) అర్ధ శతకాలు వృథా అయ్యాయి. సుతార్‌ 6 వికెట్లతో లంక పతనాన్ని శాసించగా.. పేసర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ రెండు వికెట్లు తీశాడు. దేవ్‌దత్‌ పడిక్కల్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు. రెండో టెస్ట్‌ కొలంబోలో ఆదివారం నుంచి జరగనుంది.

తొలి సెషన్‌లో ఎదురు నిలిచినా..: టాపార్డర్‌ను కూల్చినా.. మిడిలార్డర్‌ నుంచి ప్రతిఘటన ఎదురవడంతో విజయం కోసం భారత్‌ ఓపిగ్గా ఎదురు చూడాల్సి వచ్చింది. నిన్నటి బ్యాటర్లు ధనంజయ డిసిల్వ, సోనాల్‌ దినుష సిన్నర్లను సమర్థంగా ఎదుర్కొంటూ స్కోరుబోర్డును నడిపించారు. ఈ క్రమంలో ఐదో వికెట్‌కు 95 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకొన్న డిసిల్వను జడేజా అవుట్‌ చేసి బ్రేక్‌ ఇచ్చాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన నిరోషన్‌ డిక్‌వెల్లా (10)ను జైస్వాల్‌ మాటలతో కవ్వించాడు. ఈ క్రమంలో సహనం కోల్పోయిన డిక్‌వెల్లా.. ప్రసిద్ధ్‌ బౌలింగ్‌లో చెత్తషాట్‌కు అవుటయ్యాడు. ఈ దశలో సోనాల్‌కు కేశర (20) జత కలవడంతో లంక 175/6తో లంచ్‌కు వెళ్లింది. తిరిగొచ్చాక మానవ్‌ సుతార్‌ 76వ ఓవర్‌లో 3 వికెట్లతో లంక పనిబట్టాడు. తొలుత శతకం దిశగా సాగుతున్న సోనాల్‌ను క్యాచవుట్‌ చేసిన మానవ్‌.. ప్రభాత్‌ (0), లాహిరు కుమార (0)ను అవుట్‌ చేశాడు. ఆఖరుగా కేశరను కూడా సుతార్‌ పెవిలియన్‌ చేర్చాడు.


స్కోరుబోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: 462.

శ్రీలంక మొదటి ఇన్నింగ్స్‌: 284.

భారత్‌ రెండో ఇన్నింగ్స్‌: 193 .

శ్రీలంక రెండో ఇన్నింగ్స్‌: నిషాన్‌ (సి) ప్రసిద్ధ్‌ (బి) సిరాజ్‌ 6, లాహిరు ఉదార (సి) జురెల్‌ (బి) సుతార్‌ 16, పసిందు (ఎల్బీ) సుతార్‌ 0, కమిందు (సి) రాహుల్‌ (బి) ప్రసిద్ధ్‌ 2, ధనంజయ (సి) సుతార్‌ (బి) జడేజా 59, సోనాల్‌ (సి) జురెల్‌ (బి) సుతార్‌ 84, డిక్‌వెల్లా (సి) పంత్‌ (బి) ప్రసిద్ధ్‌ 10, కేశర (బి) సుతార్‌ 20, ప్రభాత్‌ (బి) సుతార్‌ 0, లాహిరు (సి) పంత్‌ (బి) సుతార్‌ 0, ఫెర్నాండో (నాటౌ ట్‌) 0; ఎక్స్‌ట్రాలు: 9; మొత్తం: 77.4 ఓవర్లలో 206 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-13, 2-14, 3-21, 4-47, 5-142, 6-156, 7-199, 8-199, 9-199, 10-206; బౌలింగ్‌: సిరాజ్‌ 9-2-15-1, మానవ్‌ 23.4-2-55-6, ప్రసిద్ధ్‌ 10-3-16-2, జడేజా 23-3-71-1, కుల్దీప్‌ 11-0-38-0, దేవ్‌దత్‌ 1-0-5-0.

600వ టెస్ట్‌లో భారత్‌ అద్భుత విజయం

తొలి టెస్ట్‌లో 165 పరుగులతో లంక చిత్తు

2

శ్రీలంకలో ఆ జట్టుపై భారత బౌలర్‌ సాధించిన అత్యుత్తమ టెస్ట్‌ ఇన్నింగ్స్‌ గణాంకాల్లో మానవ్‌ సుతార్‌ (6/55)ది రెండోస్థానం. రవిచంద్రన్‌ అశ్విన్‌ (6/46) ముందున్నాడు.

3

600 టెస్ట్‌లు ఆడిన మూడో జట్టుగా భారత్‌. 300వ, 400వ, 500వ మైలురాయి టెస్టుల్లో నెగ్గిన టీమిండియా.. ఇప్పుడు 600వ టెస్ట్‌లో కూడా విజయభేరి మోగించింది.

6

శ్రీలంకలో భారత్‌కు ఇది వరుసగా ఆరో విజయం. 2015లో చివరిసారి గాలెలో మనోళ్లు ఓడారు.‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’ ట్రోఫీతో దేవ్‌దత్‌ పడిక్కళ్‌

ఇవి కూడా చదవండి:

తండ్రైన ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ గ్లెన్ మాక్స్‌వెల్

కోహ్లీ సలహాలు నా జీవితాన్నే మార్చేశాయి: ఇంగ్లండ్ క్రికెటర్

Updated Date - Aug 20 , 2026 | 06:08 AM