Share News

టీచర్లు లేక ఆదిలాబాద్‌ జిల్లా కోసాయి ప్రభుత్వ పాఠశాలకు తాళాలు

ABN , Publish Date - Aug 20 , 2026 | 07:01 AM

మహాభారతంలో ద్రోణాచార్యుడి విగ్రహాన్నే గురువుగా భావించి విలువిద్యలో ప్రావీణ్యం పొందిన ఏకలవ్యుడి కథను తలపించే ఘటన ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతోంది. ఈ పాఠశాలకు ఉపాధ్యాయులు లేక కొద్ది రోజులుగా తరగతి గదుల తాళాలు కూడా తీయడం లేదు.

టీచర్లు లేక ఆదిలాబాద్‌ జిల్లా కోసాయి ప్రభుత్వ పాఠశాలకు తాళాలు

తలమడుగు, (ఆంధ్రజ్యోతి): మహాభారతంలో ద్రోణాచార్యుడి విగ్రహాన్నే గురువుగా భావించి విలువిద్యలో ప్రావీణ్యం పొందిన ఏకలవ్యుడి కథను తలపించే ఘటన ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతోంది. ఈ పాఠశాలకు ఉపాధ్యాయులు లేక కొద్ది రోజులుగా తరగతి గదుల తాళాలు కూడా తీయడం లేదు. కానీ, గురువులు లేకుంటేనేం.. పాఠశాల ఉంది కదా.. అనే రీతిలో కొందరు ఆదివాసీ, గిరిజన విద్యార్థులు రోజూ పాఠశాలకు వస్తున్నారు. పాఠశాల ఆవరణలో కూర్చోని పుస్తకాలు తీసి చదువుకుంటున్నారు. కాసేపు ఆటలు ఆడుకొని తిరిగి తమ ఇళ్లకు వెళ్లిపోతున్నారు.


కోసాయి పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు, 30 మంది విద్యార్థులు ఉన్నారు. ఆ ఇద్దరు ఉపాధ్యాయుల్లో ఒకరు రెండు నెలల క్రితం పదవీ విరమణ పొందారు. మరో ఉపాధ్యాయురాలు అనారోగ్యంతో మరణించారు. వీరి స్థానాలను మరొకరితో ఇప్పటిదాకా భర్తీ చేయలేదు. గ్రామంలోని పాఠశాలకు ఉపాధ్యాయులను నియమించాలని సర్పంచ్‌ రవి, గ్రామస్థులు ఐటీడీఏ అధికారులకు విజ్ఞప్తి కూడా చేశారు. అధికారులు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల కోసం ఓ ఉపాధ్యాయుడిని పంపగా.. వేడుకల అనంతరం ఆ ఉపాధ్యాయుడు వెళ్లిపోయారు. ఇలా ఉపాధ్యాయులు లేక కోసాయి పాఠశాల విద్యార్థులు కొంతకాలంగా పాఠాలకు దూరమైపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి కోసాయి పాఠశాలకు ఉపాధ్యాయులు నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

Updated Date - Aug 20 , 2026 | 07:01 AM