Share News

బాల్యం చేతిలో బ్లడ్‌!

ABN , Publish Date - Aug 20 , 2026 | 07:11 AM

పాఠశాల అంటే పుస్తకాలు, పాఠాలు, ఆటలు, స్నేహాలు, భవిష్యత్తు కలలతో నిండిన ప్రదేశం. కానీ కొంతకాలం నుంచి బడి ఈడు పిల్లల చేతులు రక్తంతో తడుస్తున్నాయి. దారుణమైన నేరాలకు పాల్పడుతున్నాయి.

బాల్యం చేతిలో బ్లడ్‌!
Telangana child crime

  • పాఠశాల విద్యార్థుల్లో పెరుగుతున్న నేర ప్రవత్తి.. రాష్ట్రంలో పెరుగుతున్న నేరారోపిత బాలల సంఖ్య

  • తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణం.. డ్రగ్స్‌, మద్యం, సోషల్‌ మీడియాతో ప్రభావం

  • దేశంలో 9వ స్థానంలో తెలంగాణ.. పిల్లలను గమనించాలి.. సమస్యలు తెలుసుకోవాలి: నిపుణులు


హైదరాబాద్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా కొండమల్లేపల్లిలో స్కూల్‌ ప్రిన్సిపాల్‌ను ఇద్దరు పదో తరగతి విద్యార్థులు దారుణంగా పొడిచి చంపేశారు.. కూకట్‌పల్లిలో కొందరు విద్యార్థులు తమ తోటి విద్యార్థిని పాఠశాలలోనే కొట్టి చంపారు.. నిజామాబాద్‌లో హైస్కూల్‌ విద్యార్థులు తమ సహచర విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన ఘటన తాజాగా బయటికి వచ్చింది... ఇలా చెప్పుకొంటూ వెళితే ఎన్నో. పాఠశాల అంటే పుస్తకాలు, పాఠాలు, ఆటలు, స్నేహాలు, భవిష్యత్తు కలలతో నిండిన ప్రదేశం. కానీ కొంతకాలం నుంచి బడి ఈడు పిల్లల చేతులు రక్తంతో తడుస్తున్నాయి. దారుణమైన నేరాలకు పాల్పడుతున్నాయి. ఇలాంటి ఘటనలు సమాజాన్ని కలవరపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో కౌమార దశలోని విద్యార్థుల్లో క్రూరమైన నేర ప్రవృత్తిపై చర్చ జరుగుతోంది.


డ్రగ్స్‌, మద్యం... ఫోన్‌లో కళ్లముందు హింస..

విద్యార్థుల్లో మద్యం, మాదకద్రవ్యాలు, పొగాకు వినియోగం పెరగడం వారిలో నేరప్రవృత్తిని నాటుతున్నాయని.. అవి పిల్లల నిర్ణయ సామర్థ్యం, భావోద్వేగ నియంత్రణ, ప్రవర్తనపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇక సోషల్‌ మీడియాలో, ఓటీటీల్లో హింసాత్మక వీడియోలు, గ్యాంగ్‌ కల్చర్‌, సైబర్‌ బుల్లీయింగ్‌ వంటివి నేరప్రవృత్తి పెరిగేందుకు దారితీస్తున్నాయి. హింసను వినోదంగా చూపించే కంటెంట్‌, దూకుడు ప్రవర్తనను హీరోయిజంగా చూపించే సంస్కృతి, అశ్లీల వీడియోలు పిల్లల్లో ఆ తరహా మనస్తత్వాన్ని పెంచుతున్నాయి.

తల్లిదండ్రుల బాధ్యత కూడా ఎక్కువే!

ఇటీవల రాష్ట్రంలోని పాఠశాల విద్యార్థులపై హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఒక సర్వే చేసింది. ‘‘మీరు ఏం చేస్తే మీ తల్లిదండ్రులు సంతోషిస్తారు?’ అని దాదాపు 5వేల మంది విద్యార్థులను ప్రశ్నించగా.. 96శాతం విద్యార్థులు చెప్పిన సమాధానం ఒక్కటే. మంచి మార్కులొస్తే తల్లిదండ్రులు సంతోషిస్తారని.. మార్కులు తప్ప మరే విజయాలు సాధించినా సంతోషించరని చెప్పారు. ఈ ధోరణి ప్రధాన సమస్యగా మారిందని మనస్తత్వ నిపుణులు చెబుతున్నారు. మార్కులు, చదువుగురించే కాకుండా.. ‘ఈ రోజు ఎలా గడిచింది?, ఏమైనా సమస్య ఉందా?, ఎవరితోనైనా గొడవ జరిగిందా?, ఎవరైనా నిన్ను ఇబ్బంది పెడుతున్నారా? అని అడగడం కూడా ముఖ్యమని స్పష్టం చేస్తున్నా రు. ఒకరకంగా చిన్నారుల నేరాలకు పూర్తి బాధ్యత తల్లిదండ్రులదేనని, వారి పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నేరాలకు పాల్పడే పిల్లలతోపాటు తల్లిదండ్రులకూ కనీస శిక్షలు ఉంటే మైనర్ల నేరాలకు అడ్డుకట్ట పడుతుందని అంటున్నారు.


బాల నేరస్తుల్లో 9వ స్థానంలో రాష్ట్రం

జాతీయ నేరగణాంకాల బ్యూరో (ఎన్‌సీఆర్‌బీ) 2024 నివేదిక ప్రకారం.. దేశంలో బాల నేరస్తుల సంఖ్యలో తెలంగాణ 9వ స్థానంలో ఉంది. 5,037 మందితో బిహార్‌ ప్రథమ స్థానంలో ఉండగా, మహారాష్ట్ర (3,779), మధ్యప్రదేశ్‌ (3,474), తమిళనాడు (2,946), రాజస్థాన్‌ (2,827), ఉత్తరప్రదేశ్‌ (2,695) తర్వాతి స్థానాల్లో ఉన్నా యి. ఆంధ్రప్రదేశ్‌ (1,427 మంది)తో 10వ స్థానంలో ఉంది. సగటున దేశవ్యాప్తంగా లక్ష మంది చిన్నారుల్లో 8 మంది బాల నేరస్తులుగా ఉండగా.. తెలంగాణలో లక్షకు దాదాపు 14 మంది ఉన్నారు. 2023లో దేశంలో బాలనేరస్తుల సంఖ్య 34,878 మందిగా ఉండగా, 2024లో 11.2ు పెరిగి 42,633కి చేరింది.

తల్లిదండ్రులు, పాఠశాలలు ఏం చేయాలి.?

‘మా పిల్లలు ఇలా చేయరు’ అనే నమ్మకంతో సమస్యను కొట్టిపారేయకూడదని నిపుణులు చెబుతున్నారు. ‘‘పిల్లల ప్రవర్తనలో మార్పులు కనిపిస్తే ప్రశాంతంగా మాట్లాడాలి. ఆరోపణలు చేయకుండా వారి సమస్యలను వినాలి. అవసరమైతే మానసిక ఆరోగ్య నిపుణుల సహాయం తీసుకోవాలి. ప్రతి పాఠశాలలో తప్పనిసరిగా రెగ్యులర్‌ కౌన్సెలింగ్‌, యాంటీ-డ్రగ్‌ అవగాహన కార్యక్రమాలు ఏర్పాటుచేయాలి. విద్యార్థుల ప్రవర్తనలో మార్పులను ప్రారంభ దశలోనే గుర్తించి ప్రత్యేక కౌన్సెలింగ్‌ ఇప్పించాలి. డ్రగ్స్‌ ఒక్కటే కాదు కుటుంబ వాతావరణం, సోషల్‌ మీడియా, మానసిక ఒత్తిడి వంటి అంశాలు చిన్నారుల్లో నేర ప్రవత్తిని పెంచుతున్నాయి’’ అని స్పష్టం చేస్తున్నారు.


విద్యార్థిలో హింసాత్మక ధోరణికి 10 సంకేతాలు

  • చిన్న విషయాలకే తీవ్రమైన కోపం రావడం, వస్తువులు పగలగొట్టడం.

  • తల్లిదండ్రులు, టీచర్లు, తోటి విద్యార్థులతో తరచూ గొడవలు పడటం.

  • అకస్మాత్తుగా చదువుపై ఆసక్తి తగ్గడం, పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరించడం.

  • గతంలో స్నేహపూర్వకంగా ఉండేవాళ్లు ఒంటరిగా ఉండటం లేదా అందరినీ దూరం పెట్టడం.

  • హింసాత్మక వీడియోలు, కంటెంట్‌ లేదా గ్యాంగ్‌ కల్చర్‌పై అసాధారణ ఆసక్తి చూపించడం.

  • డబ్బు, మొబైల్‌ లేదా వ్యక్తిగత వస్తువుల విషయంలో అనుమానాస్పద మార్పులు కనిపించడం.

  • పొగాకు, మద్యం లేదా మాదకద్రవ్యాల వినియోగానికి సంబంధించిన సంకేతాలు కనిపించడం.

  • ‘ఎవరినైనా కొట్టాలి’, ‘చంపేస్తా’ వంటి బెదిరింపు మాటలు పదేపదే ఉపయోగించడం.

  • తోటి విద్యార్థులను బెదిరించడం, వేధించడం.

  • వ్యక్తిత్వంలో ఒక్కసారిగా తీవ్రమైన మార్పులు, కోపం, భయం, ఆందోళన, నిద్ర, ఆహార అలవాట్లలో మార్పులు కనిపించడం.


ఎలా పెంచాలో తల్లిదండ్రులకు తెలియట్లేదు..

ఉమ్మడి కుటుంబాల్లో పిల్లల పెంపకంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టేవారు. ఇంట్లో అందరూ కలిసి సమస్యలన్నీ చర్చించేవాళ్లు. పిల్లలు వారి సమస్యలను పెద్దలతో చెప్పేవారు. పిల్లల తీరును పెద్దలు గమనించి సరిదిద్దేవాళ్లు. ఉమ్మడి కుటుంబాలు కనుమరుగయ్యాయి. పిల్లలు అడిగిందల్లా కొనివ్వడం తప్ప.. తల్లిదండ్రులకు ఏమాత్రం తెలియట్లేదు. తల్లిదండ్రులు ఏదైనా కాదంటే పిల్లలు తట్టుకోలేకపోతున్నారు. దానిని సాధించేందుకు నేరాలు చేసేందుకూ వెనకాడట్లేదు. నేరం చేస్తే జరిగే పరిణామాలు, భవిష్యత్తు సమస్యల గురించి కనీస ఆలోచన ఉండటం లేదు. చిన్నారుల్లో నేరాలు తగ్గించాలంటే తల్లిదండ్రులదే ప్రధాన పాత్ర. మార్పు ఇంటి నుంచే ప్రారంభం కావాలి. పిల్లల మార్కుల గురించి మాత్రమే కాకుండా వారి ప్రవర్తన, ఆలోచనల్లో వస్తున్న మార్పులపై నిరంతరం పర్యవేక్షణ ఉండాలి.

- మీనా హరిహరన్‌, వ్యవస్థాపక డైరెక్టర్‌, సెంటర్‌ ఫర్‌ హెల్త్‌ అండ్‌ సైకాలజీ, హెచ్‌సీయూ


ఇవి కూడా చదవండి:

సుతార్‌ సూపర్‌ 10

బావిలోకి దూసుకెళ్లిన కారు.. నలుగురి మృతి..

Updated Date - Aug 20 , 2026 | 08:12 AM